Ram Mohan Naidu: విజయవాడ టు సింగపూర్
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:43 AM
విజయవాడ నుంచి సింగపూర్‌కు నూతన విమాన సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహననాయుడు తెలిపారు.
వచ్చే నెల 15 నుంచి ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం
ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సేవలు అందుబాటులోకి
అంతర్జాతీయ కనెక్టివిటీతో అమరావతికి విదేశీ పెట్టుబడులు
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు
విజయవాడ సిటీ/న్యూఢిల్లీ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి సింగపూర్‌కు నూతన విమాన సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహననాయుడు తెలిపారు. నవంబరు 15 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమానం విజయవాడ నుంచి సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయాల మధ్య నడుస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన చేసిన రోజే (జూలై 28) ఈ సర్వీసు విషయంపై ప్రస్తావన వచ్చిందని అన్నారు. ప్రవాసాంధ్రుల సమావేశంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోనే విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చామన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో ప్రవాసాంధ్రుల పాత్ర అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కోటి మందికి పైగా ప్రవాసాంధ్రులు సింగ్‌పూర్‌కు ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమాన అనుసంధానాన్ని విస్తృతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సర్వీసు విజయవాడతో పాటు తూర్పు ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ కనెక్టివిటీతో అమరావతికి విదేశీ పెట్టుబడులు వస్తాయని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా తీర్చిదిద్దేందుకు ఇది దోహదం చేస్తుందని వివరించారు. ఈ నూతన విమాన సేవలు ఏపీని సన్ రైజ్‌స్టేట్‌గా ప్రపంచానికి మరింత దగ్గర చేస్తాయని రామ్మోహన్ పేర్కొన్నారు. కాగా, ప్రజా విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని విమాన సమయాలను రూపొందించడం పట్ల ప్రయాణికుల నుంచి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ అభివృద్ధి చెందేందుకు ఈ సర్వీసులు దోహదపడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.