Tripura Governor: మైసూరును మరిపిస్తున్న విజయవాడ ఉత్సవ్
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:53 AM
దేశ వారసత్వ సంపదను పండుగలు రక్షిస్తాయని త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని...
ప్రశంసించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
ఉర్రూతలూగించిన బాలీవుడ్ గాయని అభిలిప్సా
విజయవాడ సిటీ/విజయవాడ కల్చరల్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): దేశ వారసత్వ సంపదను పండుగలు రక్షిస్తాయని త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఆయన సతీమణి రేణుకతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మైసూరు ఉత్సవాలను మరిపించేలా విజయవాడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. రాజులు కట్టిన ఎన్నో కోటలు కాలగర్భంలో కలిసిపోయాయని, ఆధ్యాత్మిక చింతన పెంచే ఆలయాలు సుస్థిరంగా ఈ నేలపై నిలిచిపోయాయని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలను ఇలాంటి ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంచుతాయని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డిని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమ, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, బుద్దా వెంకన్న తదితరులు ఘనంగా సత్కరించారు.
ఉప్పొంగిన ఆధ్మాతికత
పున్నమి ఘాట్‌లో ఐదో రోజు శుక్రవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. బాలీవుడ్ గాయని అభిలిప్సా పాండా తన అద్భుత గాత్రంతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మికతను ఉప్పొంగించారు. గర్భా నైట్‌లో భాగంగా హిందీ పాటకు దాండియా బృందంతో నాట్యం చేయించారు. స్థానిక కళాకారులు మహిషాసుర సంహారాన్ని నృత్యరూపంలో కళ్లకు కట్టారు.
ఉత్సవ్‌లో నేటి కార్యక్రమాలు
శనివారం సాయంత్రం గొల్లపూడిలో విజయవాడ ఎగ్జిబిషన్‌ను సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభిస్తారు. తర్వాత సింగర్ సునీల్ లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. పున్నమి ఘాట్‌లో శాస్ర్తీయ నృత్య ప్రదర్శన, డివోషనల్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా.. రాజమహేంద్రవరానికి చెందిన నాట్యాచారిణి డాక్టర్ లలిత సిందూరి శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన, సంగీత కచేరి, మ్యాజిక్ షో, వీరనాట్యం, తోలుబొమ్మలాట, సాంఘిక నాటకం తదితర కార్యక్రమాల ప్రదర్శన జరుగుతాయి. ఘంటసాల ప్రభుత్వ కళాశాలలో.. ఆంధ్రనాట్యం, సంగీత కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన, బుర్రకథ, తోలుబొమ్మలాట, పౌరాణిక పద్య నాటకం శ్రీకృష్ణ తులాభారం తదితర కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.