Share News

Automated Testing Centers: వాహనాల ఫిట్‌నెస్‌ గాలికి

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:01 AM

రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలు(ఏటీఎస్‌) రివర్స్‌ గేర్‌లో నడుస్తున్నాయి.

Automated Testing Centers: వాహనాల ఫిట్‌నెస్‌ గాలికి

  • ఏటీఎస్‌లు వచ్చినా ఇదే తీరు.. సర్టిఫికెట్‌ ఫీజు విడుదలకు జనవరిలోనే సీఎం ఆదేశం

  • మొన్నటివరకు అమలుకానివ్వని ఓ అధికారి

  • ఇప్పుడు సీమకు చెందిన ఓ మంత్రి మోకాలడ్డు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలు(ఏటీఎస్‌) రివర్స్‌ గేర్‌లో నడుస్తున్నాయి. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ)ల కోసం వసూలు చేసే ఫీజులను రాష్ట్రప్రభుత్వం ఏటీఎస్‌ నిర్వాహకులకు విడుదల చేయడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినా అతీగతీ లేదు. దీంతో వాహనదారుల నుంచే వారు వసూళ్లు చేసుకుంటూ డొక్కు బళ్లకు సైతం ఎఫ్‌సీలు జారీచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం చేపట్టిన ఓ సర్వేలో.. వాహనాలకు ఫిట్‌నెస్‌ సరిగా లేకపోవడమే ప్రమాదాలకు ఒక ప్రధాన కారణంగా తేలింది. రాష్ట్రాల్లోని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ)లు వాటి ఫిట్‌నెస్‌ సరిగా చూడకుండా మామూళ్లు తీసుకుని ఎఫ్‌సీ ఇస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఫిట్‌నెస్‌ నిర్ధారణకు అత్యంత అధునాతన పరికరాలతో కూడిన ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో రూ.16.50 కోట్లతో ఒక కేంద్రంనిర్మాణం చేపట్టి.. ఇతర జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తులకు అవకాశం ఇచ్చింది.వైసీపీ ప్రభుత్వంలో మొదలైన టెండర్ల ప్రక్రియ.. కూటమి ప్రభుత్వంలో పూర్తయింది. అరకు జిల్లా మినహా ఇతర 25 జిల్లాల్లోనూ టెండర్లు దాఖలయ్యాయి. ఐదా రు జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో ఆయా కేంద్రాలు అమల్లోకి వచ్చాయి. వాటి వద్దకు రాష్ట్రంలోని ప్రజా, సరకు రవాణా వాహనాలు తనిఖీల కోసం వెళ్లి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందుతున్నాయి. అయితే ప్రైవేటు వ్యక్తులు ఏటీఎస్‌లు ఏర్పాటు చేయడానికి ఒక్కోదానికి సుమారు రూ.4 కోట్ల వరకూ ఖర్చయింది. ఆ మొత్తాన్ని రికవరీ చేసుకోవడానికి మొదటి రెండేళ్లు ఫిట్‌నెస్‌ ఫీజు రూ.1,000తోపాటు సర్టిఫికెట్‌ ఫీజు రూ.200 కూడా వాళ్లే తీసుకునేలా ఒప్పందం ఉంది.


