Vijayawada ACB Court: మిథున్‌రెడ్డి న్యూయార్క్ పర్యటనకు కోర్టు అనుమతి
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:57 AM
న్యూయార్క్ పర్యటనకు వెళ్లేందుకు ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై న్యాయాధికారి భాస్కరరావు శుక్రవారం సాయంత్రం తీర్పును వెలువరించారు.
50 వేల చొప్పున 2 పూచీకత్తులు.. విమాన టికెట్ల ఫొటో కాపీలు కోర్టుకివ్వాలి.. అక్కడ బస వివరాలు చెప్పాలి: న్యాయాధికారి
మద్యం కేసులో మిగతా నిందితులకు రిమాండ్ పొడిగింపు
విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): న్యూయార్క్ పర్యటనకు వెళ్లేందుకు ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై న్యాయాధికారి భాస్కరరావు శుక్రవారం సాయంత్రం తీర్పును వెలువరించారు. కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన ఎంపీల బృందంతో కలిసి తాను న్యూయార్క్ వెళ్లాల్సి ఉందని దానికి అనుమతి ఇవ్వడంతోపాటు సిట్ అధికారులు జారీచేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను రద్దు చేయాలని మిథున్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు. న్యూయార్క్ వెళ్లి తిరిగి రావడానికి ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు అనుమతి ఇచ్చారు. ‘వెళ్లడానికి ముందు రూ.50 వేల చొప్పున రెండు జామీన్లను సమర్పించాలి. విమానం టికెట్ల ఫొటోస్టాట్ కాపీలు, న్యూయార్క్‌లో ఎక్కడ బస చేస్తున్నారన్న వివరాలను న్యాయస్థానానికి అందజేయాలి. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు తెలియజేయాలి. అమెరికా నుంచి రాగానే పాస్‌పోర్టును సిట్ అధికారులకు అప్పగించాలి’ అని షరతులు విధించారు. మరోవైపు.. మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలకు ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయాధికారి భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌నాయుడు, బూనేటి చాణక్య విజయవాడ జిల్లా జైల్లో ఉండగా.. నవీన్‌కృష్ణ, బాలాజీకుమార్ యాదవ్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా.. బెయిల్ కోసం వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లపై 24న తీర్పు వెలువరిస్తానని న్యాయాధికారి ప్రకటించారు.