Share News

Andhra Jyothi Survey: సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:12 AM

సాధారణంగా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఏ ఉద్యోగి/అధికారికి అయినా నిర్దిష్టమైన విధులు ఉంటాయి. ఆఫీసుకు వెళితే సంబంధిత ఉద్యోగి విధుల్లో ఉన్నారా లేదా ఫీల్డ్‌కు వెళ్లారా అన్న విషయం తెలుస్తుంది.

Andhra Jyothi Survey: సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి

  • వాటి పనితీరు అస్తవ్యస్తం

  • కొందరు సిబ్బందికి పనిభారం

  • మరికొందరికి పనిలేక ఖాళీ

  • పలువురు వేళకు హాజరు కాని వైనం

  • ఎప్పుడొస్తారో.. ఎక్కడుంటారో?

  • సర్వేలు, ఫీల్డ్‌, ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి

  • పూర్తి స్థాయిలో అందని సేవలు

  • వ్యవస్థపై పర్యవేక్షణ లోపం

  • రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి

  • కొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా సేవలు

  • ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సాధారణంగా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఏ ఉద్యోగి/అధికారికి అయినా నిర్దిష్టమైన విధులు ఉంటాయి. ఆఫీసుకు వెళితే సంబంధిత ఉద్యోగి విధుల్లో ఉన్నారా? లేదా ఫీల్డ్‌కు వెళ్లారా? అన్న విషయం తెలుస్తుంది. కానీ గత జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇందుకు దాదాపు పూర్తిగా భిన్నం. కొందరు సిబ్బందికి పనిభారం ఎక్కువగా, మరికొందరికి అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇంకొందరు ఖాళీగా ఉంటున్నారు. ఆయా కేటగిరీల ఉద్యోగులకు వర్క్‌ రేషనలైజేషన్‌ అంతా గందరగోళం. పర్యవేక్షణ లేక చాలా చోట్ల సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఎప్పుడొస్తారో, ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. సర్వేలు, ఫీల్డ్‌, ఇతరత్రా పనులు అప్పగించడంతో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. కొందరు నిజంగానే విధులకు వెళ్లగా, మరికొందరు ఈ పేరు చెప్పి డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. రాష్ట్రంలో చాలా సచివాలయాల్లో పాలన అస్త్యవస్తంగా ఉంది. ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలు ఇవ్వకపోవడానికి గత జగన్‌ ప్రభుత్వం ఓ ప్రణాళిక అంటూ లేకుండా తీసుకురావడమే కారణం. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్పులు చేసినా వ్యవస్థ గాడిన పడటం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును పరిశీలించింది. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితి ఇదీ...


నంద్యాల జిల్లాలో...

నంద్యాల జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పలు చోట్ల మధ్యాహ్నానికేఇంటికి వెళ్తున్నారు. నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్‌లోని 15వ సచివాలయంలో 8 మంది ఉద్యోగులు పని చేయాల్సి ఉండగా.. 10.30 గంటలైనా ముగ్గురు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. నంద్యాల పట్టణంలో 48 వార్డు సచివాలయాలు ఉండగా.. 409 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 10.30 గంటల వరకు వీరిలో 60 శాతం మాత్రమే ముఖ హాజరు వేశారు. మిగిలిన 40శాతం మంది ఎప్పుడు పడితే అప్పుడు హాజరు వేసినట్లుగా నమోదైంది. విధులకు వచ్చిన తరువాత ఇతరత్రా సర్వేల పేరుతో చాలా మంది బయటికి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,353 మంది పని చేస్తుండగా, 2,788 మంది మాత్రమే ముఖ హాజరు వేసినట్లు నమోదైంది. 523 మంది ఉద్యోగులను వివిధ సచివాలయాలు, ప్రాంతాలు, కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై పని చేయిస్తున్నారు.

Untitled-2 copy.jpg


అనంతపురం జిల్లాలో...

అనంతపురం నగరంలోని 40, 41వ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 11 గంటలైనా సచివాలయానికి రాలేదు. ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. మిగతావారి గురించి ఆరా తీస్తే.. ఫీల్డ్‌లో ఉన్నారని చెప్పారు. చాలామందికి పనిలేకపోవడంతో హాజరు వేసి బయటికి వెళ్లిపోతున్నారని చెప్పారు. శింగనమల నియోజకవర్గ కేంద్రంలోని సచివాలయ ఉద్యోగుల తీరు మరీ దారుణంగా ఉంది. ఉదయం 10.30 గంటలైనా ఏ ఒక్కరూ సచివాలయానికి రాలేదు. కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆ తరువాత గ్రామ రెవెన్యూ అధికారి వచ్చారు. ఈ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండగా.. మధ్యాహ్నానికి ఐదుగురే విధులకు హాజరయ్యారు.

