Share News

Chaganti Koteswara Rao: విలువలకు తొలి బడి కుటుంబం

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:58 AM

కుటుంబం నుంచే విలువలను నేర్చుకునే క్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు.

Chaganti Koteswara Rao: విలువలకు తొలి బడి కుటుంబం

  • కుటుంబసభ్యులు, గురువులను గౌరవించాలి

  • అమ్మకు చెప్పలేని పని ఎన్నడూ చేయొద్దు

  • ఏ అంశంలోనైనా స్వీయ నియంత్రణ అవసరం

  • గొప్పవారి జీవిత చరిత్రలను విద్యార్థులు చదవాలి

  • ‘విలువల సదస్సు’లో చాగంటి కోటేశ్వరరావు వెల్లడి

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కుటుంబం నుంచే విలువలను నేర్చుకునే క్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తోబుట్టువులు, గురువులతో గౌరవంగా మెలగడం అలవర్చుకోవాలన్నారు. కుటుంబాన్ని గౌరవించినవారే సమాజాన్ని కూడా గౌరవించగలరని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘కుటుంబం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఎంతటి వ్యక్తి అయినా తల్లిని గౌరవించాలి. పాఠశాలకు వెళ్లే సమయంలో తల్లికి నమస్కరించాలి. తల్లికి చెప్పలేని పనులు ఎవరూ చేయకూడదు. మనం చేసే ప్రతి పనీ అమ్మకు చెప్పుకొనేలా ఉండాలి. ప్రధాని మోదీ అంతటి వ్యక్తి తల్లి గురించి గొప్పగా చెప్పారు. ‘పేదరికం అంటే తెలియకుండా మా అమ్మ పెంచింది’ అని చెప్పారు. అలాగే సీఎం చంద్రబాబు తన తల్లి అమ్మణమ్మ గురించి ఓ వ్యాసంలో గొప్పగా రాశారు. ‘మా అమ్మ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కష్టపడటం నేర్చుకున్నా’’నని ఆయన రాశారు. జీవితంలో తల్లి తర్వాత తండ్రి అంతటి గొప్ప వ్యక్తి. తల్లిదండ్రులకు గౌరవం ఇస్తే నైతికత, విలువలు పెరుగుతాయి. ఆ తర్వాత తోబుట్టువులతో ప్రేమగా మెలగాలి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మీకు స్నేహితులు దొరుకుతారు. కానీ తోబుట్టువులు దొరకరు. అలాగే మన కంటే తక్కువగా ఉన్నవారిని చిన్నచూపు చూడడం, పరిహసించడం మంచి విధానం కాదు. ఏదైనా తొలుత ఇంటి నుంచి నేర్చుకుంటే అదే సమాజంలోనూ అమలుచేస్తాం. నైతిక విలువలు లేని విద్య వల్ల ఉపయోగం ఉండదు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ప్రేమించేవారు గురువులే. గురువులను అపహాస్యం చేయడం, విమర్శించడం తగదు. గొప్పవారి జీవిత చరిత్రలను చదవడం విద్యార్థులు నేర్చుకోవాలి.’’ అని చాగంటి తెలిపారు.


అదనంగా క్రీడలు, కళల అభ్యాసం

విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానాలిచ్చారు. ఆత్మవిశ్వాసం, ప్రణాళికాబద్ధమైన జీవితం ద్వారా ఒత్తిడి దూరమవుతుందని, పరీక్షలను సులభంగా రాయగలమే నమ్మకం విద్యార్థులకు ఉండాలని తెలిపారు. చదువుతో పాటు ప్రతి పనికీ ఒక ప్రణాళిక ఉండాలని, సమయపాలన పాటిస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలమని, అందుకోసం పరిశుభ్రంగా ఉండటం, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ పనులు తాము చేసుకోవడం అలవర్చుకోవాలని, కీర్తనలు ఆలపించడం, క్రీడలు, చిత్రలేఖనం, సంగీతం లాంటివాటిని చదువుకు అదనంగా నేర్చుకోవాలని కోరారు. ‘‘మనం ఇతరుల నుంచి ఎలాంటివి వద్దు అనుకుంటామో, అవి మనం ఇతరులకు చేయకూడదు. రామాయణం, మహాభారతం, భాగవతం చదవడం వల్ల విలువలు పెరుగుతాయి. ఆ గ్రంథాల్లోని విలువలను నేర్చుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం. విద్యార్థులకు స్వీయ నియంత్రణ అవసరం. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడితే అది ఉపయోగపడుతుంది. అతిగా వాడితే నష్టాలు వస్తాయి. అవసరంలేని విషయాల జోలికి వెళ్లకూడదు.’’ అని చాగంటి కోటేశ్వరరావు సూచించారు.

Updated Date - Nov 25 , 2025 | 04:59 AM