Venkateswara Swamy Temple: 10 కోట్లతో గుడి నిర్మాణం..
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:30 AM
ఆయనకు దైవభక్తి మెండు! దాతృత్వమూ ఎక్కువే! ఒక్కరూపాయి విరాళాలు సేకరించకుండా రూ.10 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఏడాదిన్నర కిందటే పూర్తి
సోషల్ మీడియాలో ప్రాచుర్యం
పలాస, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆయనకు దైవభక్తి మెండు! దాతృత్వమూ ఎక్కువే! ఒక్కరూపాయి విరాళాలు సేకరించకుండా రూ.10 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆయనే... హరి ముకుంద పండా! శనివారం కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది ఆయన నిర్మించిన ఆలయంలోనే! కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారి, రైతు హరి ముకుంద పండాకు చిన్నతనం నుంచే దైవభక్తి ఎక్కువ. ఆయన వయసు 95 సంవత్సరాలు. శ్రీదుర్గా కళామందిర్‌ను నెలకొల్పి సినీ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. స్థానిక చిన్నకలియాపండా నగర్‌లో దుర్గాదేవి ప్రఽధాన ఆలయంతోపాటు ఇతర ఉప ఆలయాలను నిర్మించారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో మరో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ‘నేను నిత్యం ఆరాధించే దుర్గాదేవి కలలోకి వచ్చి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని ఆదేశించారు’ అని చెప్పి 12.22 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ఐదేళ్లకుపైగా పట్టింది. సుమారు రూ.10కోట్ల వరకూ వెచ్చించారు. ఇందులో శ్రీదేవి, భూదేవి సహిత విగ్రహాలతో పాటు మహాభారత, రామాయణ ఘట్టాలను తెలిపే వివిధ శిల్పాలను ఏర్పాటు చేశారు. వివిధ దేవతా విగ్రహాలను రాజస్థాన్, తిరుపతి నుంచి తీసుకుకొచ్చి ప్రతిష్ఠించారు. గతేడాది జూలైలో ఆలయాన్ని ప్రారంభించారు. స్థానికులు దీనిని ‘చిన్న తిరుపతి’గా పిలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరడంతో జనం రాక కూడా పెరిగింది.
ఊహించలేక పోయాం: పండా
పలాస, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఇంత విషాదం జరుగుతుందని తాము ఊహించలేకపోయామని కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త, వ్యవస్థాపకుడు హరిముకుంద పండా తెలిపారు. తొక్కిసలాట ఘటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సోమ, శనివారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారని, వారికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్తీక ఏకాదశి కావడంతో ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసినా భక్తులు ఒక్కసారిగా లైన్ల నుంచి జారిపడడంతో దుర్ఘటన జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. పోలీసులకు తాము సమాచారం ఇచ్చినా వాహనాల రాకపోకలు నియంత్రించారుగానీ ఆలయం లోపలకు రాలేదన్నారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష కన్నీరు
పలాస, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో చనిపోయినవారి మృతదేహాలను చూసి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చలించిపోయారు. క్షతగాత్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు విని ఆమె కూడా కన్నీటిపర్యంతమయ్యారు. నోట మాటరాక... కొద్దిసేపు అక్కడే కూర్చుండిపోయారు.