Share News

YSRCP Support: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏకి జగన్‌ జై

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:28 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జై కొట్టారు. రక్షణ మంత్రి, బీజేపీ అగ్ర నేత రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం ఆయనకు ఫోన్‌ చేశారు.

YSRCP Support: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏకి జగన్‌  జై

  • రాధాకృష్ణన్‌కు మద్దతు కోసం రాజ్‌నాథ్‌ ఫోన్‌

  • సానుకూలంగా స్పందించిన మాజీ సీఎం

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జై కొట్టారు. రక్షణ మంత్రి, బీజేపీ అగ్ర నేత రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం ఆయనకు ఫోన్‌ చేశారు. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తాము భావించినా.. ఇండియా కూటమి తన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించడంతో పోటీ అనివార్యమైందని తెలిపారు. ఎన్‌డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్‌, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను రంగంలోకి దింపుతున్నామని, ఆయన్ను బలపరచాలని జగన్‌ను కోరారు. ఇందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు.. మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. తొలి నుంచి జగన్‌ ఎన్‌డీఏకే మద్దతిస్తూ వస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయాల్లో, పార్లమెంటులో కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అండగా నిలిచారు. ఇప్పుడు కూడా రాజ్‌నాథ్‌ కోరగానే.. రాధాకృష్ణన్‌కు వైసీపీ సభ్యులు ఓటు వేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Aug 19 , 2025 | 04:31 AM