Share News

వసూల్‌ రాజా దూకుడు!

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:15 AM

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విజయవాడ జోన్‌ పరిధిలో అవినీతి వ్యవహారాలు తారాస్థాయికి చేరాయి. సంస్థలో ఎక్కడ అవినీతి జరిగినా పసిగట్టాల్సిన విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగమే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. ఈ విభాగం అధికారి గ్యారేజీల వారీగా సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బలవంతంగా వసూళ్లకు పాల్పడటం జిల్లాలో చర్చ నీయాంశంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగుల సొమ్ముతో మందు, విందు, సరదాలలో మునిగితేలుతున్న సదరు అధికారిని ఆదర్శంగా తీసుకుని డిపో స్థాయి అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

వసూల్‌ రాజా దూకుడు!

- ఆర్టీసీలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ అధికారి నిర్వాకం

- ఏజెంట్లను పెట్టుకుని గ్యారేజీల వారీగా కలెక్షన్లు

- సార్‌ అవినీతిపై స్పందించని మేడమ్‌

- మేము తక్కువ కాదంటూ రెచ్చిపోతున్న డిపో అధికారులు

రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విజయవాడ జోన్‌ పరిధిలో అవినీతి వ్యవహారాలు తారాస్థాయికి చేరాయి. సంస్థలో ఎక్కడ అవినీతి జరిగినా పసిగట్టాల్సిన విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగమే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. ఈ విభాగం అధికారి గ్యారేజీల వారీగా సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బలవంతంగా వసూళ్లకు పాల్పడటం జిల్లాలో చర్చ నీయాంశంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగుల సొమ్ముతో మందు, విందు, సరదాలలో మునిగితేలుతున్న సదరు అధికారిని ఆదర్శంగా తీసుకుని డిపో స్థాయి అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఆర్టీసీ డిపోల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ఉక్కుపాదం మోపాల్సిన విజయవాడ జోన్‌ పరిధిలోని విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ గ్యారేజీల వారీగా సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బలవంతంగా ఫోన్‌పేలు చేయించుకోవడం, ఖరీదైన మందు బాటిల్స్‌ తెప్పించుకోవడం, నాన్‌వెజ్‌ విందు భోజనాలను సిద్ధం చేయించడం, బస్సులలో అనధికారికంగా వస్తువులను బట్వాడా చేయటం వంటివి ఇక్కడ నిత్యకృత్యం అయ్యాయి. ఈ అధికారి అవినీతి వ్యవహారాలపై ఈయన కన్న పైస్థాయిలో ఉన్న మహిళా అధికారికి లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా ఆమె ఎందుకు పట్టించుకోవటంలేదన్నది ఆర్టీసీలో ఒక మిస్టరీగా మారింది. మేడం ఉదాసీనంగా ఉండటం వెనుక అనేక అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. విజిలెన్స్‌ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన ఈడీ(ఏ)కు సరైన పట్టు లేకపోవటంతో కిందిస్థాయి విజిలెన్స్‌ అధికారులు ఏది చెబితే దానికి తలూపుతున్నట్లు సమాచారం. దీంతో వసూళ్ల రాజాపై చర్యలు తీసుకునే పరిస్థితి ఉండటం లేదని తెలిసింది. దాదాపుగా ఉన్నతాధికారులెవరూ విజిలెన్స్‌ అధికారిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవటంతో.. వసూళ్ల రాజా ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్‌ సారే కలెక్షన్‌కు దిగటంతో మేమేమైనా తక్కువా అంటూ ఆర్టీసీ డిపోల్లోని అధికారులు సైతం మరింత రెచ్చిపోతున్నారు. వెరసి.. ఆర్టీసీలో అవినీతి వ్యవస్థ వేళ్లూనుకుపోతోంది.

ఏ పని కావాలన్నా ముడుపులే!

విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో ఈ అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన ఇచ్చిన అప్పీల్స్‌, బదిలీలు, ఓడీలు, లీవులను కనుక పరిశీలిస్తే నూటికి ఎనభై శాతంపైగా ముడుపులు తీసుకుని ఇచ్చినవే ఉన్నట్లు సమాచారం. వీటిలో చాలా వరకు ఖరీదైన మందు బాటిల్స్‌ ముట్టచెప్పినవి కూడా ఉన్నట్టు తెలిసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇచ్చినన్ని ఔట్‌ ఆఫ్‌ డిజిగ్నేషన్స్‌ (ఓడీ)లు రాష్ట్రంలోనే మరెక్కడా లేవు. దీనిని బట్టి చూస్తే ఎంత విచ్చలవిడిగా ఓడీలు ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఓడీలపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావటంతో కొన్నింటిని తొలగించారు. ఇంకా కొన్ని యథావిధిగానే కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్‌ డిపోల్లో కూడా ఈ విధానం అడ్డగోలుగా కొనసాగుతోంది.

దుకాణాల దగ్గర దందా!

ఆసియాలోనే అతిపెద్ద బస్‌స్టేషన్‌ అయిన పీఎన్‌బీఎస్‌లో విచ్చలవిడిగా అవినీతి వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా దుకాణాల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారు. బస్టాండ్‌లో సైకిల్‌ స్టాండ్‌ వాళ్లతో కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులను ఎక్కించటానికి ద్విచక్రవాహనాలను వేసుకుని వచ్చిన వారు ఖాళీ ప్లేసులో వాహనాలు పెడితే వాటి గాలిని తీయించటం, గొలుసులతో తాళాలు వేయించటం చేస్తున్నారు. లేదంటే సున్నం జల్లిస్తున్నారు. దీంతో పాటు అనధికారికంగా వందలాది రూపాయల జరిమానాలు వేస్తున్నారు. ఇలా సంస్థకు ప్రయాణికులను దూరం చేస్తూ చెడ్డపేరు తీసుకు వస్తున్నారు. బస్టాండ్‌లో చిన్న స్టిక్కర్‌ అంటించుకున్నా కమర్షియల్‌ ప్రచారం పేరుతో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బస్‌స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓ హోటల్‌ నిర్వాహకులు ఎక్కడ పడితే అక్కడ బోర్డులను ఏర్పాటు చేసినా పట్టించుకోవటం లేదు. గుంటూరు ప్లాట్‌ఫామ్స్‌ను మార్చిన వ్యవహారంలో కూడా అవినీతి జరిగింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావటంతో.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. విజిలెన్స్‌ అధికారి అవినీతి వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ‘పలువురు డిపో మేనేజర్లు కూడా లంచాలు తీసుకోవడంలో ముందు వరసలో ఉంటున్నట్లు సమాచారం. ఆటోనగర్‌, జగ్గయ్యపేట, మాచర్ల, సత్తెనపల్లి డిపోల పరిధిలో అవినీతి పతాక స్థాయిలో ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విజిలెన్స్‌ అధికారి తీరుపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:15 AM