నిలువు దోపిడీ!
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:02 AM
దుర్గమ్మను దర్శించుకునేందుకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులను అక్కడి దుకాణాల వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. కొండపైన, దిగువున అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా షాపులు ఏర్పాటు చేసుకుని రంగునీళ్ల సోడా రూ.35, వాటర్ బాటిల్ రూ.30 అంటూ భక్తుల జేబులను ఖాళీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

-ఇంద్రకీలాద్రిపై నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు
-కొండపైన, దిగువున అధిక ధరలకు విక్రయాలు
-ఇష్టారాజ్యంగా షాపుల ఏర్పాటు
-రంగునీళ్ల సోడా రూ.35.. వాటర్ బాటిల్ రూ.30
-పూజా సామగ్రి సెట్టు అంటూ భక్తుల జేబులు ఖాళీ
-భక్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
దుర్గమ్మను దర్శించుకునేందుకు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులను అక్కడి దుకాణాల వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. కొండపైన, దిగువున అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా షాపులు ఏర్పాటు చేసుకుని రంగునీళ్ల సోడా రూ.35, వాటర్ బాటిల్ రూ.30 అంటూ భక్తుల జేబులను ఖాళీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంద్రకీలాద్రి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):
ఇంద్రకీలాద్రి కొండపైన, దిగువున వ్యాపారులు కొన్ని రకాల వస్తువులు విక్రయించేందుకు దేవస్థానం నుంచి అనుమతి తీసుకున్నారు. వారు తమ దుకాణాలను ఎనిమిది అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ కొండ దిగువున కొందరు వ్యాపారులు 13 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవుతో ఇష్టారాజ్యంగా షాపులను ఏర్పాటు చేశారు. ఒకవైపు మాత్రమే వ్యాపారం చేసుకోవాల్సి ఉంటే రెండు వైపులా విక్రయాలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. షాపుల కేటాయింపులో కూడా నిబంధనలు పాటించటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
అధిక ధరలు వసూలు
కొండపైన, దిగువున కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్ల దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్‌కే అధికారుల నుంచి అనుమతి తీసుకుని పూజా సామగ్రి, టెంకాయ, చేతి తాడు, ఇతర పానీయాలను అనధికారికంగా విక్రయిస్తున్నారు. కొండపైన కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల షాపులో టెంకాయ, పసుపు, కుంకుమ, గాజులు, నిమ్మకాయలను సెట్టుగా పెట్టి రూ.100లకుపైగా వసూలు చేస్తున్నారు. ముక్క చీర రూ.100, పసుపు, కుంకుమ, ముక్క చీర, టెంకాయ కలిపి సెట్టుగా రూ.200, టెంకాయ రూ.40లకు విక్రయిస్తున్నారు. గుర్తింపు లేని వాటర్ బాటిల్ ఒక్కొక్కటి రూ.30 విక్రయించి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కూల్‌డ్రింక్‌పై ఎంఆర్‌పీ కంటే రూ.5 నుంచి 10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. చేతికి కట్టుకునే తాడు రూ.50లు, కుంకుమభరణి రూ.25లు, ఇతర పూజా సామగ్రికి అధికంగా రుసుం వసూలు చేస్తున్నారు. కొండపై ఒకే ఒక షాపు ఉండటం వల్ల దుకాణంలో ఉన్న సిబ్బంది అడిగినంత డబ్బులు భక్తులు ఇవ్వాల్సి వస్తోంది. ఈ షాపు కూడా నిబంధనలకు విరుద్ధంగా దుర్గగుడిలో అవుట్ సోర్సింగ్‌లో చేసే ఓ ఉద్యోగి నిర్వహిస్తున్నట్లు సమాచారం.
యథేచ్ఛగా రంగునీళ్ల గోలీ సోడాలు
కొండ దిగువున, మహామండపం ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్స్ దుకాణంలో కేవలం వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే విక్రయించాలి. అయితే అనధికారికంగా రంగునీళ్ల గోలీ సోడాలు అమ్ముతున్నారు. సోడా ధర రూ.35 నుంచి 40 వరకు, ఓ కంపెనీ బాదం పాలు ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. అధిక ధరల వసూళ్లపై పలువురు భక్తులు సంబంధిత విభాగం అధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. వ్యాపారస్తుల వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా ఆలయ ఉద్యోగుల సమాధానం
దేవస్థానంలో వ్యాపారస్తులు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్నారని, భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని సంబంధిత లీజు విభాగం ఏఈవో దుర్గారావు, సూపరింటెండెంట్ డి.వి.వి.సత్యనారాయణను వివరణ కోరగా, మాకేమి తెలియదు, ఈవో దృష్టికి తీసుకువెళ్లండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నిత్యం పర్యవేక్షించాల్సిన ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం గమనార్హం.