డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:20 AM
డీఎస్సీ-2025లో అర్హత సాధించిన ఉమ్మడి కృష్ణాజిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచే అభ్యర్థులు నోబుల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులు, వారి బంధువుల రాకతో నోబుల్ కళాశాలకు వెళ్లే రహదారి నిండిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
- తొలిరోజు 1,048 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
- పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి ప్రసన్నకుమార్, డీఈవోలు
- అధిక మార్కులు వచ్చినా కాల్ లెటర్‌లు రాలేదని పలువురు ఫిర్యాదు
- ఒకటీ, రెండు రోజుల్లో వస్తాయంటున్న అధికారులు
- ఓపెన్ కేటగిరిలో ఎస్సీ, బీసీలకు పోస్టులు కేటాయించడం లేదంటున్న ఉపాధ్యాయ సంఘాలు
మచిలీపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025లో అర్హత సాధించిన ఉమ్మడి కృష్ణాజిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచే అభ్యర్థులు నోబుల్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులు, వారి బంధువుల రాకతో నోబుల్ కళాశాలకు వెళ్లే రహదారి నిండిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
1,048 మంది అభ్యర్థులు హాజరు
డీఎస్సీ-2025లో అర్హతసాధించిన వారిలో 1,048 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. నోబుల్ కళాశాలలోని 21 గదుల్లో, గదికి 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించి సర్టిఫికెట్‌లను పరిశీలించారు. ఒక్కో గదిలో ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రెవెన్యూ అధికారి, టెక్నికల్ సిబ్బంది, పీడీ, పీఈటీ ఐదుగురితో కూడిన బృందం సర్టిఫికెట్‌లను పరిశీలించింది. ఒక్కో అభ్యర్థి మూడు సెట్‌ల జిరాక్సు కాపీలను అధికారులకు ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్నకుమార్, కృష్ణా డీఈవో పీవీజే రామారావు, ఎన్టీఆర్ జిల్లా డీఈవో యూవీ సుబ్బారావు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ధూర్జటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డీఎస్సీలో అర్హత సాధించి సర్టిఫికెట్‌లు సమర్పించిన వారిలో ఒకరిద్దరు అభ్యర్థులపై పోలీస్ కేసులు నమోదై ఉన్నట్లుగా తేలడంతో, వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయనే అంశంపైనా అధికారులు వివరాలు సేకరించారు.
కాల్ లెటర్‌లు రాలేదని ఆందోళన
నోబుల్ కళాశాలకు పలువురు అభ్యర్థులు వచ్చి తమకు డీఎస్సీలో అధిక మార్కులు వచ్చినప్పటికీ కాల్‌లెటర్ రాలేదని, తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్‌లు వచ్చాయని అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన ఒక్కరోజులోనే పూర్తికాదని, నాలుగైదు రోజులపాటు కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసన్నకుమార్, కృష్ణా డీఈవో పీవీజే రామారావు చెప్పారు. ఒకటీ రెండు రోజుల్లో కాల్ లెటర్లు వస్తాయని, కంగారు పడవద్దని అభ్యర్థులకు వివరించారు.
ఎస్సీ, బీసీలకు ఓపెన్ కేటగిరిలో పోస్టులు చూపడం లేదు
ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు వంద మార్కులకు గాను 94 నుంచి 95 మార్కులు సాధించినా, వారికి ఓపెన్ కేటగిరిలో పోస్టింగ్ చూపకుండా, వారి సామాజిక వర్గం కోటాలోనే పోస్టింగ్‌లు చూపుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. అధిక మార్కులు సాధించిన ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల వారికి ఓపెన్ కేటగిరిలో పోస్టులు ఇస్తే, తక్కువ మార్కులు సాధించిన వారిలో కొందరికి టీచర్ పోస్టులు వస్తాయని పేర్కొంటున్నారు. అధిక మార్కులు సాధించిన ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరిలో పోస్టులు చూపకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఉపాధ్యాయు సంఘాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు గురువారం చక్కర్లు కొట్టాయి.