Share News

AP High Court: పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:20 AM

టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో నిందితులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి...

AP High Court: పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

  • పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

ఇంటర్నెట్ డెస్క్: టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్య కేసులో నిందితులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. తీర్పు వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. పల్నాడు జిల్లా, వెల్దుర్తి పోలీసులు నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిన్నెల్లి సోదరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం హైకోర్టు తుది విచారణ జరిపింది. పోలీసుల తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘‘పిన్నెల్లి సోదరుల ప్రోద్బలం, మద్దతుతోనే హత్యలు జరిగాయి. సాక్షులు వాంగ్మూలం కూడా ఇచ్చారు. హత్యలో భాగస్వాములైన వ్యక్తులతో పిన్నెల్లి సోదరుల ఫోన్‌ సంభాషణ రికార్డు, సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. హత్యకు పిటిషనర్లే కుట్రపన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వాస్తవాలు వెలికి తీయాలంటే పిటిషనర్ల కస్టోడియల్‌ విచారణ అవసరం. మధ్యంతర ఉత్తర్వుల కారణంగా వారిని విచారించడం సాధ్యపడలేదు. పిటిషనర్లు రాజకీయంగా, ఆర్థికంగా బలవంతులు. కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని ఏజీ విన్నవించారు. ఫిర్యాదుదారుడు తోట ఆంజనేయులు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కేసులో ఏ7గా ఉన్న పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి చాలాకాలంగా పరారీలోనే ఉన్నారన్నారు. వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా హత్యలు జరిగాయన్నారు. హత్యల విషయంలో పిటిషనర్లకు ఎలాంటి పాత్ర లేదన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 05:24 AM