Share News

విజయవాడ టు అమెరికా!

ABN , Publish Date - May 29 , 2025 | 01:34 AM

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు డైరెక్టు ఫ్లైట్‌ నడిపే అంశంపై విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు ఇచ్చిన హామీ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారిలో విదేశాలకు వెళ్లే డేటాపై అ ధ్యయనం చేస్తున్నారు. కేంద్ర స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేయడంతోపాటు విమానయాన సంస్థలను మెప్పించగలిగితే తప్ప ఇప్పటికిప్పుడు ఈ విమాన సర్వీసును నడపటం సాధ్యం కాదని తెలుస్తోంది. ముందు ఆసియా దేశాలకు విమానాలను నడిపి సమగ్ర అఽధ్యయనం చేసిన తర్వాతే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విజయవాడ టు అమెరికా!

- విమాన సర్వీసుపై విజయవాడ, మచిలీపట్నం ఎంపీల హామీ

- చర్చనీయాంశంగా న్యూయార్క్‌కు డైరెక్ట్‌ ఫ్లైట్‌ అంశం

- ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళుతున్న వారిలో విదేశాలకు వెళ్లే డేటాపై అధ్యయనం

- కేంద్ర స్థాయిలో మూడు శాఖలను మెప్పించాలి.. విమానయాన సంస్థలను ఒప్పించాలి

- ఆసియా దేశాలకు ముందు విమానాలను నడిపి సమగ్ర అఽధ్యయనం అవసరం

- సాధ్యాసాధ్యాలపై నడుస్తున్న చర్చ

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు డైరెక్టు ఫ్లైట్‌ నడిపే అంశంపై విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు ఇచ్చిన హామీ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారిలో విదేశాలకు వెళ్లే డేటాపై అ ధ్యయనం చేస్తున్నారు. కేంద్ర స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేయడంతోపాటు విమానయాన సంస్థలను మెప్పించగలిగితే తప్ప ఇప్పటికిప్పుడు ఈ విమాన సర్వీసును నడపటం సాధ్యం కాదని తెలుస్తోంది. ముందు ఆసియా దేశాలకు విమానాలను నడిపి సమగ్ర అఽధ్యయనం చేసిన తర్వాతే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఇటీవల జరిగిన ఎయిర్‌ పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశం అనంతరం మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ విమానాల ఆపరేషన్స్‌కు సంబంధించి ఇచ్చిన హామీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వీటిలో విజయవాడ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు డైరెక్ట్‌ ఫ్లైట్‌ అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ విమాన సర్వీసు నడపటానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై పెద్ద చర్చే నడుస్తోంది. విజయవాడ నుంచి ప్రస్తుతం ఢిల్లీకి మూడు దేశీయ విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీకి వెళుతున్న విమానాల్లో సగటున 120 మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరి వెళుతుంటే, వీరిలో 60 శాతం మేర ఢిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికా తదితర ప్రపంచ దేశాలకు వెళ్లేవారే ఉన్నారు. ఇవి ఎయిర్‌ పోర్టు అధికారులు చెబుతున్న గణాంకాలు. ఢిల్లీకి వెళుతున్న విమాన ప్రయాణికులను సర్వే చేయగా తెలుసుకున్న విషయం ఇది. ఈ సర్వే ఆధారంగా అమెరికాకు నేరుగా విమాన సర్వీసు నడిపే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. వీటిని అధిగమించకపోతే విమాన సర్వీసు నడపటం సాధ్యం కాదు.

