Share News

Tirumala: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:36 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు మొదలుకానున్నాయి.

Tirumala: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు

  • 1.30కి వీఐపీ, 5.30 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభం

  • సుందరంగా ముస్తాబైన తిరుమల

తిరుమల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు మొదలుకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు పది రోజుల పాటు 7.70 లక్షల మందికి దర్శనం చేయించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. వైకుంఠద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేస్తారు. 1.30కు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రారంభిస్తారు. ఉదయం 5.30కు ఆన్‌లైన్‌లో టోకెన్‌ పొందిన భక్తులను అనుమతిస్తారు తొలి మూడురోజులు డిప్‌ ద్వారా టోకెన్ల పొందినవారికే దర్శనం ఉంటుంది. మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం(టోకెన్‌ రహిత), రూ.300 దర్శనం, శ్రీవాణి, ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనాలు జరగనున్నాయి. కాగా, మంగళవారం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేసేందుకు ఇప్పటికే పెద్దసంఖ్యలో వీఐపీలు లేఖలు పంపారు. ఈ క్రమంలో నారాయణగిరి-4లో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏపీ విప్‌, కార్పొరేషన్‌ చైర్మన్లకు, వెంకటకళ విశ్రాంతి భవనంలోని కౌంటర్‌లో గవర్నర్‌, సీఎం, న్యాయమూర్తులు, మంత్రులు, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, అధికారులకు దర్శన టికెట్లు, గదులను సోమవారం ఉదయం నుంచి కేటాయించనున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 03:36 AM