Share News

Vasudha Pharma: వసుధ ఫార్మా డైరెక్టర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:34 AM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో గల వసుధ ఫార్మా కెమికల్స్‌ డైరెక్టర్‌ (వర్క్స్‌) మంతెన వెంకట సూర్య నాగవర ప్రసాదరాజు (61) ఆత్మహత్య చేసుకున్నారు.

Vasudha Pharma: వసుధ ఫార్మా డైరెక్టర్‌ ఆత్మహత్య

  • మార్చిలో చీఫ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ అమెరికాలో అరెస్టు

  • అక్రమంగా ఫెంటానిల్‌ ఉత్పత్తి..వందల మంది మరణం?

విశాఖపట్నం/ఉక్కునగరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో గల వసుధ ఫార్మా కెమికల్స్‌ డైరెక్టర్‌ (వర్క్స్‌) మంతెన వెంకట సూర్య నాగవర ప్రసాదరాజు (61) ఆత్మహత్య చేసుకున్నారు. వెయ్యి కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన కంపెనీ డైరెక్టర్‌ పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేగింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోలీసుల కథనం మేరకు.. కుటుంబంతో కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న వరప్రసాదరాజు ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్లారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పరిచయస్తు లను వాకబు చేశారు. అయినా ఆచూకీ లభించ లేదు. ఆదివారం ఉదయం ఆయన సెల్‌కు బంధు వైన ఇందుకూరి సత్యనారాయణ కాల్‌ చేయగా, గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్‌ చేసి.. వరప్రసాదరాజు ప్రగతి మైదానంలో పడిపోయి ఉన్నట్టు చెప్పడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందారు. ఆయన పక్కన పురుగుల మందు డబ్బా, వాటర్‌ బాటిల్‌ ఉన్నాయి. స్టీల్‌ప్లాంటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆయన లేఖ రాశారా? అంటే పోలీసులు సమాధానం చెప్పడం లేదు. ఇతర వివరాలు చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నారు.


కంపెనీ డైరెక్టర్‌ అమెరికాలో అరెస్టు

వసుధ ఫార్మా కెమికల్స్‌ కంపెనీ 1994లో ఏర్పాటైంది. దీనికి ఎంవీ రామరాజు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వరప్రసాదరాజు బల్క్‌ డ్రగ్‌ తయారీ రంగంలో చాలాకాలంగా పనిచేస్తున్నారు. 2007 నుంచి వసుధలో పనిచేస్తున్నట్టు సమాచారం. కంపెనీకి చెందిన ప్రాజెక్టు వర్క్‌లన్నీ ఆయన సమన్వయం చేస్తుంటారు. కంపెనీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉండగా, ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో ఉంది. ఈ కంపెనీ ‘ఫెంటానిల్‌’ అనే మందును తయారుచేసి అమెరికా, తదితర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తోంది. దానిని నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. అయితే ఫెంటానిల్‌ వినియోగంతో అమెరికాలో 12 నెలల కాలంలో వందల మంది మరణించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఈ డ్రగ్‌ వసుధ ఫార్మా నుంచి వస్తోందని గుర్తించింది. దీంతో ఈ సంస్థకు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌, చీఫ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ తన్వీర్‌ అహ్మద్‌ మొహమద్‌ హుస్సేన్‌ పార్కర్‌ (63), మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మంతెన వెంకట నాగ మధుసూదనరాజులను ఈ ఏడాది మార్చి 20న న్యూయార్క్‌లో అరెస్టు చేశారు. వసుధ ఫార్మా టర్నోవర్‌ ఏడాదికి రూ.1,150 కోట్లు. సుమారుగా 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ నిధులను ఈ సంస్థ అక్రమంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి మళ్లించిందనే అనుమానాలతో ఆదాయ పన్ను శాఖాధికారులు 2023 మార్చి 20న ఏకకాలంలో 50 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు విశాఖలో వర్క్‌ డైరెక్టర్‌ వెంకట సూర్య నాగ వరప్రసాదరాజు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - Sep 02 , 2025 | 06:35 AM