Share News

ట్రస్టు భూములపై వెలంపలీ కన్నేశారు!

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:28 AM

వందల కోట్ల రూపాయల విలువైన గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్టు భూములను చేజిక్కించుకునేందుకు గత వైసీపీ ప్రభుత్వంలో దేవదాయశాఖ మంత్రిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు విశ్వప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి లీజుదారులకు అండగా తెర వెనుక పావులు కదిపారని విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో ట్రస్టీ వారసులకు అండగా ఉన్నట్టు డబుల్‌ గేమ్‌ ఆడినట్లు సమాచారం. విచారణ అధికారి నివేదికను సైతం బయటకు రానీయకుండా తొక్కిపట్టడంలో కీలక పాత్ర వహించినట్లు తెలిసింది.

ట్రస్టు భూములపై వెలంపలీ కన్నేశారు!

- గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్టు భూములు కొట్టేసేందుకు నాడే ప్రణాళిక!

- మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి తెర వెనుక పావులు!

- లీజుదారులకు అండగా వ్యవహారాలు

- ట్రస్టీ వారసులతోనూ కలిసి డబుల్‌ గేమ్‌

- వైసీపీ ప్రభుత్వంలో నివేదికను తొక్కిపట్టడంలో కీలకపాత్ర

- ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నిగూఽఢ అంశాలు

వందల కోట్ల రూపాయల విలువైన గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్టు భూములను చేజిక్కించుకునేందుకు గత వైసీపీ ప్రభుత్వంలో దేవదాయశాఖ మంత్రిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు విశ్వప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి లీజుదారులకు అండగా తెర వెనుక పావులు కదిపారని విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో ట్రస్టీ వారసులకు అండగా ఉన్నట్టు డబుల్‌ గేమ్‌ ఆడినట్లు సమాచారం. విచారణ అధికారి నివేదికను సైతం బయటకు రానీయకుండా తొక్కిపట్టడంలో కీలక పాత్ర వహించినట్లు తెలిసింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలంపల్లి శ్రీనివాసరావు దేవదాయశాఖ మంత్రిగా పనిచే శారు. అప్పుడే ఈ భూములపై కన్నేసినట్టు సమాచారం. గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు భూములను లీజుకు తీసుకున్న వారికి అండదండలు అందిస్తూ ఆ భూములను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు పథకం వేశారని సమాచారం. అయితే ఆయన మంత్రిగా ఉన్నంతకాలం ఈ భూములను చేజిక్కించుకోలేకపోయారు. రెండున్నర సంవత్సరాల పాటు వెలంపల్లి దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశాక, కొట్టు సత్యనారాయణను మంత్రిగా నియమించారు. గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు భూములకు సంబంధించి లీజుదారులకు అండగా మాజీ మంత్రి వెలంపల్లితో పాటు సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి.

భూముల ధరలు పెరగడంతో..

పటమటలోని సర్వే నంబర్‌ 91/2లోని 5.92 ఎకరాల గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్టు భూములు అనేవి 1947లో వారి కుటుంబీకులు డాక్యుమెంట్‌ నంబర్‌ 949 ద్వారా ట్రస్ట్‌ డీడ్‌ చేశారు. 1966 దేవదాయశాఖ చట్టం సెక్షన్‌ 38లోని 17 భాగం మేరకు ఆర్‌డీఎస్‌ నంబర్‌ ఏ1/14572/81 ప్రకారం జనవరి 22, 1982లో రిజిస్టర్‌ అయి ఉంది. కాబట్టి ఈ పబ్లిక్‌ ట్రస్ట్‌ అనేది దేవదాయ శాఖ పరిధిలోకి రావటం జరిగింది. ఈ ట్రస్ట్‌కు సంబంధించిన భూములను అంతకు పూర్వమే అప్పటి ట్రస్టీలుగా వ్యవహరించిన వారు లీజులకు ఇచ్చారు. పటమట ప్రాంతం ఒక గ్రామంగా ఉన్న రోజుల్లో ఈ లీజు వ్యవహారం జరిగింది. గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టుకు చెందిన భూములకు సంబంధించి ఒక ఎకరం ఒకరికి లీజుకు ఇవ్వగా, మరో 3.92 ఎకరాల భూమిని ఆంధ్రా ఆయిల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌, సురేంద్ర కాటన్‌ ఆయిల్‌ మిల్స్‌ సంస్థలకు లీజుకు ఇచ్చారు. అప్పట్లో వీటిని కారుచౌకగా లీజులకు ఇవ్వటం జరిగింది. కాలక్రమంలో పటమట కాస్తా విజయవాడ నగరంలో అత్యంత ధనికమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. దీంతో గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు భూములకు కూడా విలువ పెరిగింది. రూ.250 కోట్ల పైబడి ఈ భూములకు ధర పలుకుతోందంటే అర్థం చేసుకోవచ్చు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి..

