Tirumala: వరాహస్వామి దర్శన సమయం పెంపు
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:25 AM
తిరుమలలోని వరాహస్వామి ఆలయంలో దర్శన సమయాన్ని శనివారం నుంచి ఒక గంట పెంచారు.
రాత్రి 10 గంటల వరకూ పొడిగింపు
తిరుమల, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వరాహస్వామి ఆలయంలో దర్శన సమయాన్ని శనివారం నుంచి ఒక గంట పెంచారు. క్షేత్ర సంప్రదాయం మేరకు తొలుత వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు అధికమయ్యారు. దీంతో ఈ ఆలయం వద్ద నిత్యం క్యూలైన్లు వెలుపలకు వ్యాపిస్తున్నాయి. దీనిపై ‘వరాహస్వామి దర్శనానికీ పెరుగుతున్న రద్దీ’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 9న కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు దర్శన సమయాలపై దృష్టి సారించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన సమయాన్ని పెంచే అంశంపై కసరత్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉదయం 4.30 నుంచి ప్రారంభమయ్యే దర్శనాలు రాత్రి 9 గంటల వరకు సాగుతుండగా, శనివారం నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. 10 గంటలకు లైన్ మూసివేసి క్యూలో ఉన్నవారందరికీ దర్శనం చేయిస్తున్నారు.