Untitled-2 copy.jpg

కడప జిల్లాలో..

జిల్లాలో 423 గ్రామ, 222 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం 5,383 మంది పనిచేస్తున్నారు. సచివాలయాల్లో ఉద్యోగులు ఫుల్‌.. పనులు నిల్‌ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సిబ్బందికి తగ్గట్లుగా పనులు లేవు. ఫీల్డ్‌ విజిట్‌ అంటూ కొందరు బయటనే కాలం గడుపుతూ మధ్యాహ్నానికి కార్యాలయాలకు వస్తున్నారు. మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు అసలు పనే ఉండడం లేదు. కొన్ని కేటగిరీల ఉద్యోగులకు పనిభారం ఉండగా, ఇంకొందరికి పెద్దగా పనిలేదు.

Untitled-2 copy.jpg


అన్నమయ్య జిల్లాలో..

రీగ్రూపింగ్‌ విధానంతో కొన్ని శాఖల సిబ్బందిపై పనిభారం పడుతోంది. మిగిలిన కొందరికి ఎటువంటి పని భారం ఉండడం లేదు. తాపీగా సచివాలయాలకు వచ్చి రోజుకు ఒకరో.. ఇద్దరో ప్రజలు వస్తే వారితో మాట్లాడి ఇంటికి వెళ్లిపోతున్నారు. కొందరు సిబ్బంది మాత్రం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంతో పాటు వివిధ సర్వేలతో సతమతమవుతున్నారు. చాలాచోట్ల సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. రాజంపేట పట్టణం 11వ వార్డు సాయినగర్‌ సచివాలయంలో 9 మంది సిబ్బందికి గానూ ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.

Untitled-2 copy.jpg

నెల్లూరు జిల్లాలో...

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లాలో పలు చోట్ల సిబ్బంది సరిగా విధులకు రావడంలేదు. నెల్లూరు నగర పరిధిలోని ఒక సచివాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉదయగిరి సచివాలయం-2లో ఇద్దరు మాత్రమే విధులకు హాజరయ్యారు. వరికుంటపాడు మండలం తోటలచెరువుపల్లిలో ముగ్గురు మాత్రమే కనిపించారు. వీఏవో 12 గంటలకు సచివాలయం నుంచి సెలవు తీసుకోగా, మహిళా పోలీస్‌, వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు మిగిలారు.

Untitled-2 copy.jpg

ఏలూరు జిల్లాలో...

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో చాలాచోట్ల సచివాలయాల సెక్రటరీలు లేరు. వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లు 85 శాతం మందే ఉన్నారు. ఏఎన్‌ఎంలు గ్రామ సచివాలయాల్లో కనిపించట్లేదు. ఉదయం పూట పిల్లలకు టీకాలు, గర్భిణుల వివరాల నమోదుకు ఎక్కువగా వెళ్లాల్సి ఉందని చెబుతున్నారు. సర్వేయర్లు అందుబాటులో ఉండట్లేదు. ఏలూరు ఇశ్రాయల్‌పేటలోని సచివాలయంలో ఏఎన్‌ఎం ఏడాదిగా రూ.6 వేల సొంత ఖర్చుతో డేటా పుస్తకాలు కొని నిర్వహిస్తున్నారు.

Untitled-2 copy.jpg


కోనసీమ జిల్లాలో...

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఉద్యోగులు హాజరు వేయించుకుని క్యాంపుల పేరుతో బయటకు వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఫిషరీస్‌, వెటర్నరీ, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు పనులు తక్కువగా ఉన్నాయి. ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సర్వేయర్లను అదనపు పనులకు నియమిస్తున్నారు. దాంతో ఎవరు ఎక్కడ పనిచేస్తున్నదీ స్పష్టత లేదు. మహిళా పోలీసులకు శిక్షణ లేకుండా డిజిటల్‌ అసిస్టెంట్లుగా పనులు అప్పగించారు. తుఫాన్‌తో పంటనష్టాలను వ్యవసాయ, ఉద్యాన శాఖలకు చెందిన అసిస్టెంట్లను గ్రామస్థాయిలో వినియోగించి మదింపు చేశారు.

Untitled-2 copy.jpg

గుంటూరు జిల్లాలో...

జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,979 మంది సిబ్బంది ఉండగా, 2 వేలమందికి మాత్రమే పనిఉంది. రీసర్వే కారణంగా విలేజ్‌ సర్వేయర్‌, వీఆర్‌ఓలకు పనులు ఉంటున్నాయి. సర్వే పూర్తయితే వారు ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉండే సిబ్బందిని గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, సీఆర్డీఏ, టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ వంటి చోట్ల విధుల్లోకి తీసుకున్నారు. దీంతో వార్డు అడ్మిన్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లపై భారం పడుతోంది. ఇలా రెండు చోట్ల విధుల్లో ఉండే పలువురు ఉద్యోగులు అక్కడ ఉన్నామని చెప్పి ఇక్కడ, ఇక్కడ ఉన్నామని చెప్పి అక్కడ విధులకు గైర్హాజరవుతున్న సందర్భాలు ఉన్నాయి. మరికొంత మంది ఫీల్డ్‌ విజిట్‌ పేరుతో ఆఫీసుకు రావడం లేదు.

తిరుపతి జిల్లాలో...

జిల్లాలో కొన్ని చోట్ల క్లస్టర్‌ పరిధిలోకి ఒకటికి మించి సచివాలయాలు వస్తున్నాయి. కొందరు ఉద్యోగులు క్లస్టర్‌ పరిధిలో రెండు చోట్ల విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో ఆయా ఉద్యోగులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, ఫిషరీస్‌, వెటర్నరీ అసిస్టెంట్‌లకు. కేవలం రబీ, ఖరీఫ్‌, మామిడి కోతల సమయాల్లోనే పని ఉంటోంది. చాలా సచివాలయాల్లో ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం పలుగోడు సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ మినహా ఇతరులు లేరు. పంచాయతీ కార్యదర్శి గదిలోని టేబుల్‌పై ఫైళ్లన్నీ చిందరవందరగా పడివున్నాయి.

Untitled-2 copy.jpg


తూర్పు గోదావరి జిల్లాలో..

జిల్లాలో 512 సచివాలయాలు ఉన్నాయి. 4,278 ఉద్యోగులు పనిచేస్తున్నారు. పలు సచివాలయాల్లో ఏ ఉద్యోగి ఎక్కడికి వెళుతున్నారనే సమాచారం ఉండడం లేదు. శానిటేషన్‌, మహిళా పోలీస్‌, ఏఎన్‌ఎంలు ఖాళీగా ఉంటున్నారు. కొన్ని చోట్ల మహిళా పోలీసులు ఉదయం వచ్చి సంతకం పెట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మళ్లీ సాయంత్రం వచ్చి సంతకం పెడుతున్నారు. ఏఎన్‌ఎంల పరిస్థితి ఇలాగే ఉంది. ఫీల్డ్‌లో ఉన్నామని చెబుతుంటారు. వీఆర్వోలు ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. సర్వేయర్లు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదు.

అల్లూరి జిల్లాలో...

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణ లోపించడంతో ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ప్రజలు పదే పదే సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చాలా తక్కువ సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన సిబ్బంది ఏమి చేస్తున్నారనే దానిపై స్పష్టత లేని పరిస్థితి. అనేకచోట్ల అటెండెన్స్‌ సక్రమంగా వేయకపోవడం, తమ పర్యటన వివరాలు నమోదు చేయకపోవడం చేస్తున్నారు. డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో, వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు పని అధికంగా ఉండగా.. మహిళా పోలీస్‌, వ్యవసాయ/ఉద్యానవన అసిస్టెంట్‌, సర్వేయర్లకు పని లేని పరిస్థితి.

పల్నాడు జిల్లాలో...

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో గ్రామ సచివాలయాల్లోని 212 సిబ్బందిలో 83 మంది సెలవు పెట్టారు. వినుకొండ మండలంలోని పెద్దకంచర్ల సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఇద్దరు సిబ్బంది మాత్రమే వచ్చారు. మాచర్ల పట్టణం శుద్ధగుంతల సచివాలయంలో ఆరుగురికి ఇద్దరు మాత్రమే విధుల్లో ఉన్నారు. వెల్దుర్తి మండలం మండాది సచివాలయంలో ఉదయం 10:45 గంటలకు వీఆర్వో మాత్రమే విధులకు హాజరయ్యారు. మండల పరిధిలో 95 మంది సిబ్బందిలో ఉదయం 11:41 గంటలకు 38 మంది మాత్రమే బయోమెట్రిక్‌ హాజరు వేశారు. విజయపురిసౌత్‌-2లో ఆరుగురికి గాను ముగ్గురు మాత్రమే హాజరయ్యారు.

