EX Vice President Venkaiah Naidu: చదువు, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:25 AM
‘చదువు, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలి. అప్పుడే ఇంగ్లీషుపై వ్యామోహం తగ్గుతుంది’ అని...
ప్రాచీన తెలుగుహోదా ఫలాలు భవిష్యత్తు తరాలకు అందించాలి
ఆధునిక అవసరాలకు అనుగుణంగా భాషను మన పద్ధతుల్లో అన్వయించుకోవాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విజయవాడ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘చదువు, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలి. అప్పుడే ఇంగ్లీషుపై వ్యామోహం తగ్గుతుంది’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తూమాటి దొణతిమ్మరాయ చౌదరి(దొణప్ప) శతజయంతిని పురష్కరించుకుని విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పుస్తక రూపకర్తలైన చెన్నపురి తెలుగు అకాడమీ సభ్యులు తూమాటి సంజీవరావు, తిరునగరి భాస్కర్, పుస్తకంలోని వ్యాసాలు అందించిన రచయితలకు అభినందించారు. ‘‘మన జీవన విధానంలో మాతృభాష ఆయువు పట్టు వంటిది. ఆయువు లేకపోతే ఏ ప్రాణి అయినా జీవచ్ఛవం. అటువంటి తెలుగు సంప్రదాయాలను పునరుజ్జీవింప చేయాలి. లేకపోతే భవిష్యత్తు తరాలకు ప్రమాదం. తెలుగువారికి తెలుగు రాకపోతే మాట పడిపోయినట్టే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు నేర్చుకోవాలి. తెలుగువారు ఎక్కడ కలుసుకున్నా మాతృభాషలోనే సంభాషించుకోవాలి. ‘మన భాషను నేర్చుకుందాం- పరభాషను గౌరవిద్దాం’ అనే నినాదంతో తెలుగువారు ముందుకెళ్లాలి. రాష్ట్రంలో తెలుగుభాషా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా భారతప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా ఇచ్చినా, తెలుగు వెలుగులు భావితరాలకు అందకపోవడం విచారకరం. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి తదితర విభాగాల్లో దొణప్ప చేసిన కృషి మహోన్నతమైనది’ అని వెంకయ్య అన్నారు.. సాహితీ సవ్యసాచిగా, సాహితీ కృషీవలుడుగా పేరు పొందిన దొణప్పతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, తెలుగు సాహితీవేత్త సూరం శ్రీనివాసరావు, పాలడుగు లక్ష్మణరావు, తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.