విజయవాడ 2.0
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:09 AM
నగరం విస్తరిస్తోంది. న్యూ విజయవాడగా రూపుదిద్దుకుంటోంది. విజయవాడ 2.0గా శివారు ప్రాంతాల వైపు నగరాభివృద్ధి చురుగ్గా సాగుతోంది. ఈ మార్పులు గ్రేటర్ విజయవాడ తక్షణ అవసరాన్ని గట్టిగా సూచిస్తున్నాయి. విజయవాడను ఆనుకుని ప్రధానంగా ఉత్తర భాగంలో గుణదల రెవెన్యూ గ్రామానికి అనుసంధానంగా ఉన్న వెదురుపావులూరు నుంచి కేసరపల్లి వరకు, అలాగే జక్కంపూడి నుంచి నున్న వరకు, గొల్లపూడి - ఇబ్రహీంపట్నం - కొండపల్లి వరకు, కానూరు నుంచి నిడమానూరు వరకు నగరం మరింత విస్తరిస్తోంది.
- న్యూ విజయవాడగా రూపుదిద్దుకుంటున్న మెగాసిటీ
- విస్తరిస్తున్న ఉత్తర, ఈశాన్య, వాయువ్య ప్రాంతాలు
- నిన్నటి వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టూనే..
- ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ దాటి విస్తరణకు అడుగులు
- గొల్లపూడి, జక్కంపూడి, నున్న ప్రాంతాల వైపు వేగంగా..
- గుణదల రెవెన్యూ గ్రామం నుంచి ఇన్నర్ వరకు..
- వెదురుపావులూరు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఇండస్ర్టియల్, రెసిడెన్షియల్ ్స
- కేసరపల్లి ఐటీ కంపెనీల వైపు మెగా హౌసింగ్ నిర్మాణం
- కానూరు - నిడమానూరు దిశగా నగరీకరణ
- జాతీయ రహదారి ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతాల్లోనే ఉండటంతో మరింత అభివృద్ధి
నగరం విస్తరిస్తోంది. న్యూ విజయవాడగా రూపుదిద్దుకుంటోంది. విజయవాడ 2.0గా శివారు ప్రాంతాల వైపు నగరాభివృద్ధి చురుగ్గా సాగుతోంది. ఈ మార్పులు గ్రేటర్ విజయవాడ తక్షణ అవసరాన్ని గట్టిగా సూచిస్తున్నాయి. విజయవాడను ఆనుకుని ప్రధానంగా ఉత్తర భాగంలో గుణదల రెవెన్యూ గ్రామానికి అనుసంధానంగా ఉన్న వెదురుపావులూరు నుంచి కేసరపల్లి వరకు, అలాగే జక్కంపూడి నుంచి నున్న వరకు, గొల్లపూడి - ఇబ్రహీంపట్నం - కొండపల్లి వరకు, కానూరు నుంచి నిడమానూరు వరకు నగరం మరింత విస్తరిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ ఉత్తర, ఈశాన్య, వాయువ్య ప్రాంతాలు నగరంతో సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం విజయవాడ నగరంలో జనాభా పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందటానికి, విస్తరించటానికి శివారు ప్రాంతాలే వనరులుగా మారాయి. విజయవాడ భౌగోళిక పరిస్థితుల రీత్యా దక్షిణ భాగాన కృష్ణానది ఉంది. దీంతో అటు వైపు విస్తరించటానికి అవకాశం లేదు. విజయవాడ నగరం రెండున్నర దశాబ్దాలుగా ఎన్‌హెచ్ - 65 వెంబడి సరళరేఖలా విస్తరిస్తూ పోతోంది. విజయవాడ నగరం ఒక ప్రణాళికా బద్ధంగా విస్తరించాలంటే.. చతురస్రాకారంగా అభివృద్ధి చెందటం ముఖ్యమన్న వాదనలు అప్పట్లో వచ్చాయి. దశాబ్దంన్నర కాలంలో ఎన్‌హెచ్ - 16 వెంబడి కూడా విజయవాడ నగరం విస్తరిస్తోంది. ఎన్‌హెచ్ - 65 వెంబడి విస్తరించినంత వేగంగా అయితే లేదు.
గ్రేటర్ ఆశలను చిదిమేసిన గత వైసీపీ ప్రభుత్వం
రాష్ట్ర విభజన నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్న విజయవాడ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెయ్యటానికి గత టీడీపీ ప్రభుత్వం గ్రేటర్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 18 గ్రామాలను గ్రేటర్ విలీన జాబితాలో చేర్చాలని పెట్టినా.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రేటర్ విజయవాడలో కదలిక వచ్చింది. అప్పట్లో ఏకంగా 45 గ్రామాలను గ్రేటర్ విలీన జాబితా పరిధిలోకి చేర్చి గ్రామ పంచాయతీల తీర్మానాలను తీసుకోవటం జరిగింది. నూటికి 90 శాతం పైగా గ్రామ పంచాయతీలు సానుకూలంగా తీర్మానాలు చేసి పంపాయి. నిర్ణయం తీసుకునే క్రమంలో ఎన్నికలు రావటంతో ఆగింది. గత వైసీపీ ప్రభుత్వం గ్రేటర్ ఆశలను చిదిమేసింది. విజయవాడ గ్రేటర్ పరిధిలో ఉన్న గ్రామాలను మునిసిపాలిటీలుగా మార్చింది. దీంతో విజయవాడ విస్తరణకు బ్రేక్ పడింది.
