Vijays Campaign Postponed: విజయ్ ప్రచారం రెండు వారాలు వాయిదా
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:43 AM
తన కరూర్ పర్యటన సందర్భంగా 41 మంది మృతి చెందిన నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ తన ప్రచారాన్ని రెండు..
కరూర్ ఘటనతో టీవీకే అధినేత నిర్ణయం
వచ్చే వారం మృతుల కుటుంబాల పరామర్శ!
విజయ్ పలికేది బీజేపీ మాటలే: డీపీఐ అధినేత తిరుమావళవన్
చెన్నై, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): తన కరూర్ పర్యటన సందర్భంగా 41 మంది మృతి చెందిన నేపథ్యంలో ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత విజయ్ తన ప్రచారాన్ని రెండు వారాల పాటు వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆప్తులను కోల్పోయిన బాధలో వున్నందున వచ్చే రెండు వారాల పాటు పార్టీ అధ్యక్షుడి బహిరంగ సభలు వాయిదా వేసినట్లు అందులో పేర్కొంది. పూర్తి వివరాలను తరువాత వెల్లడిస్తామని తెలిపింది. ఇక, పోలీసుల అనుమతి మేరకు వచ్చేవారం విజయ్ కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శిస్తారని టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. కాగా, తొక్కిసలాట ఉదంతంపై టీవీకే అధినేత విజయ్... బీజేపీ మాటలనే వల్లెవేస్తున్నారని దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా(డీపీఐ) అధ్యక్షుడు తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకే బాధ్యతారాహిత్యం వల్లనే 41 మంది మరణించారని, కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారని, అయితే, తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన సత్వర చర్యల వల్ల వారంతా ప్రాణాలతో బయటపడగలిగారని ఆయన పేర్కొన్నారు. విజయ్ విడుదల చేసిన వీడియోలో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై నిందలు వేసేలా మాట్లాడారని, తద్వారా జరిగిన విషాదానికి ఆయన బాధపడడం లేదని తేలిపోయిందని తిరుమావళవన్ తెలిపారు. బయటి నుంచి ఎవరో ప్రేరేపించినందున ఇది జరిగిందనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి, బాధిత ప్రజలను మరోసారి భ్రమలోకి నెట్టడానికి విజయ్ వర్గం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ‘విజయ్ కూడా బీజేపీ చెప్పేదే చెబుతాడు’ అంటూ బీజేపీ ఏర్పాటు చేసిన ప్రార్లమెంటేరియన్ బృందం సభ్యుడు అనురాగ్ ఠాగూర్ చేసిన ప్రకటనతో విజయ్ ఎవరి వలల్లో చిక్కుకున్నాడో స్పష్టమవుతోందని తెలిపారు. బీజేపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నందున వారు తమిళనాడును లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా తమ మోసపూరిత ఆటను ప్రారంభించారన్నారు. ఇందుకు విజయ్ బీజేపీ సాధనంగా మారిపోయినట్లు అవగతమవుతోందన్నారు. ఇలాంటి శక్తుల పట్ల తమిళనాడు ప్రజలు జాగ్రత్తగా వుండాలని, ఉత్తర భారత రాష్ట్రాల్లో చూపించిన రాజకీయ కుట్రలను తమిళనాడులో కూడా పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్న సంఘ్ పరివార్ పట్ల జాగరూకతతో వ్యవహరించాలని తిరుమావళవన్ పిలుపునిచ్చారు.
‘మణిపూర్’పై నిజనిర్ధారణ కమిటీ వేయలేదేం?: సెంథిల్ బాలాజీ
కరూర్ తొక్కిసలాటపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే మణిపూర్‌లో మారణకాండ జరిగినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలని డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రశ్నించారు. కుంభకోణం తొక్కిసలాట సమయంలోనూ, గుజరాత్ వంతెన కూలిన సమయంలోనూ నిజనిర్ధారణ కమిటీ ఆయా ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదని ఆయన నిలదీశారు. కరూర్ విషాద ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని బాలాజీ సూచించారు.