Vijayasai Reddy: కోటరీ జగన్‌ను తప్పుదారి పట్టిస్తోంది
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:52 AM
జగన్‌కు చెప్పేది ఒక్కటే.. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధతలేని వ్యక్తులున్నారు.
చుట్టూ నిబద్ధతలేని వ్యక్తులున్నారు.. వారి వల్లే పార్టీకి దూరంగా ఉన్నాను
చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు
పవన్‌తో 20 ఏళ్లుగా స్నేహం: విజయసాయి
శ్రీకాకుళం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌కు చెప్పేది ఒక్కటే.. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధతలేని వ్యక్తులున్నారు. వారి మాటలను జగన్ నమ్మకూడదు. చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తోంది. వారి వల్లే పార్టీకి దూరంగా ఉన్నాను’’ అని వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శ్రీకాకుళం మండలం అంపోలు సమీపంలో ఆదివారం నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కొత్త పార్టీ పెట్టే ఆలోచన కానీ.. ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం కానీ లేదు. అవసరం వచ్చినప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తాను. జగన్ పార్టీని మేనేజ్ చేసుకోగలడు. గతంలో నాపై చాలా ఒత్తిడి ఉండేది. నేను వేటికీ తలొగ్గలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో గత ఇరవై ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. ఎప్పుడూ పవన్‌ను విమర్శించలేదు. సీఎం చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు’ అన్నారు. శ్రీకాకుళంలో నిర్మిస్తున్న రెడ్డి సంక్షేమ భవన నిర్మాణానికి అవసరమైన ఖర్చును తానే భరిస్తున్నట్లు చెప్పారు.