Share News

Vegetable Prices: కూరగాయాలు

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:39 AM

మొంథా తుఫాను, కృష్ణా, గోదావరి నదులకు వరదల కారణంగా లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో గత 20 రోజులుగా బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

Vegetable Prices: కూరగాయాలు

  • ఉత్పత్తి తగ్గి.. ధరలు పైపైకి

  • మొంథా తుఫానుకు దెబ్బతిన్న తోటలు

  • సామాన్యులపై పడుతున్న భారం

  • బహిరంగ మార్కెట్లో ఏ రకం అయినా కిలో రూ.70పైనే

  • కిలో చిక్కుడు కాయలు 120

  • క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం, బీన్స్‌ 80-100

  • రైతుబజార్లలోనూ వ్యత్యాసం తక్కువే

మొంథా తుఫానుతో ఇటీవల పెద్దఎత్తున పంటలు దెబ్బతిని రైతులు నష్టపోగా.. ఇప్పుడు ఆ ప్రభావం సామాన్యులపైనా చూపుతోంది. తుఫాను గాలులు, భారీ వర్షాలకు కూరగాయ తోటలు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. డిమాండ్‌- సప్లైలో వ్యత్యాసం కారణంగా ధరలకు రెక్కలొచ్చాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మొంథా తుఫాను, కృష్ణా, గోదావరి నదులకు వరదల కారణంగా లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో గత 20 రోజులుగా బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యాపారులు ఉత్పత్తి లేదంటూ ధరలు అమాంతం పెంచేశారు. తుఫాను తర్వాత రిటైల్‌ మార్కెట్‌లో ఏ రకం కూరగాయలు అయినా కిలో రూ.70కు తక్కువ పలకడం లేదు. కొన్ని రకాలు సెంచరీ కొట్టాయి. గత నెలలో కిలో టమోటా రూ.20కు పడిపోగా, ప్రస్తుతం రూ.60 పలుకుతోంది. కిలో చిక్కుడు రూ.120కు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి రూ.60, బెండ, దొండ, బీర, కాకర, వంకాయ వంటివి కిలో రూ.80 చెబుతున్నారు. క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం, బీన్స్‌ రూ.80-100 పలుకుతున్నాయి. దోసకాయ రూ.60 దాకా చెప్తున్నారు. పొట్లకాయ, సొరకాయ సైజును బట్టి రూ.30-40పైనే ఉంటున్నాయి. ఇవే రకాలు రైతుబజార్లలో కాస్త తక్కువగా ఉన్నా.. అక్కడ రెండో మూడో రకాలే ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. అయినా బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలకు కూరగాయలు కొనలేని సామాన్యులు పట్టణాలు, నగరాల్లోని రైతుబజార్లకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో రైతుబజార్లలోనూ మామూలుగా కన్నా ధర ఎక్కువగానే ఉంటోందని కొనుగోలుదారులు వాపోతున్నారు. తుఫాను గాలుల ధాటికి తీగ పంటలు దెబ్బతినగా, లంక గ్రామాల్లో వరద ముంపుతో నేల పంటలు పాడయ్యాయి. ఇదే సమయంలో కొందరు అయ్యప్ప, భవానీ, శివమాలలు ధరించడం వల్ల శాఖాహారంగా కూరగాయల వినియోగం పెరిగింది.


చికెన్‌ ధరకు రెక్కలు

కార్తీక మాసంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉన్నా.. చికెన్‌ ధరలు తగ్గలేదు. మొన్నటి దాకా కిలో చికెన్‌ రూ.240-260 పలికింది. ఇప్పుడు కొన్ని చోట్ల ధర రూ.280కి చేరింది. కార్తీక మాసం ముగియడంతో నాన్‌వెజ్‌ వినియోగం పెరిగి, చికెన్‌ ధర ఇంకొద్దిగా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు అంటున్నారు.

Updated Date - Nov 24 , 2025 | 04:39 AM