Cultural Revival: విజయవాడ ఎక్స్‌పో అదరహో
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:48 AM
విజయవాడ ఎక్స్‌పో (గొల్లపూడి ఎగ్జిబిషన్)ను శనివారం హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సింగర్ సునీత లైవ్ మ్యూజిక్ షో ఉర్రూతలూగించింది.
ప్రారంభించిన నటుడు బాలకృష్ణ
ఉర్రూతలూగించిన సింగర్ సునీత పాటలు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఎక్స్‌పో (గొల్లపూడి ఎగ్జిబిషన్)ను శనివారం హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సింగర్ సునీత లైవ్ మ్యూజిక్ షో ఉర్రూతలూగించింది. ప్రారంభ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ.. కళల పుట్టినిల్లు భారతదేశం ఒక గొప్ప కళాఖండమని, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఎందరో కళాకారులు ఇక్కడ జన్మించారన్నారు. అంతరిస్తున్న కళలను పునరుద్ధరించడానికి, వాటి ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేయడానికి విజయవాడ ఉత్సవ్ గొప్ప వేదికైందన్నారు. రాత్రి జరిగిన సునీత లైవ్ మ్యూజిక్‌షో విశేషంగా ఆకట్టుకుంది. సింగర్ ధనుంజయ్‌తో కలిసి అమ్మవారిపై పాడిన ‘పారాణి పాదాల బాలాకృతి పరమందు కొలువైన పరమేశ్వరి’ తదితర పాటలతో వీక్షకులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. 30 సినిమా పాటల వరకు పాడి యువతను, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
సునీత భావోద్వేగం
‘నేను పుట్టి పెరిగి సంగీతం నేర్చుకున్న విజయవాడలో గానం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని సింగర్ సునీత భావోద్వేగానికి గురయ్యారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. విజయవాడలో ఉండి రోజూ అమ్మవారిని దర్శించుకుంటున్నవారంతా అదృష్ట వంతులన్నారు. ఇంకా తనలాంటి ఎందరో సింగర్స్ విజయవాడ నుంచి రావాలని ఆకాంక్షించారు.