Share News

Vice President C P Radhakrishnan: నిస్వార్థ సేవలకు సాయి ప్రతిరూపం

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:18 AM

శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు సత్యసాయిబాబా ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు.

Vice President C P Radhakrishnan: నిస్వార్థ సేవలకు సాయి ప్రతిరూపం

  • ఆయన బోధనలతో కోట్ల మంది ప్రభావితం

  • ఇతరుల కోసం జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత

  • బాబా వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో చూపాలి

  • శత జయంతి వేడుకల్లో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ పిలుపు

అనంతపురం/పుట్టపర్తి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): శాంతి, ప్రేమ, నిస్వార్థ సేవలకు సత్యసాయిబాబా ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. ఆయన బోధనలు.. ‘అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు’, ‘ఎల్లప్పుడూ సాయపడు-ఎన్నిటికీ బాధించకు’ వంటివి విశ్వవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సత్యసాయి శతజయంత్యుత్సవాల్లో ఆయన ప్రసంగించారు. తొలుత భారత మాతకు, సత్యసాయికి ప్రణమిల్లారు. వేదికపై ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, మంత్రి లోకేశ్‌, పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కలిసి పాల్గొనడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి చెప్పారు. 1964-65 మధ్య తన కుటుంబానికి సత్యసాయి ఆశీస్సులు అందాయని.. తమిళం మాత్రమే తెలిసిన తన అత్తయ్య ఒంటరిగా పుట్టపర్తికి వచ్చి, 15 రోజులు ఇక్కడ ఉండి సాయిబాబా ఆశీస్సుల అందుకోవడం బాబా దైవిక శక్తికి నిదర్శనమని తెలిపారు. ‘ఈ ఆధ్యాత్మిక, పవిత్ర క్షేత్రాన్ని సందర్శించే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతలు. ఇతరుల కోసం జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. ఓ తమిళ కవి తన పద్యాల్లోనూ ఇదే చెప్పారు’ అని వెల్లడించారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు దేశవ్యాప్తంగా అందిస్తున్న మహత్తర సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉచిత విద్య అందిస్తున్న సత్యసాయి విశ్వవిద్యాలయం, గ్రామీణ ఆరోగ్య సేవలు, ఉచిత గుండె శస్త్ర చికిత్సలు, తాగునీటి ప్రాజెక్టులు, విపత్తుల్లో సాయం తదితర కార్యక్రమాలు లక్షలాది మందికి జీవనాధారం అవుతున్నాయని కొనియాడారు. తెలుగుగంగ ప్రాజెక్టు పునరుద్ధరణ, చెన్నైకి నిరంతరం తాగునీటి సరఫరాకు సత్యసాయి చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు.


సంఘర్షణలు, ఒత్తిళ్లతో నిండిన నేటి ప్రపంచానికి ఆయన బోధించిన ప్రేమ, ఐక్యత, సేవ వంటి విలువలు మరింత అవసరమని తెలిపారు. సత్యసాయి మహా సమాధి అయిన తర్వాత కూడా భక్తులు ఇక్కడకు వచ్చి సేవల్లో కొనసాగడం అభినందనీయమన్నారు. ‘సేవ మానవత్వాన్ని కలుపుతుంది. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. కుటుంబాల్లో, సమాజంలో, దేశంలో శాంతిని పెంపొందించడం మనందరి బాధ్యత’ అని ఆయన అన్నారు. భగవాన్‌ వారసత్వాన్ని మాటల్లో కాకుండా సేవల్లో కొనసాగించాలని ఉపరాష్ట్రపతి పిలుపిచ్చారు.

Updated Date - Nov 24 , 2025 | 04:21 AM