Share News

Vijayawada Airport: సింగపూర్‌, షార్జా.. సీట్లన్నీ ఫుల్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:00 AM

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానయానం జోరందుకుంది. నిండుగా నడుస్తున్న విమానాల్లో టికెట్లు దొరకడం కూడా కష్టమవుతోంది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా...

Vijayawada Airport: సింగపూర్‌, షార్జా.. సీట్లన్నీ ఫుల్‌

  • విజయవాడలో అంతర్జాతీయ విమానాల దూకుడు

  • సింగపూర్‌, షార్జాలకు నేరుగా సర్వీసులు

  • 100 శాతం ఆక్యుపెన్సీతో నిండుగా రాకపోకలు

  • దుబాయ్‌ వెళ్లేవారు షార్జాకు.. అక్కడి నుంచి సులువుగా గమ్యానికి

  • దుబాయ్‌, శ్రీలంకలకు సర్వీసులు నడపాలంటున్న ప్రయాణికులు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానయానం జోరందుకుంది. నిండుగా నడుస్తున్న విమానాల్లో టికెట్లు దొరకడం కూడా కష్టమవుతోంది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా, సింగపూర్‌లకు రెండు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మంగళ, శనివారాల్లో షార్జాకు ఎయిరిండియా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మంగళ, గురు, శనివారాల్లో సింగపూర్‌కు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి రెండే సర్వీసులు అయినప్పటికీ.. వారంలో ఐదు షెడ్యూల్స్‌గా, పది ట్రిప్పులుగా నేరుగా రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో ఇవి నడుస్తుండటం విశేషం. ఇంత ఆదరణ వస్తుండటంతో విమానాశ్రయ అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే వారు విజయవాడ నుంచి నేరుగా షార్జాకు వెళ్తున్నారు. అక్కడి నుంచి సులువుగా దుబాయ్‌కు వెళ్లే అవకాశం ఉంటోంది. దీంతో షార్జా విమాన సర్వీసుకు ఆదరణ ఎక్కువగా ఉంది. వారంలో రెండు సర్వీసులే ఉండటంతో టికెట్లు దొరకటం కూడా కష్టంగా మారింది. దుబాయ్‌కు కూడా నేరుగా విమాన సర్వీసును నడపాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది.


సింగపూర్‌కు భలే గిరాకీ

గతంలో విజయవాడ, సింగపూర్‌ మధ్య విమాన సర్వీసు విజయవంతంగా నడిచింది. వైసీపీ ప్రభుత్వంలో ఆ విమాన సర్వీసు రద్దయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సర్వీసును తిరిగి ప్రారంభించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నాన్‌ వీజీఎఫ్‌ విధానంలోనే డైరెక్టుగా సింగపూర్‌కు విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సర్వీసు రాకతో ఏపీ నుంచి హైదరాబాద్‌, చెన్నై వెళ్లి అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లేవారి సంఖ్య తగ్గింది. సింగపూర్‌ నుంచి విజయవాడకు నూరుశాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తుండగా, విజయవాడ నుంచి సింగపూర్‌కు 90 శాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం విజయవాడ వచ్చి సింగపూర్‌కు వెళ్తున్నారు. సింగపూర్‌ నుంచి విజయవాడకు టికెట్‌ ఖర్చు తక్కువగా ఉండటంతో ఇక్కడికి వస్తున్నారు. విజయవాడలో దిగి హైదరాబాద్‌, చెన్నైకు ప్రయాణిస్తున్నారు. దీనివల్ల దేశీయ విమానాలకు కూడా డిమాండ్‌ పెరిగింది.

శ్రీలంకకు విమాన సర్వీసులు ప్రారంభించాలి

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దుబాయ్‌, శ్రీలంకకు కూడా విమాన సర్వీసులను నడపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపించాలని భావించినపుడు దుబాయ్‌ రూట్‌ కూడా సర్వే చేసింది. సింగపూర్‌తో సమానంగా దుబాయ్‌కు కూడా మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. తాజాగా షార్జా సర్వీసుకు ఉన్న ఆదరణ నేపథ్యంలో దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు నడపాల్సిన అవసరం ఉంది. ఇక శ్రీలంకకు మన రాష్ట్రం నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వెళ్తున్నారు. దీంతో శ్రీలంకకు కూడా నేరుగా విమాన సర్వీసు నడపాలని వారు కోరుతున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 04:00 AM