Share News

AP CM Chandrababu: నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు.. గ్రామమే నన్ను దత్తత తీసుకుంది

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:00 AM

నేను ఈ జిల్లా కోడలిని అయినప్పటికీ పీఎంలంక గ్రామానికి మాత్రం కూతురినే. నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు.. గ్రామమే నన్ను దత్తత తీసుకుంది...

AP CM Chandrababu: నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు.. గ్రామమే నన్ను దత్తత తీసుకుంది

  • నేను జిల్లా కోడలిని అయినా పీఎంలంక గ్రామానికి కూతురినే

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

నరసాపురం/అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఈ జిల్లా కోడలిని అయినప్పటికీ పీఎంలంక గ్రామానికి మాత్రం కూతురినే. నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు.. గ్రామమే నన్ను దత్తత తీసుకుంది’’ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు... ‘‘ఒకప్పుడు పీఎంలంక మారుమూల గ్రామం. నేడు దేశంలోనే గ్లోబల్‌ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. రానున్న రోజుల్లో ఏఐ శిక్షణలో దేశంలోనే ఆగ్రగామిగా నిలవబోతోంది. మహిళల్లో ఆర్థిక పరిపుష్ఠి సాధించేందుకు మొదట చిన్న భవనం నిర్మించాం. అది నేడు ఉపాధి శిక్షణలో పీఎం విశ్వకర్మ యోజనలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది’’ అని చెప్పారు. గ్రామస్థుల అలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేయగలిగానే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతోమంది ఉద్యోగాలు సాధిస్తున్నారని వింటే ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. ‘ప్రతి గ్రామం నుంచి పదిమంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉండాలి. వారందరికీ డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇచ్చి ఆధునిక వ్యవసాయం విస్తరింపజేయాలనేది ప్రధాని మోదీ ఆకాంక్ష. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళాలు రాణించాలి’ అని ఆమె పిలుపునిచ్చారు. కాగా, నిర్మలా సీతారామన్‌.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యే నాయకర్‌తో కలిసి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని వీక్షించారు. గ్రామంలో రూ.13కోట్లతో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట పనుల్ని పరిశీలించారు. మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. డిజిటల్‌ భవనంలో ఏఐ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించారు.

నిర్మలతో సీఎం భేటీ

నిర్మలతో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం అయోధ్య పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ఆయన.. పశ్చిమ గోదావరి పర్యటన నుంచి వచ్చిన నిర్మలతో విమానాశ్రయంలోనే భేటీ అయ్యారు. అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Updated Date - Dec 29 , 2025 | 04:01 AM