TTD Arrangements: ఇల వైకుంఠమే..
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:26 AM
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం తిరుమల నిజ వైకుంఠాన్ని తలపించింది. సోమవారం రాత్రి 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను నిర్వహించారు.
తిరుమలలో వైభవంగా ముక్కోటి.. నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించిన మలయప్ప
అర్ధరాత్రి సమయానికి 67 వేల మందికి దర్శనం
స్లాట్ల వారీగా సామాన్య భక్తులకు అనుమతి
ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ.. సాఫీగా సాగిన క్యూలు
తిరుమల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియుగ వైకుంఠం తిరుమల నిజ వైకుంఠాన్ని తలపించింది. సోమవారం రాత్రి 12.05 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు ధనుర్మాస కైంకర్యాలను నిర్వహించారు. మంగళవారం వేకువజాము 1.20 గంటల నుంచి వీఐపీలతో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభించారు. ఉదయం 7.15 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కొనసాగాయి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో టోకెన్లు పొందిన భక్తులకు దర్శనాలను ప్రారంభించారు. వేకువజాము నుంచే స్లాట్ల వారీగా భక్తులను క్యూలోకి అనుమతించి అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనాలను చేయించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వీఐపీల హడావుడి, ఆ తర్వాత పరిమిత సంఖ్యలో స్లాటెడ్ సర్వదర్శన భక్తులతో మోస్తరు రద్దీయే నెలకొంది. ఇక ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉదయం స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంలో కొలువుదీరి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు వీఐపీ బ్రేక్ దర్శనాలను వేకువజాము 5.30 గంటలకే ముగిస్తామని టీటీడీ ప్రకటించినప్పటికీ అదనంగా రెండు గంటల పాటు వీఐపీలకే దర్శనం కల్పించడం విమర్శలకు దారితీస్తోంది. ఇక బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజాము పుష్కరిణిలో చక్రస్నానం జరుగనుంది.
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం పలువురు న్యాయమూర్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వి.సుజాత, జస్టిస్ మల్లికార్జున రావు, జస్టిస్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యపల్లి నంద, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ రామకృష్ణారెడ్డి, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత, జస్టిస్ అశోక్ వేకువజాము ఆలయంలోకి వెళ్లి శ్రీవారి దర్శనంతో పాటు ఉత్తరద్వార ప్రవేశం చేశారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణరాజు, మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు, క్రికెటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, చాముండేశ్వరీనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
ప్రశాంత వాతావరణంలో దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. గత వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీటీడీ ఈసారి ప్రత్యేక జాగ్రత్తలతో ముందస్తుగా టోకెన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రణాళికాబద్ధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగిసిన వెంటనే స్లాటెడ్ సర్వదర్శనాలను మొదలుపెట్టారు. అందరికి ఒకే ప్రవేశమార్గం కాకుండా కృష్ణతేజ, శిలాతోరణం, ఏటీజీహెచ్ ప్రాంతాల్లో మూడు ప్రవేశ మార్గాలు ఏర్పాటుచేసి అనుమతించడంతో క్యూలైన్లలో నెమ్మదిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా భక్తులు ముందుకు సాగారు. భక్తులు కూడా కేటాయించిన స్లాట్ల సమయంలోనే రావడంతో క్యూలైన్ ప్రవేశాలు కూడా చాలా పలుచగా కనిపించాయి. ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూలైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించిన అధికారులు సత్వరం స్పందిచడంతో.. క్యూలు ఎక్కడా బ్లాక్ కాకుండా సాఫీగా కదిలాయి. వైకుంఠ ఏకాదశి టోకెన్లు పొందిన వారంతా ‘ద్వాదశి’ ఘడియలు రాకముందే శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ తీసుకున్న చర్యలు ఫలించాయి. మరోవైపు సోమవారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు రద్దీ మోస్తరుగానే ఉన్నప్పటికీ మంగళవారం నాటి స్లాటెడ్ భక్తులతో పాటు బుధవారం దర్శనం కలిగిన భక్తులు కూడా జత కావడంతో కొండ కళకళలాడుతోంది. ఏటా ముక్కోటికి కనిపించే గోవిందమాల భక్తులు సారి మాత్రం టోకెన్ల చాలా తక్కువగా తిరుమలకు చేరుకున్నారు. టోకెన్ల నిబంధనలతో చాలా మంది భక్తులు తిరుమల యాత్ర వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. తొలి మూడురోజులు టోకెన్లు ఉన్న వారికే దర్శనమని ప్రకటించిన టీటీడీ జనవరి 2 నుంచి టోకెన్లు, టికెట్లు లేకపోయినా దర్శనానికి రావచ్చని ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశముందని భావిస్తోంది. ఇక, మంగళవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి 12 గంటల సమయానికి 67 వేల మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.
కిటకిటలాడిన వైష్ణవాలయాలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉత్తర భారతదేశంలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఢిల్లీ, జమ్మూ, రిషికేశ్, కురుక్షేత్ర ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో ఎన్నడూలేని విధంగా 40 వేల మందికి పైగా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. హరియాణలోని కురుక్షేత్ర టీటీడీ ఆలయంలో సుమారు 16 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మూ, రిషికేశ్ ఆలయాలకు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు లక్ష పుష్పాలతో స్వామివారికి చేసిన పుష్పార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక మన రాష్ట్రంలోని రామతీర్థం, సింహాచలం, ద్వారకాతిరుమల, మంగళగిరి సహా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.