Liquor Accused Venkatesh Naidu: మీరు నన్నేం చేయలేరు
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:22 AM
మద్యం కుంభకోణంలో రిమాండ్ నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు కోర్టు హాలు బయట వీరంగం సృష్టించాడు. సిట్ సిబ్బందిపై రెచ్చిపోయాడు.
‘సిట్’ సిబ్బందిపై వెంకటేష్ నాయుడు వీరంగం
విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రిమాండ్ నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు కోర్టు హాలు బయట వీరంగం సృష్టించాడు. సిట్ సిబ్బందిపై రెచ్చిపోయాడు. ‘నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు? మీవల్లే అవి బయటకు తెలుస్తున్నాయి. మీరు నన్ను ఏం చేయగలరు? మహా అయితే మరోఏడాది జైలులో పెడతారు. అంతకుమించి ఏమీ చేయలేరు’ అంటూ చిందులు తొక్కాడు. ఈ ఘటన విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం జరిగింది. మద్యం స్కాం నిందితులను రిమాండ్ పొడిగింపు నిమిత్తం సిట్ పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిందితులందరినీ న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టినప్పుడు వెంకటేష్ నాయుడు ఫోన్ తెరవడానికి సంబంధించి సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రతినిధులు కోర్టుకు హాజరై మోమో దాఖలు చేశారు. ఫోన్ విషయంపై కోర్టు హాలు బయట వెంకటేష్ న్యాయవాది కె.జయరాం, సిట్ కానిస్టేబుల్ సందీప్ మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వెంకటేష్ సతీమణి వారి మాటలు విన్నారు. ఆపై నేరుగా తన భర్త వద్దకు వెళ్లి ఫోన్‌లో తెలియకుండా ఏం దాచావని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఫోన్‌లో ఉన్న రహస్యాలు భార్యకు తెలియడానికి సిట్ సిబ్బందే కారణమని వెంకటేష్ భావించాడు. దీంతో సిట్ కానిస్టేబుల్ సందీప్ వద్దకు వెళ్లి.. మీరు నన్ను ఏమీ చేయలేరంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై బయటఉన్న నిందితుడు మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి.. వెంకటేష్‌ని కూర్చోబెట్టి పరిస్థితులు బాగోలేవని, ఆచితూచి మాట్లాడాలని వారించారు.