ACB Court: లిక్కర్ గ్యాంగ్ రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:18 AM
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది.
విజయవాడ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌నాయుడు, బూనేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్టను సిట్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి వచ్చే నెల 5వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. బెయిల్‌పై బయట ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, పి. కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ వాయిదాకు హాజరయ్యారు. కాగా, కోర్టు హాలులో చెవిరెడ్డి తన వాదనను న్యాయాధికారి ముందు విన్నవించుకున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా తన ఆస్తులను జప్తు చేసేందుకు ఆదేశాలు ఇచ్చిందని, తాను మద్యం వ్యాపారం చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయాధికారి ఆయనకు సూచించారు. కాగా, చెవిరెడ్డి కోర్టుకు వచ్చి వెళ్లేటప్పుడు మీడియాను చూసి వాహనం ఎక్కకుండా మాట్లాడారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. దీన్ని ఆయన ఇప్పటికే పలుమార్లు ఉల్లంఘించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ షరతులు సడలించాలని బాలాజీ గోవిందప్ప వేసిన పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా పడింది.