Dasara Celebrations: విజయవాడ ఉత్సవ్ జోష్
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:14 AM
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్-2025 ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఆహూతులను సంగీత ప్రపంచంలో ఓలలాడించిన మణిశర్మ విభావరి
విజయవాడ ఐడల్, చాంప్స్ ఫైనల్స్
తుమ్మలపల్లి, ఘంటసాల, పున్నమిఘాట్ వేదికలపై నాట్య ప్రదర్శనల కనువిందు
విజయవాడ(ఇబ్రహీంపట్నం), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్-2025’ ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. సోమవారం ప్రధాన వేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి. గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సినీ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులను సంగీత ప్రపంచంలో ఓలలాడించింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన గంగమ్మ తల్లి తప్పెట్ల బృందం చేసిన ‘తప్పెట గుళ్లు’ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ: గొల్లపూడిలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు ప్రజలు, దేవిశరన్నవరాత్రులకు వివిధ ప్రాం తాల నుంచి వస్తున్న భక్తులు తరలి వచ్చారు. సోమవారం ప్రారంభమైన ఎగ్జిబిషన్‌లో జెయిం ట్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫుడ్ స్టాల్స్ భోజన ప్రియులతో కిటకిటలాడాయి. ‘ఫుల్లీ ఆటోమెటిక్ రోబోటిక్ చెఫ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహార ప్రియులు ఏది కోరుకుంటే అది ఇన్‌స్టంట్‌గా వండి అందించటం దీని ప్రత్యేకత. మొత్తం మీద 12 ఏళ్ల తర్వాత విజయవాడ నగరంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అదరహో అనిపించేలా పోటీలు
పున్నమి ఘాట్‌లో నిర్వహించిన విజయవాడ ఐడల్, విజయవాడ చాంప్స్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. నగరానికి చెందిన పలువురు చిన్నారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సోలో కేటగిరీలో విజయవాడ ఐడల్, గ్రూప్స్ కేటగిరి లో విజయవాడ చాంప్స్ పోటీలు జరిగాయి. నలంద విద్యా నికేతన్ చిన్నారులు మాతంగి అవతారం కట్టి ‘అమ్మో రేణుక తల్లి’ పాటకు చేసిన నృత్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ‘విజయవాడ ఐడల్’ పోటీలకు వెయ్యి మంది, విజయవాడ చాంప్స్ పోటీలకు 600 మంది పోటీపడగా.. ఆడిషన్స్ నిర్వహించి ఐడల్ విభాగంలో 12 మందిని, చాంప్స్ విభాగంలో ఆరుగురిని తుది పోటీకి ఎంపిక చేశారు. ఫైనల్స్‌లో విజయవాడ ఐడల్ పోటీలలో విజేతగా రెహన్, రన్నర్‌గా మైథిలి ట్రోఫీలను అందుకున్నారు విజయవాడ చాంప్స్ పోటీల విజేతగా నలంద గ్రూప్, రన్నర్‌గా తన్మయ గ్రూప్ బహుమతులు అందుకున్నారు. విజేతలకు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, మైలవరం ఎమ్మె ల్యే వసంత బహుమతులు అందజేశారు.