Share News

Locomotive Pilot: వందే... మనీషా

ABN , Publish Date - Sep 13 , 2025 | 05:47 AM

ఆమెది పేద కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీంతో కష్టాలు చుట్టుముట్టాయి. పూటగడిచేందుకే ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితేనేం.. జీవితంలో ఉత్తమస్థాయికి ఎదగాలని, డ్రైవర్‌ కావాలని కలలుకన్నారు.

Locomotive Pilot: వందే... మనీషా

  • వందేభారత్‌ రైళ్లు నడుపుతున్న చిరుత

  • ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మట్టిలో మాణిక్యం

జీవితంలో ఎదగాలన్న పట్టుదల ముందు పేదరికం, ఆకలి, కుంగదీసే అవరోధాలు పటాపంచలయ్యాయి. ఏదోక ఉద్యోగాన్ని అందరూ సంపాదిస్తారు. కానీ, తాను కలలుగన్న డ్రైవర్‌ ఉద్యోగం, అందునా గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకుపోయే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌గా ఎదగడం.. వంటివి ఆమెకే సాధ్యమైంది! అది కూడా అతిపిన్న వయసులోనే!! ఆమే.. గుంటి మనీషా. ఎన్టీఆర్‌ జిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన ఈ యువతి.. నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

ఆమెది పేద కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీంతో కష్టాలు చుట్టుముట్టాయి. పూటగడిచేందుకే ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితేనేం.. జీవితంలో ఉత్తమస్థాయికి ఎదగాలని, డ్రైవర్‌ కావాలని కలలుకన్నారు. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని, అక్క ప్రోత్సాహంతో అభ్యసనం కొనసాగించి తన కలను సాకారం చేసుకున్నారు. ఆమే ఎన్టీఆర్‌ జిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన గంటి మనీషా. ప్రస్తుతం హైస్పీడ్‌, వందేభారత్‌ రైళ్ల లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. మనీషా తండ్రి గుంటి నాగరాజు లారీ డ్రైవర్‌. భార్య ఇద్దరు కుమార్తెలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. దురదృష్టవశాత్తూ మనీష చిన్నతనంలోనే తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో మనీషా తల్లి సరోజిని పిల్లల్ని పెంచటానికి ఎంతో కష్టపడ్డారు. పేదరికం కారణంగా చిన్నతనంలోనే మనీషా ఎన్నో కష్టాలను చవిచూశారు. అయినప్పటికీ డ్రైవర్‌ కావాలన్న ఆకాంక్షను మాత్రం చంపుకోలేదు. బుల్లితెర నటిగా, ఈవెంట్‌ నిర్వాహకురాలిగా ఉన్న మనీషా అక్క కవిత... ఆమెని అక్కున చేర్చుకుని చదువు చెప్పించారు. పదవ తరగతి తర్వాత మనీషా ఐటీఐలో చేరి ఎలక్ర్టీషియన్‌ కోర్సు చేశారు. అక్కడి ఇన్‌స్ట్రక్టర్లు ఆమె అభిలాషను తెలుసుకుని, రైళ్లను నడిపే పైలట్‌గా ఎదిగేలా ప్రోత్సహించారు. ఐటీఐ పూర్తయ్యాక రైల్వే శాఖలో లోకో పైలట్‌ ఉద్యోగానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించటానికి మనీషా ఎంతో కష్టపడ్డారు. తన సోదరి కవిత సాయంతో బెంగళూరులోని ఓ అకాడమీలో పోటీ పరీక్షకు కోచింగ్‌ తీసుకున్నారు.


తొలి ప్రయత్నంలోనే..

సాధారణంగా లోకో పైలట్‌ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. రెండు మూడు ప్రయత్నాలు చేస్తే తప్ప ఉత్తీర్ణులుకావడం కష్టమని అంటారు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే మనీషా రైల్వే లోకోపైలట్‌ ఉద్యోగం దక్కించుకుని, బెంగళూరు డివిజన్‌ పరిధిలో శిక్షణ పొందారు. శిక్షణ సమయంలోనే అత్యుత్తమ ప్రతిభను నిరూపించారు. అనంతరం ఆమెకు బెంగళూరు-జైపూర్‌ గూడ్స్‌ రైలు లోకో పైలట్‌గా విధులు కేటాయించారు. ఈ సమయంలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు. రైళ్లు నడిపేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటా యి?. ఎలా వ్యవహరించాలి?. ఒక పైలట్‌గా ఎంత సమర్థవంతంగా వ్యవహరించాలనే విషయాలపై సంపూర్ణ అవగాహన పెంచుకున్నారు. అనతికాలంలోనే ఆమెకు తిరుచినాపల్లి-విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పైలట్‌గా అవకాశం లభించింది. ఈ రైళ్లను విజయవంతంగా నడపటంతో వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను నడిపే అవకాశం దక్కింది. బెంగళూరు-జైపూర్‌ మధ్య గంటకు 180కిలో మీటర్ల వేగంతో నడిచే వందేభారత్‌ లోకో పైలట్‌గా అధికారులు ఈ నెలలోనే అవకాశం కల్పించారు. ఒక మహిళగా దేశంలోనే అత్యంత వేగవంతమైన వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను అవలీలగా నడిపి, రైల్వే అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఎంతో మంది యువతులకు స్ఫూర్తిగా నిలిచారు.


ఎన్నో కష్టాలు పడ్డాను..

పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డాను. అక్క నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. డ్రైవర్‌ కావాలన్న ఆకాంక్ష చిన్నప్పుడే ఏర్పడింది. ఐటీఐ చదువుకునే రోజుల్లో మా ఇన్‌స్ట్రక్టర్స్‌ ప్రోత్సహించారు. లోకో పైలట్‌ కావాలన్న కసితో నేను పడిన కష్టం అంతా, ఇంతా కాదు. అనుకున్నట్టుగానే ఉత్తీర్ణత సాధించి లోకో పైలట్‌గా ఎంపికయ్యాను. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అంటే రైళ్లలోనే నెంబర్‌ వన్‌. ఆ రైలును ఇంత త్వరగా నడుపుతానని అనుకోలేదు. తొలిసారిగా వందేభారత్‌ నడుపుతున్నపుడు ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను. నేను సాధించిన విజయం నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావాలి.

- మనీషా, లోకో పైలట్‌

Updated Date - Sep 13 , 2025 | 05:49 AM