Vijayawada Utsav: సంగీతఝరిలో ఓలలాడి
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:47 AM
సంగీతఝరిలో బెజవాడ ఓలలాడింది. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ ప్రధాన వేదికలపై...
విజయవాడ ఉత్సవ్‌కు భారీ ఆదరణ
ఉత్సవ్ వేదికలపై సంగీత విభావరులు.. గొల్లపూడిలో దుమ్మురేపిన కార్తీక్ కన్సర్ట్
పున్నమిఘాట్‌లో రాహుల్ భక్తి పాటలు.. ఉర్రూతలూగించిన కారుణ్య ఫాస్ట్ బీట్స్
తుమ్మలపల్లిలో జానపద, శాస్ర్తీయ కచేరీలు.. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
విజయవాడ సిటీ/ఇబ్రహీంపట్నం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): సంగీతఝరిలో బెజవాడ ఓలలాడింది. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్’ ప్రధాన వేదికలపై బుధవారం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. పున్నమిఘాట్ వేదికగా జరిగిన రాహుల్ వెల్లల్ ఆధ్యాత్మిక గీతాలాపన వీక్షకులను భక్తిపారవశ్యంలో మునకలేసేలా చేసింది. కర్నాటక సంగీత విద్వాంసుడైన రాహుల్ వెల్లల్ పాటలు దుమ్మురేపాయి. అన్నమాచార్య కీర్తనలను అద్భుతంగా ఆలపించారు.
గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కార్తీక్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ అమితంగా ఆకట్టుకుంది. మహాగణపతి మనసాస్మరామి అనే భక్తి పాటకు వెస్ట్రన్ బీట్స్‌తో కార్తిక్ స్వప్త స్వరాలను తన గొంతులో ఆలపించి ప్రేక్షకులకు భక్తి పారవశ్యంలోకి పరవశింప చేశారు. వెస్ట్రన్ బీట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. గజిని సినిమాలోని పాటతో ఆడియన్స్ కరతాళ ధ్వనుల మధ్య కార్తీక్ గానం అద్భుతంగా సాగింది.
ప్రఖ్యాత సింగర్ కారుణ్య తన మధురమైన కంఠంతో పున్నమిఘాట్‌లో నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌లో ప్రేక్షకులను మరోలోకంలోకి తీసుకెళ్లారు. ‘సమ్‌థింగ్.. సమ్‌థింగ్’ అంటూ ఫాస్ట్‌బీట్ రాగాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. యువతీ యువకులు వేదిక ముందుకు వెళ్లి నృత్యాలు చేశారు. ప్రత్యేకంగా ఆలపించిన విరహ గీతాలు యువతను ఆకట్టుకున్నాయి.
ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన ’ఉత్సవ్’ కార్యక్రమాలలో కాళీమాత నృత్యరూపకం జరిగింది. విశాఖపట్నానికి చెందిన విజయకుమార్ శర్మ బృందం ప్రదర్శించిన రక్తబీజాక్షుడి సంహార ఘట్టం వీక్షకుల ఒళ్లు గగుర్పొడిచేలా సాగింది.
ఇతర వేదికలపై రోబో మిర్రర్, డబుల్ హెడ్ డాల్ ప్రదర్శనలు అలరించాయి. రోబో సాంగ్స్‌కు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. రోబో మిర్రర్ యంత్రగా రోహిణీ మౌర్య, డబుల్ హెడ్ డాల్‌గా విజయకుమార్ శర్మలు అద్భుతంగా రక్తి కట్టించారు. తేజస్విని సంపత్ అకాడమీ గురువు రూపా నాగతేజస్విని సంగీత కచేరీ ఆకట్టుకుంది. ప్రియ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భళా అనిపించింది. హవీషా చౌదరి బృందం అష్టలక్ష్మీ వైభవం, శివాష్టకం, అయిగిరినందిని వంటి నృత్య ప్రదర్శనలు తన్మయులను చేశాయి.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించిన కృష్ణాతరంగిణి నృత్య రూపకం ఆకట్టుకుంది. విజయవాడ నగర ఔన్నత్యం గురించి వివరిస్తూ సాగిన నృత్యరూపకం ఆకట్టుకుంది. అనపర్తి ఏడుకొండల బృందం తోలుబొమ్మలాట ప్రదర్శన, చిన్నారి త్రిషిక కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