ఈ భూములపై లీజుదారులు ఒక వైపు, ట్రస్టీ వారసులు మరోవైపు కన్నేశారు. లీజుదారులలో ఒకరు అయితే ఏకంగా ఓ జాతీయ బ్యాంకు దగ్గర ఈ భూములు తనఖా పెట్టి రూ.100 కోట్లకు రుణం తీసుకున్నారు. ఈనాం భూములుగా కాకుండా సర్వే నంబర్‌ గ్యాంబ్లింగ్‌తో దొంగ రిజిస్ర్టేషన్‌ చేసి దానిపై రుణాన్ని పొందినట్టు సమాచారం. ఈ రుణం ఎంతకూ తీర్చకపోవటంతో బ్యాంకులు నోటీసులు ఇవ్వటం ప్రారంభించాయి. దాదాపుగా బ్యాంకుకు రూ. 200 కోట్ల మేర వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఈ వ్యవహారం కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చింది.

దేవదాయశాఖ అధికారులపై ఒత్తిడి

దేవదాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ భూములు దేవదాయ శాఖ పరిధిలోకే రావన్న వాదనలను నాడు తెరమీదకు తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ వాదనలు తీసుకురావటం వెనుక మాజీ మంత్రి వెలంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం అప్పటి దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు తెలియటంతో ఆయన ఆదేశాల మేరకు దేవదాయశాఖ అధికారులు విజయవాడ నగర పరిధిలోని సత్రాలు, చారిటబుల్‌ ట్రస్టులు వంటి వాటికి సంబంధించి తగిన నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించటం జరిగింది. ఈ క్రమంలో మచిలీపట్నం రాబర్ట్‌సన్‌ పేటలో ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి గోవింద రాజులు ధర్మ ఈనాం ట్రస్ట్‌ భూములకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి అప్పటి ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయశాఖ అధికారికి సవివరమైన నివేదికను అందించారు. ఈ నివేదికపై స్థానిక దేవదాయ శాఖ అధికారులను తదుపరి చర్యలు తీసుకోకుండా మాజీ మంత్రి వెలంపల్లి ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దేవదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ రాకపోయి ఉంటే ఈ భూములు ఎప్పుడో అన్యాక్రాంతమైపోయి ఉండేవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్టు వ్యవహారంలో మాజీ మంత్రి వెలంపల్లి డబుల్‌ గేమ్‌ కూడా ఆడినట్టుగా తెలుస్తోంది. ఇటు లీజుదారులతో పాటు అటు వారసులకు కూడా సహాయ సహకారాలు అందించినట్టుగా విమర్శలు ఉన్నాయి.

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అధికారుల్లో కదలిక

ట్రస్టీ వారసులు కూడా ఈ భూములను అమ్ముకునేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పబ్లిక్‌ ట్రస్ట్‌గా ఉన్న భూములను అమ్ముకోవటానికి అవకాశం లేదని విచారణాధికారి స్పష్టం చేశారు. దీంతో పాటు గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టుకు చెందిన ట్రస్టీ దేవదాయ చట్టం 30/87లోని సెక్షన్‌ 28(1)లో ఏ ప్రకారం సంస్థ ఆస్తులను కాపాడలేకపోయారని, ట్రస్టు ఆశయాలను నెరవేర్చలేదని, చట్టవిరుద్ధంగా నష్టం కలిగించే చర్యలు తీసుకున్నారని తన రిపోర్టులో పొందు పరుస్తూ ట్రస్టీకి సెక్షన్‌ 28(2) ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వారి నుంచి సరైన సమాచారాన్ని తీసుకున్న తర్వాత దేవదాయ చట్టం 28(3) ప్రకారం ఆ ట్రస్టీని తాత్కాలికంగా తొలగించి వేరే ట్రస్టీని నియమించాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే ట్రస్టు ఆస్తులను అమ్మకానికి సంబంధించిన చర్యలను కూడా రద్దు చేసి, తిరిగి రాబట్టాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. కానీ ఈ నివేదిక ప్రకారం దేవదాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి మాజీ మంత్రి ఒత్తిడే ప్రధాన కారణమని తెలుస్తోంది. గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్టు భూములపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల ‘రూ.250 కోట్ల పబ్లిక్‌ ట్రస్ట్‌ భూమి గోవిందా!’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై దేవదాయ శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. అంతకు ముందు వరకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ ట్రస్ట్‌ దేవదాయశాఖకు సంబంధం లేదన్న వాదనలు తెర మీదకు తీసుకువచ్చారు. 2023లో ఈ భూములకు సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయశాఖ అధికారికి ఇది దేవదాయచట్టం పరిధిలోకి వస్తుందని, పబ్లిక్‌ ట్రస్టు అని నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక బయటకు రావటంతో దేవదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.

Updated Date - Apr 05 , 2025 | 01:28 AM