Pension Scam: పింఛను సొమ్ము 2.13 లక్షలతో పరార్
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:50 AM
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంచాల్సిన పింఛను సొమ్ము రూ.2.13 లక్షలతో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా...
తూర్పుగోదావరి జిల్లా చండ్రేడు గ్రామంలో ఘటన
రంగంపేట, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంచాల్సిన పింఛను సొమ్ము రూ.2.13 లక్షలతో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పరారయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రేడులో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. చండ్రేడు గ్రామ సచివాలయానికి ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.14,03,000 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రంగంపేట ఆర్‌సీబీ బ్రాంచ్‌లోని పెన్షన్ ఖాతాలో జమ చేసింది. సచివాలయ సంక్షేమ, విద్యా సహాయకులు ఆగస్టు 30నే ఆ మొత్తాన్ని డ్రా చేసి పంపిణీకి బాధ్యులైన అధికారులకు అందజేశారు. అందులో రూ.2,13,500 వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేశ్‌కు ఇచ్చి ఆయన వద్ద రశీదు తీసుకున్నారు. అయితే గణేశ్ సోమవారం విధులకు హాజరు కాకుండా, ఉదయం నుంచి పెన్షన్లు పంపిణీ చేయకుండా, సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో పింఛనుదార్లు ఆందోళనకు గురయ్యారు. ఎంపీడీవో వీవీ సాయిబాబు సంక్షేమ సహాయకులు, పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా రంగంపేట పోలీస్ స్టేషన్‌లో గణేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గణేశ్ గతంలో పనిచేసిన పెదపూడి మండలంలో కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం ఉందని సాయిబాబు పేర్కొన్నారు. కాగా, చండ్రేడులో పెన్షన్ల పంపిణీకి అంతరాయం లేకుండా వెంటనే కొత్త పీడీవోను నియమించినట్టు ఆయన తెలిపారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాలతో గణేశ్‌ను సస్పెండ్ చేసినట్టు వివరించారు.