ముగిసిన మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:36 PM
మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. మొదటి రోజు సాంకేతిక కారణాలతో కొన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటినీ అధికమిస్తూ ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్టిఫికెట్ల పరిశీలనను పూర్తి చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,525 మందికి కాల్ లెటర్లు
కర్నూలు ఎడ్యుకేషన, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. మొదటి రోజు సాంకేతిక కారణాలతో కొన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటినీ అధికమిస్తూ ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్టిఫికెట్ల పరిశీలనను పూర్తి చేశారు. అయితే సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమేనని, ఈ అభ్యర్థుల ఎంపిక తుది జాబితా కాదని విద్యాశాఖ అధికారులు చెబుతుండటంతో అభ్యర్థుల గుండెల్లో మరో టెన్షన మొదలైంది. మొదటి రోజున 2,307 మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ జారీ అయ్యాయి. అలాగే రెండో రోజున 218 మందికి కాల్ లెటర్లు జారీ అయ్యాయి. మొత్తం 2,525 మంది అభ్యర్థులకు గానూ 8 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పెండింగ్‌లో ఉంది. వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించి వందశాతం పూర్తి చేసి వివరాలను పంపుతామని డీఈవో శ్యామూల్‌పాల్ చెప్పారు.
సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలి
మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ రంజిత బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నగర సమీపంలోని శ్రీనివాస బీఈడీ కళాశాల కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించి వెరిఫికేషన పరిశీలన బృందాలతో మాట్లాడారు. కాల్ లెటర్స్ పరిశీలనకు సంబంధించి ఎప్పటికప్పుడు వ్యక్తిగత లాగినలో సమాచారాన్ని అప్‌లోడు చేస్తున్నట్లు డీఈవో శామ్యూల్‌పాల్ వివరించారు. సర్వర్ సమస్య పునరావృతం కాకుండా విద్యుత సరఫరాలో అంతరాయం లేకుండా హైపై ఇంటర్నెట్‌తో నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఏడీ వి.ప్రతాప్‌రెడ్డి, అబ్రహాం, కడప ఆర్జేడీ సామేల్, కర్నూలు, నంద్యాల డీఈవోలు శామ్యూల్ పాల్, జనార్దనరెడ్డి, ఉప విద్యాశాఖ అధికారులు, ఏడీలు, మండల విద్యాశాఖ అధికారులు, హెచఎంలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.