Vice President Radha Krishna: ఈ రోజు ఆజన్మాంతం గుర్తుంటుంది
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:23 AM
మహిళల శక్తి సామర్థ్యాలకు దసరా ఉత్సవాలు ప్రతీకలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని...
అన్నపూర్ణాదేవి అలంకరణలో దుర్గమ్మను దర్శించుకున్నా
దసరా ఉత్సవాలు మహిళల శక్తి సామర్థ్యాలకు ప్రతీకలు
విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: కేంద్ర మంత్రి షెకావత్
విజయవాడ సిటీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మహిళల శక్తి సామర్థ్యాలకు దసరా ఉత్సవాలు ప్రతీకలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న ‘విజయవాడ ఉత్సవ్’ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా విజయవాడనే సందర్శించానని తెలిపారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో దుర్గమ్మను దర్శించుకోవడం తనకు కలిగిన భాగ్యమని పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నానని, ఈరోజు తనకు ఆజన్మాంతం గుర్తుండిపోతుందని చెప్పారు. దేశ ప్రజల ఆకలిని ఏపీ తీరుస్తోందన్నారు. విజయవాడ నగరం ఎప్పుడూ హాట్‌గా ఉన్నా.. ఇక్కడి ప్రజలు మాత్రం కూల్‌గా ఉండటం విశేషమన్నారు. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటూ సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఏపీ ప్రజల కష్టంతోనే అమెరికా ఆర్థిక అభివృద్ధి సాధిస్తోందని, ఆ దేశంలో స్థిరపడిన వారిలో ఏపీ వాసులే ఎక్కువని రాధాకృష్ణన్ గుర్తుచేశారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ ఏపీలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో కేంద్రం సాయంతో మరింతగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత ఉపరాష్ట్రపతి విజయవాడ ఉత్సవ్ ప్రాంగణాన్ని సందర్శించారు. హోర్డింగ్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఫొటో దిగారు. స్టాల్స్‌ను పరిశీలించారు. విజయా డెయిరీ స్టాల్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. ‘విజయవాడ ది డెవలపింగ్ సిటీ ఇన్ ఇండియా’ అని సంతకం చేశారు. గాయని గీతామాధురి పాటలు విని ఆమెను ప్రశంసించారు.
దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బుధవారం సాయంత్రం 4.16 గంటలకు ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. నివేదన సమర్పించిన తర్వాత తొలి దర్శనం చేసుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తమిళ సంప్రదాయం ప్రకారం సుమంగళద్రవ్యాలు, పంచకజ్జాయం సమర్పించారు. అర్చకులతో పాటు రాధాకృష్ణన్ దంపతులు కూడా అష్టోత్తరాన్ని పఠించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఉపరాష్ట్రపతి దంపతులకు దేవదాయ శాఖ కమిషనర్, ఈవో శీనానాయక్ పట్టువస్ర్తాలు సమర్పించారు. అర్చకులతో ఆయన తెలుగులో సంభాషించారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకున్నానని గుర్తుచేసుకున్నారు. అర్చకులు, వేదపండితులు, అధికారులు, మంగళవాయిద్యకారులతో ఆయన ఫొటోలు దిగారు.