Book Festival: 2 నుంచి పుస్తక సంబరం బెజవాడలో
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:22 AM
వచ్చే ఏడాది జనవరి 2 నుంచి విజయవాడలో పుస్తక సంబరాలు ప్రారంభం కానున్నాయి.
11 రోజులు నిర్వహణ
ఇందిరాగాంధీ స్టేడియం వేదిక
విజయవాడ కల్చరల్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 2 నుంచి విజయవాడలో పుస్తక సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా 36వ పుస్తక మహోత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి పుస్తక మహోత్సవంగా నామకరణం చేశారు. ప్రధాన వేదికకు డాక్టర్ బీవీ పట్టాభిరామ్, విద్యార్థి ప్రతిభా వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెట్టనున్నారు. సందర్శన ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. కార్యక్రమ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను నిర్వాహకులు ఆహ్వానించారు. జనవరి 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర సిద్ధార్థ కాలేజీ నుంచి ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, సదస్సులు నిర్వహించనున్నారు. రాయలసీమ సాహిత్యం, ఉత్తరాంధ్ర సాహిత్యం, కోస్తాంధ్ర సాహిత్యం, తెలంగాణ సాహిత్యం, అనువాద సాహిత్యం, బాల సాహిత్యం, దృశ్యమాలిక వంటి అంశాలపై సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. పుస్తక మహోత్సవ పోస్టర్‌ను శనివారం విజయవాడ బుక్ పెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు టి.మనోమర్‌నాయుడు, కార్యదర్శి కె.లక్ష్మయ్య తదితరులు ఆవిష్కరించారు.