టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:53 AM
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణను నియమించింది.
- ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణ
- నియమించిన అధిష్ఠానం
మచిలీపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపు సత్యనారాయణను నియమించింది. తోట్లవల్లూకు చెందిన వీరంకి గురుమూర్తి ప్రస్తుతం రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మచిలీపట్నానికి చెందిన గోపు సత్యనారాయణ టీడీ పీ రైతు విభాగం జిల్లా అఽధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వీరిద్దరి సేవలకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొనకళ్లను ఆర్ట్టీసీ చైర్మన్‌గా నియమించింది.
ఎన్టీఆర్ జన్మించిన జిల్లాకు అధ్యక్షుణ్ణి కావడం నా అదృష్టం :
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు జన్మించిన జిల్లాకు అధ్యక్షుడిగా నియమితులు కావడం తన అదృష్టమని వీరంకి గురుమూర్తి అన్నారు. పామర్రు టీడీపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక జిల్లాకు అఽధ్యక్షుడిగా తనను ఎంపిక చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతాడనడానికి తానే ఒక నిదర్శనమని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ భూమి, ఆకాశం ఉన్నంతకాలం ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పనిచేస్తానని, కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు నడచుకుంటానని వివరించారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడంతోపాటు, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ జిల్ల్లా అధ్యక్షుడిగా నియమితులైన గురుమూర్తిని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.