Vice President C. P. Radhakrishnan: మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యం
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:23 AM
ఎంత మందిని పట్టభద్రులుగా తీర్చిదిద్దామన్నది ముఖ్యం కాదని, ఎంత మందిని మంచి పౌరులుగా తీర్చిదిద్దామన్న కోణంలో సత్యసాయి వర్సిటీ విద్యావిధానం...
శ్రీసత్యసాయి యూనివర్సిటీ విద్యావిధానం ఆదర్శనీయం
సత్యసాయి బోధనలను విశ్వవ్యాప్తం చేయాలి
ఉపరాష్ట్రపతి పిలుపు.. ఘనంగా వర్సిటీ స్నాతకోత్సవం
పుట్టపర్తి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎంత మందిని పట్టభద్రులుగా తీర్చిదిద్దామన్నది ముఖ్యం కాదని, ఎంత మందిని మంచి పౌరులుగా తీర్చిదిద్దామన్న కోణంలో సత్యసాయి వర్సిటీ విద్యావిధానం సాగడం అభినందనీయమని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీసత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్సిటీ చాన్స్‌లర్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. అంతకుముందు వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సత్యసాయి బోధించిన ప్రేమ, సేవ, మానవతా విలువలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏ యూనివర్సిటీలో కనిపించనంతటి క్రమశిక్షణ, నిబద్ధత శ్రీసత్యసాయి వర్సిటిలో కనిపిస్తోందని, విద్యార్థులు క్రమశిక్షణను పాటిస్తూ నేలపై కూర్చోవడం గతంలో తాను ఎక్కడా చూడలేదన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ నివారణ అతి పెద్ద సవాలుగా మారిందని, డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని విద్యార్థులకు సూచించారు.
ఆ ఘనత ప్రధాని మోదీదే..!
‘ఒకప్పుడు ప్రపంచం ఏం చెబుతుందోనని భారత్ ఎదురుచూసేది. ఇప్పుడు ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలిచింది. ఎన్నో సమస్యలను అధిగమించింది. దీనికి మూలకారకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ’ అని ఉప రాష్ట్రపతి అన్నారు. కరోనా సమయంలో దేశంలోని 140 కోట్ల మందితో పాటు ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేల డాలర్లకు అమ్ముకోగా, మనం మాత్ర ం ఉచితంగా పంపిణీ చేశామని, దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయన్నారు. ఆవిష్కరణలకు కేంద్రంగా, సుస్థిరాభివృద్ధికి ప్రతిరూపంగా నేడు భారత్ నిలుస్తోందన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే పరిశోధనలకు ఎక్కువ నిధులు వినియోగించాలన్నారు. అంతకుముందు వైస్ చాన్సలర్ రాఘవేంద్ర ప్రసాద్ అతిథులకు స్వాగతం పలుకుతూ ప్రసంగించారు. యూనివర్సిటీకి వందకు పైగా అవార్డులు వచ్చాయని, దేశ విదేశాల్లో మూడు వేల మంది విద్యార్థులు ఎడ్యుకేర్, మెడికేర్ సేవలు అందిస్తున్నారని తెలిపారు.
విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానం
యూనివర్సిటిలో బీఏ, ఎంబీఏ, ఎంఏ, ఎమ్మెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన 20 మంది విద్యార్థులను ఉపరాష్ట్రపతి అభినందించారు. వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. అనంతరం వర్చువల్‌గా ‘బయోబ్యాంక్ రిసెర్చ్ హబ్’ని ప్రారంభించారు. కార్డియాలజీ, ఆప్తమాలజీ వంటి ఆధునిక వైద్య సేవలకు ఇదెంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పట్టభద్రులైన విద్యార్థుల చేత వీసీ ప్రతిజ్ఞ చేయించారు. విద్యను సమాజ హితం కోసం వినియోగిస్తామని, సత్యసాయి బోధించిన విలువలను ఆచరిస్తూ ఇతరులకు అందిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.