పరిశీలించాల్సిన అంశాలు

విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతున్న వారు కానీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు వెళ్లే విమాన ప్రయాణికులలో సగం మంది విదేశాలకు వెళ్లే వారుంటున్నారన్నది గతంలో జరిపిన సర్వేల్లో స్పష్టమైంది. ప్రస్తుతం ఢిల్లీకి వెళుతున్న మన ప్రయాణికుల్లో 60 శాతం మంది విదేశాలకు వెళుతున్నారు. వీరిలో ఎంత మంది అమెరికాకు వెళుతున్నారన్నదానిపై సమగ్ర సర్వే జరగాల్సి ఉంది. అమెరికాకు ఎక్కువ సంఖ్యలో ఎక్కడికి వెళుతున్నారన్నది కూడా లెక్క తేలాల్సి ఉంటుంది. అమెరికాకు న్యూయార్క్‌కే వెళుతున్నారా.. చికాగో, శాన్‌ ఫ్రాన్సిస్కో ఇలా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారా అన్నది కూడా తెలియాలి. విజయవాడ నుంచి న్యూయార్క్‌కు విమాన సర్వీసు నడిపితే.. మిగిలిన ప్రాంతాలకు వెళ్లే వారు ఈ సర్వీసును ఆదరిస్తారా అన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విజయవాడ నుంచి అమెరికాకు విమాన సర్వీసు నడవాలంటే 350 - 400 మంది ప్రయాణికుల కెపాసిటీ ఉన్న విమాన సర్వీసును నడిపితేనే విమానయాన సంస్థలకు వయబిలిటీ ఉంటుంది. విజయవాడ నుంచి ఒక్క రోజే 350 మందికి పైగా ప్రయాణికులు న్యూయార్క్‌కు ప్రయాణించగలరా? అన్న విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. డైలీ ఫ్లైట్‌కు ఇంత సంఖ్య ఉండదనుకుంటే.. వారానికో ఫ్లైట్‌ నడపాలన్న అంశం కూడా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా వెళ్లే వారికి డైలీ ఫ్లైట్స్‌ దేశంలోని పలు విమానాశ్రయాల నుంచి అందుబాటులో ఉండగా.. విజయవాడ నుంచి వెళ్లటానికి వారం రోజుల పాటు నిరీక్షిస్తారా? అన్నది కూడా అధ్యయనం చేయాల్సిన విషయం. కాబట్టి సమగ్ర సర్వే, అధ్యయనం లేకుండా అమెరికా వంటి పెద్ద దేశానికి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడిపే సాహసం చేస్తే అది వయబిలిటి కాకపోతే ఏమిటన్నది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

మెప్పించి.. ఒప్పించాలి!

అమెరికాకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ నడిపే విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కృషి ఒక్కటే సరిపోదు. కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖ, కేంద్ర వాణి జ్య మంత్రిత్వ శాఖల సమన్వయంతో గట్టిగా కృషి చేస్తే తప్ప సాకారం కాదు. ఈ మూడు సంస్థలను ఏకతాటి మీదకు తీసుకు రావాల్సి ఉంటుంది. ఈ మూడు శాఖలను ఏక తాటిమీదకు తీసుకు వచ్చిన తర్వాత విమానయాన సంస్థలను కూడా మెప్పించి.. ఒప్పించాల్సి ఉంటుంది. విమానయాన సంస్థలు ముందుకు రానంత వరకు కూడా అమెరికాకు నేరుగా విమాన సర్వీసును నడపటం చాలా కష్టం.

బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ కావాలి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు కానీ మరేదైనా ప్రాంతానికి కానీ విమాన సర్వీసును నడపాలంటే అంత తేలిక కాదు. విజయవాడ విమానాశ్రయానికి బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ కావాలి. బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ లేకుండా విమాన సర్వీసును నడిపే పరిస్థితి లేదు. బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ అనేవి ఇండియా, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు పౌర విమానయాన శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించటం ద్వారానే బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ వస్తాయి. అమెరికాకు విజయవాడ నుంచి ఒక విమాన సర్వీసు నడిపితే .. అక్కడి విమానయాన సంస్థకు కూడా విజయవాడ రావటానికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రతి విమానాశ్రయానికి నిర్దేశిత బైలేట్రల్‌ ట్రాఫిక్‌ రైట్స్‌ ఉంటాయి. కొత్తగా కల్పించకుండా.. ఉన్న వాటినే సర్దుకోమంటే చాలా కష్టం. అమెరికా నుంచి మన దేశంలో ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగళూరులకు విమాన సర్వీసులలో ఏదైనా ఒకదానిని కుదించుకుని విజయవాడకు నడపాలి. ఆ విమానాశ్రయాలకున్న డిమాండ్‌ను కాదనుకుని ఆ దేశ విమానయాన సంస్థ విజయవాడకు ధైర్యంగా నడపగలదా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.

సమగ్ర అధ్యయనం తప్పనిసరి

అమెరికా వంటి దేశాలకు విమానాలు నడపాలనుకున్నపుడు ప్రయాణికుల అంచనాకు సంబంధించి సమగ్ర సర్వేతో కూడిన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా మన దగ్గర నుంచి విదేశాలకు వెళుతున్న ఆప్షన్స్‌ను పరిశీలించాలి. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపటం ద్వారా పర్యాటకుల కోసం విజయవాడ నుంచి థాయ్‌ల్యాండ్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు 120 సీటర్‌ విమానాలను నడిపి పరిశీలించవచ్చు. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి సింగపూర్‌, దుబాయ్‌ వంటి దేశాలకు కూడా వీజీఎఫ్‌ విధానంలో విమాన సర్వీసులను నడిపితే .. అంతర్జాతీయానానికి ఉన్న డిమాండ్‌పై అవగాహన వస్తుంది. వీటి ఆధారంగా అమెరికాకు విమాన సర్వీసు అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

Updated Date - May 30 , 2025 | 03:09 PM