Untitled-2 copy.jpg


చిత్తూరు జిల్లాలో...

సచివాలయాల రీగ్రూపింగ్‌తో చిత్తూరు జిల్లాలో సత్ఫలితాలు వస్తున్నాయి. గతంలో సచివాలయాల్లో లెక్కకు మించి ఉద్యోగులు ఖాళీగా ఉండేవారు. ఇప్పుడు మహిళా పోలీసులు తప్ప మిగిలిన వారంతా పనుల్లో బిజీగా ఉన్నారు. జిల్లాలో 4,088 మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తుండగా, వైసీపీ హయాంలో వెయ్యి పోస్టుల లోటు ఉండేది. రీగ్రూపింగ్‌ వల్ల ప్రస్తుతం 917 పోస్టులు మిగులులో ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లాలో పలు సచివాలయాల్లో ఉదయం 10.30 గ ంటలకు పలువురు సిబ్బంది హాజరు వేసుకుని ఫీల్డ్‌వర్క్‌ అంటూ బయటకు వెళ్తున్నారు. విజయనగరంలోని కేఎల్‌ పురం 55వ సచివాలయంలో పదిమంది సిబ్బందికి గాను ఓ పోస్టు ఖాళీగా ఉండగా ఉదయం 11.30 గంటలకు నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన వారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారని తోటి సిబ్బంది తెలిపారు.

కాకినాడ జిల్లాలో...

జిల్లాలో పలు చోట్ల ఉదయం 11 గంటలు దాటినా ఒకరిద్దరు మినహా మిగిలిన వారి జాడే కనిపించలేదు. అడిగితే ఫీల్డ్‌ వర్క్‌కు వెళ్లారంటూ సమాధానం వచ్చింది. సామర్లకోట నీలమ్మచెరువు వద్ద ఉన్న సచివాలయం, పోలీ్‌సస్టేషన్‌ వెనుక ఉన్న సచివాలయాల్లో అడ్మిన్‌లు మినహా ఇతర సిబ్బంది కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అనేక సచివాలయాల్లో సిబ్బంది సమాచారం ఇవ్వకుండా సెలవులపై వెళ్తున్నారు. ప్రస్తుతం రీసర్వే తప్పిదాలు అధికంగా ఉండటంతో జిల్లావ్యాప్తంగా సర్వేయర్లపై ఒత్తిడి ఉంది.


శ్రీకాకుళం జిల్లాలో...

జిల్లాలో 6,416 మంది విధులు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల పూర్తిస్థాయిలో సిబ్బంది హాజరు కాలేదు. ఒక్కో సచివాలయంలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురం, మామిడివలస మేజర్‌ పంచాయతీల్లో సిబ్బంది అందుబాటులో ఉండట్లేదని స్థానికులు చెప్పారు. రెండేసి సచివాలయాలకు ఒకరే సిబ్బంది కావడంతో మరింత ఇబ్బంది ఉంది.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 6,122 మంది పనిచేస్తున్నారు. మహిళా పోలీస్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ వంటి వారికి పెద్దగా పనేమీ లేదు. వ్యవసాయ, వెటర్నరీ, సర్వే అసిస్టెంట్లకు పరిమితంగా పనులు ఉంటున్నాయి. సర్వేల పేరుతో యంత్రాంగం కూడా సచివాలయ సిబ్బందిని గందరగోళం చేస్తోంది. ఎప్పుడు ఏ సర్వే వస్తుందో, ఎవరికి ఏ బాధ్యత ఇస్తారో, ఆ సర్వే కోసం సిబ్బంది ఏ సమయంలో ఎక్కడ పనిచేస్తారో స్పష్టత లేదు. దీంతో చాలామంది సర్వేల పేరుతో కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. చాలా సచివాలయాల్లో ఇద్దరు, ముగ్గురు మించి సిబ్బంది కనిపించడం లేదు.