ఆ తర్వాత జిల్లాలవారీగా రాష్ట్రప్రభుత్వంతో కలిసి ఆదాయాన్ని పంచుకోవలసి ఉంటుంది. అయితే ఎఫ్‌సీ కోసం వాహనదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నప్పుడు చెల్లించే మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తోంది. ఆ వెంటనే ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్‌ నుంచి ఏటీఎస్‌ నిర్వాహకుల ఖాతాల్లోకి దానిని బదిలీ చేయాలి. అయితే ఇటీవలే బదిలీ అయిన రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు.. తనతో నేరుగా మాట్లాడితేనే డబ్బు జమ చేస్తానని మెలిక పెట్టారు. దీనిని ఏటీఎస్‌ల నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో.. ఒప్పందం ప్రకారం డబ్బులు విడుదల చేయాలని ఈ ఏడాది జనవరి చివరి వారంలోనే ఆయన ఆదేశాలిచ్చారు. అయినా అ అధికారి అమలు చేయకుండా ఆపేశారు. ఇటీవల ఆయన బదిలీ అయ్యారు. ఇప్పుడైనా తమ డబ్బులు వస్తాయని ఆశించిన ఏటీఎస్‌ల నిర్వాహకులకు ఓ మంత్రి పెద్ద షాకే ఇచ్చారు. మొదటిసారి మంత్రి అయిన ఆ రాయలసీమ నాయకుడు.. ‘నాతో మాట్లాడితేనే కదా.. పనయ్యేది’ అని అనడంతో వారంతా వెళ్లి కలిశారు. తీరా ఆయన అడిగిన మొత్తం వినగానే వారికి గుండె పట్టేసినట్లయింది. నోరెత్తకుండా బయటకు వచ్చేశారు. ప్రభుత్వం నుంచి తమ డబ్బులు రాకపోవడంతో ఫిట్‌నెస్‌ కోసం వచ్చే వాహనదారుల నుంచే అదనంగా వసూళ్లు చేయడం మొదలుపెట్టారు. ఎందుకివ్వాలని ఎవరైనా అడిగితే.. ఏడాదైనా మా డబ్బులు మాకు ఇవ్వకపోతే ప్రతి నెలా సిబ్బందికి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు ఎలా భరించాలని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘మాకు ఎక్కువ అవసరం లేదు.. గతంలో ఎంవీఐకి ఇచ్చినట్లే ఇవ్వండి.. మీ బండికి ఎఫ్‌సీ ఇచ్చేస్తాం..’ అని అంటున్నారు. ఇలాంటి అక్రమాలు అరికట్టేందుకే కేంద్రం ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ కేంద్రాలు తీసుకొచ్చింది. కానీ రాష్ట్రప్రభుత్వం తమ డబ్బులు ఇవ్వడం లేదన్న సాకుతో ఏటీఎస్‌లు వాహనదారుల నుంచి మామూళ్లు తీసుకుని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి పాస్‌ చేసేస్తే.. ఆ వాహనాలు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలు జరిగితే.. మొత్తం లక్ష్యం నీరుగారిపోయినట్లు కాదా..? దీనినే వారి వద్ద ప్రస్తావిస్తే.. ముఖ్యమంత్రి ఆదేశించినా.. మొన్నటిదాకా ఉన్నతాధికారి.. ఇప్పుడు మంత్రి నిధుల విడుదలకు సహకరించనప్పుడు ఏం చేయాలని వారు వాపోతున్నారు.


అన్ని విధాలా నష్టమే..

రాష్ట్రాల్లో ఏటీఎస్‌లు ఏర్పాటు చేసిన వారికి మొత్తం ఖర్చులో 50 శాతాన్ని కేంద్రం రాయితీగా ఇస్తోంది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు 4 కోట్లవుతుంటే రెండు కోట్ల వరకూ చెల్లిస్తోంది. ఇప్పటికే మన రాష్ట్రానికి రూ.12 కోట్లు ఇచ్చిన కేంద్రం.. మిగతా రూ.105 కోట్లు ఇచ్చేందుకు ఇటీవలే సమ్మతించింది. మరోవైపు.. రాష్ట్ర ఖజానాకు చేరిన ఫీజుల డబ్బు ఏటీఎస్‌ నిర్వాహకులకే అ ందాలి. ఈ మొత్తం ఏడాదికి కనీసం రూ.40 కోట్ల వరకూ ఉంటుంది. రాష్ట్రంలో ఫిట్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రానికి రూ.117 కోట్లు ఖర్చయినా.. రాష్ట్రప్రభుత్వ స్థాయిలో ఒకరిద్దరి తీరు వల్ల అవినీతి పెరిగి.. మళ్లీ పాత, డొక్కు బండ్లే రోడ్లపైకి వస్తున్నాయి.

Updated Date - Sep 22 , 2025 | 04:04 AM