అయినా ఆగని అభివృద్ధి, విస్తరణ
అయినప్పటికీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ జాబితాలో చేర్చిన గ్రామాలు విజయవాడకు సమాంతరంగా కొత్త విజయవాడగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన గ్రేటర్ గ్రామాల వైపు విజయవాడ నగర విస్తరణ అంతకంతకూ పెరిగిపోతోంది. రామవరప్పాడు నుంచి ప్రారంభమయ్యే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆవల వైపు సరికొత్త నగరమే తయారవుతోంది. పూర్తి నగరీకరణ దిశగా వేగంగా విస్తరించుకుంటూ పోతోంది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ను దాటుకుని ఆవల వైపు కూడా విజయవాడ విస్తరిస్తోంది. వెదురుపావులూరు ఇంటర్నేషనల్ స్కూల్, భారీ పరిశ్రమలు, పబ్లికేషన్స్ సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు, గోడౌన్లు, షోరూమ్‌లు, సర్వీసు సెంటర్స్, ఎంఎస్‌ఎంఈ యూనిట్స్ వంటివి ఏర్పాటవుతున్నాయి.
వెలుస్తున్న భారీ అపార్ట్‌మెంట్లు
గుణదల రెవెన్యూ గ్రామంలో నివాస ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. భారీ అపార్ట్‌మెంట్ల నిర్మాణం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే అపార్ట్‌మెంట్ శ్రేణితో ఈ ప్రాంతం విస్తరణ బాట పట్టింది. గుణదల రైల్వే స్టేషన్ శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు అనుసంధానం కావటానికి వీలుగా క్రమేణా రెసిడెన్షియల్ కట్టడాలు విస్తరిస్తున్నాయి. వెదురుపావులూరు ఇండస్ర్టియల్, రెసిడెన్షియల్ మిశ్రమంగా విస్తరణ జరుగుతోంది. వెదురుపావులూరు నుంచి కేసరపల్లి వరకు అనేక రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా కేసరపల్లి వైపు భారీగా విల్లాలు, అపార్ట్‌మెంట్లు, గ్రూప్‌హౌస్‌లు విస్తరిస్తున్నాయి. కేసరపల్లిలో ఐటీ పార్కులు, హెచ్‌సీఎల్ ఐటీ టెక్నాలజీస్ పార్కుల వైపు అయితే భారీగా విల్లాలు, గ్రూప్ హౌస్‌ల నిర్మాణం జరిగింది.
జోరుగా భూముల క్రయ విక్రయాలు
జక్కంపూడి, కండ్రిక, పాతపాడు, నున్న, అంబాపురం, పి.నైనవరం ప్రాంతాలు ఇప్పుడిప్పుడే విస్తరణ బాట పట్టాయి. విజయవాడ పశ్చిమ బైపాస్ కారణంగా ఈ ప్రాంతాల్లో భారీగా భూముల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. కండ్రిక ప్రాంతం విజయవాడ బైపాస్‌కు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో నిర్మాణ రంగం శరవేగంగా జరుగుతోంది. విజయవాడ బైపాస్ కారణంగా నున్న, సూరంపల్లి వరకు అనూహ్యంగా నిర్మాణ రంగం విస్తరిస్తోంది. గొల్లపూడి ఇప్పటికే విజయవాడతో సమాంతరంగా విస్తరించింది. విజయవాడ బైపాస్ కారణంగా ఆవల వైపు కూడా విస్తరణ దిశగా ముందుకు వెళుతోంది. నగరం ఈశాన్య దిక్కున కానూరు ఇప్పటికే విస్తరించిన ప్రాంతం. ఇది మరింత విస్తరిస్తోంది. నిడమనూరు దిశగా ఈ ప్రాంతం విస్తరిస్తోంది. తూర్పు బైపాస్ ఆశలతో ఈ ప్రాంత అభివృద్ధి ముందుకు వెళ్లింది. తూర్పు బైపాస్ ఇక లేనప్పటికీ.. ఇన్నర్‌రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ ఆశలతో ఈ ప్రాంతం మరింత విస్తరణ దిశగా కదులుతోంది.
జాతీయ రహదారి ప్రాజెక్టులతో వేగం
జాతీయ రహదారి ప్రాజెక్టులు సరికొత్త విజయవాడ నగరానికి అడుగులు వేయిస్తున్నాయి. జక్కంపూడి నుంచి విజయవాడ - ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులు అతి త్వరలో జరగనున్నందున ఈ ప్రాంతానికి మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అలైన్‌మెంట్ పరిధిలో పెద్ద సంఖ్యలో భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నేపథ్యంలోనే విజయవాడ ఈ ప్రాంతం వైపు విస్తరిస్తుందనుకుంటే.. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణంతో మరింత విస్తరణకు దోహదపడింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్లు కూడా ప్రతిపాదనలో ఉండటంతో రానున్న రోజుల్లో అవి కూడా కార్యరూపం దాల్చితే విజయవాడ అభివృద్ధి విజయవాడ వెస్ట్ బైపాస్ పరిధి దాటి కూడా ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాతీయ రహదారులన్నింటి కారణంగా.. విజయవాడ ఉత్తర, ఈశాన్య, వాయువ్య ప్రాంతాలు శరవేగంగా విస్తరించనున్నాయి.