Untitled-2 copy.jpg

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లాలో పలు సచివాలయాల్లో ముగ్గురు, నలుగురు సిబ్బంది మాత్రమే పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మిగతా ఉద్యోగులకు ఒకటో తేదీ పింఛన్‌ పంపిణీ తప్ప మిగిలిన రోజుల్లో పెద్దగా పనులు లేవు. కౌతాళం మండలం బాపురం సచివాలయంలో 9 మంది సిబ్బందికి గానూ గ్రామ సర్వేయర్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీస్‌ను మాత్రమే నియమించారు. మిగిలిన ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ నలుగురిలో మహిళా పోలీస్‌ తిరుపతిబాయి ఒక్కరే విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మిగిలిన ముగ్గురు విధులకు హాజరు కాలేదు. గ్రామస్థులను విచారిస్తే మహిళా పోలీస్‌ మినహా మిగిలిన ఉద్యోగులు ఎప్పుడొస్తారో తెలియదని అంటున్నారు. పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలోని మూడో సచివాలయంలో సిబ్బంది లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. 11.30 గంటల వరకు సిబ్బంది కార్యాలయానికి హాజరు కాలేదు.

Untitled-2 copy.jpg


శ్రీసత్యసాయి జిల్లాలో...

జిల్లాలో చాలా సచివాలయాల్లో ఉదయం 11గంటలైన సిబ్బంది విధులకు హాజరు కాలేదు. కొందరు బయోమెట్రిక్‌ వేసి.. విధుల పేరిట బయటకు వెళ్లిపోయారు. ధర్మవరం మండలం మల్లాకాల్వ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ మాత్రమే కనిపించారు. చెన్నేకొత్తపల్లి సచివాలయం-2 తలుపులు ఉదయం 10-30గంటలైనా తెరుచుకోలేదు.

పార్వతీపురం మన్యం జిల్లాలో..

జిల్లాలో 312 గ్రామ, 38 వార్డు సచివాలయాలు ఉన్నాయి. పార్వతీపురం నియోజకవర్గం అడ్డాపుశీల సచివాలయ గ్రామ సర్వేయర్‌ నెల రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. కనీసం సెలవు కూడా పెట్టలేదు. పాలకొండ నియోజకవర్గం లివిరి సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగిలిన ఉద్యోగులు కనిపించలేదు. సాలూరు నియోజకవర్గం మక్కువ ఒకటో నంబర్‌ సచివాలయంలో 8 మంది ఉద్యోగులకు వీఆర్‌వో ఒక్కరే కార్యాలయంలో ఉన్నారు.

విశాఖపట్నం జిల్లాలో...

విశాఖపట్నం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అంతా ప్రస్తుతం రకరకాల సర్వేలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 14 రకాల సర్వేలు జరుగుతున్నాయి. దాంతో అత్యధికులు క్షేత్రస్థాయి విధులకు వెళుతున్నారు. జీవీఎంసీ పరిధిలో 572 వార్డు సచివాలయాలు ఉండగా, 4,386 మంది పనిచేస్తున్నారు. వీరిలో 225 మంది వివిధ కారణాలతో విధులకు ధీర్ఘకాలంగా హాజరుకావడం లేదు. కొన్ని కేటగిరీల ఉద్యోగులకు తగిన పని లేదు.


కృష్ణా జిల్లాలో...

జిల్లాలో 508 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. అడ్మిన్‌, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ మినహా మిగిలిన వారెవ్వరూ అందుబాటులో ఉండటం లేదు. రీగ్రూపింగ్‌ తరువాత వీఆర్వో, ప్లానింగ్‌, వ్యవసాయ, ఎమినిటీ సెక్రటరీలతో పాటు ఏఎన్‌ఎం రెండేసి సచివాలయాల్లో పనిచేయాల్సి వస్తోంది. దీంతో వీరు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని పరిస్థితి. మహిళా పోలీసులు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. కొందరు సర్వేయర్లు 2 గంటలు విధులు నిర్వహించి మిగిలిన 6 గంటలు ప్రైవేటు పనులు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో...

జిల్లాలో కొన్ని కేటగిరీల సచివాలయ ఉద్యోగులపై సర్వేల పేరుతో, ఇతరత్రా మోపుతున్న పనులతో పనిభారం ఎక్కువగా ఉంటోంది. మరికొన్ని కేటగిరీ పోస్టులకు పని చాలా తక్కువుగా ఉంటోంది. విజయవాడ నగరంలోని 287 వార్డు సచివాలయాల పరిధిలో 250 మంది శానిటరీ సెక్రటరీలు ఉన్నారు. నగరంలో ప్రజారోగ్యశాఖ పరిధిలో అతిపెద్ద శానిటరీ వ్యవస్థ ఉన్నందున వీరి సేవలు దాదాపుగా అవసరం లేదనే చెప్పవచ్చు. వీరిని ఖాళీలు ఉన్నచోట అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు.

Updated Date - Nov 13 , 2025 | 04:24 AM