Vijayawada Utsav: జోష్ నింపిన విజయవాడ ఉత్సవ్
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:06 AM
దసరా శరన్నవరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్-2025 విశేషంగా అలరిస్తోంది. ఉత్సవ్‌లో భాగంగా తొమ్మిదో రోజైన...
పున్నమిఘాట్‌లో ఆకట్టుకున్న సంగీత కచేరి
విజయవాడ సిటీ, విజయవాడ (ఇబ్రహీంపట్నం), సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్-2025 విశేషంగా అలరిస్తోంది. ఉత్సవ్‌లో భాగంగా తొమ్మిదో రోజైన మంగళవారం పున్నమి ఘాట్‌లో నిర్వహించిన ‘కమిలియన్స్ స్వాప్ ది బీట్ లైవ్ కాన్సర్ట్’ సంగీత ప్రియులను ఉర్రూతలూగించగా.. వేలాది ప్రేక్షకుల సమక్షంలో గొల్లపూడిలోని కళావేదిక ర్యాంప్‌పై జరిగిన ‘క్రౌన్ ఆఫ్ ది విజయవాడ’ గ్రాండ్ ఫినాలేకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ‘కాంతారా-2’ టీమ్ హాజరుకావడంతో విజయవాడ ఉత్సవ్‌కు మరింత జోష్ వచ్చింది. గొల్లపూడిలో జరిగిన ‘క్రౌన్ ఆఫ్ ది విజయవాడ’ గ్రాండ్ ఫినాలే ధూమ్‌ధామ్‌గా ముగిసింది. మిస్ విజయవాడ, మిసెస్ విజయవాడతోపాటు టీన్స్ విజయవాడ, లిటిల్ మిస్, లిటిల్ జూనియర్ పోటీలు ప్రేక్షకులను అలరించాయి. మిస్ విజయవాడగా నగరానికి చెందిన కారుమంచి రేష్మ, రన్నర్‌పగా బి.భవిష్య, మిసెస్ విజయవాడగా ఎస్ సౌందర్య, రన్నర్‌పగా హేమశ్రీ మేడూరి ఎంపికయ్యారు. వారికి కాంతారా-2 టీమ్ మెమొంటోలు అందించారు. మిస్ టీన్ కేటగిరీలో పీ యశశ్విని విజేతగా నిలిచింది. విజయవాడ ఉత్సవ్‌లో కాంతారా-2 సినిమా టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి, చిత్రంలోని పాటను విడుదల చేశారు. నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి, నటి రుక్మిణి వసంత, హోం బాలే ఫిల్మ్స్ అధినేత చలువే గౌడ్ హాజరయ్యారు. ఇక, పున్నమి ఘాట్ వేదికగా నిర్వహించిన ‘కమిలియన్స్ స్వాప్ ది బీట్ లైవ్ కాన్సర్ట్’ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వేణువు విద్వాంసుడు కమిలియన్ అద్భుత ప్రదర్శన చేశారు. భారతీయ సంగీతంతో మొదలైన ఈ కచేరి ఆఫ్రికన్, అస్ర్టేలియన్ మ్యూజిక్ తో అందరినీ అలరించింది. ‘విజయవాడ ఉత్సవ్’ స్ఫూర్తితో తన నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రకటించారు. పున్నమిఘాట్‌లో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు