Share News

TTD EO Anil Kumar Singhal: జనవరి 2 నుంచి 8 వరకు తిరుమలకు వచ్చే అందరికీ వైకుంఠ ద్వార దర్శనం

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:30 AM

వైకుంఠద్వార దర్శనాలన్నీ ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారని కొందరు భక్తులు అపోహపడుతున్నారు. ఇది నిజం కాదు.

TTD EO Anil Kumar Singhal: జనవరి 2 నుంచి 8 వరకు తిరుమలకు వచ్చే అందరికీ వైకుంఠ ద్వార దర్శనం

  • అంతా ఆన్‌లైన్‌ కేటాయింపులన్నది నిజం కాదు

  • స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘వైకుంఠద్వార దర్శనాలన్నీ ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నారని కొందరు భక్తులు అపోహపడుతున్నారు. ఇది నిజం కాదు. తొలి మూడు రోజులకు మాత్రమే ఈ-డిప్‌లో దర్శనాలు కేటాయించాం. మిగిలిన ఏడు రోజులూ తిరుమలకు నేరుగా వచ్చే భక్తులందరికీ క్యూలైన్‌ ద్వారానే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తాం’ అని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా భక్తులకు ఆయన ఈ వివరణ ఇచ్చారు. వైకుంఠ ద్వారాలు తెరచి ఉంచే పది రోజుల్లో స్వామివారి కైంకర్యాలకుపోను 182 గంటల దర్శన సమయం ఉండగా, ఇందులో సామాన్య భక్తులకే 164.15 గంటలు కేటాయించామని చెప్పారు. ఈ పదిరోజుల్లో 7.70 లక్షల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేకపోయినా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా వైకుంఠద్వార దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. ఈ పదిరోజులూ తిరుపతిలో స్లాటెడ్‌ సర్వదర్శనం(ఎ్‌సఎ్‌సడీ) టోకెన్ల జారీ ఉండదని.. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్‌కు సిఫారసులను రద్దు చేశామన్నారు. ఇక, డయల్‌యువర్‌ ఈవో కార్యక్రమంలో దాదాపు 23 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఫోన్‌ చేసి ఈవోతో మాట్లాడారు. ఇందులో అధికంగా, తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఆన్‌లైన్‌లో కాక నేరుగానే దర్శనం చేయించాలనే విజ్ఞప్తులు వచ్చాయి.


అసంతృప్త భక్తులకు సందేశాలు

ఇలా ఉండగా తొలి మూడు రోజుల వైకుంఠ దర్శనాలకు 25.72 లక్షల మంది రిజిస్ర్టేషన్‌ చేసుకోగా, 1.76 లక్షల మందికే టీటీడీ టోకెన్లు జారీ చేసింది. మిగిలిన భక్తులకు ఏ సమాచారం రాకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. దీంతో జనవరి 2 నుంచి 8 వరకూ నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠద్వార దర్శనం చేసుకోవచ్చని సందేశాలు పంపాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. ఈ విధంగా 9.55 లక్షల యూజర్స్‌కి ఈమెయిల్‌, మొబైల్‌ నంబర్లకు మెజెస్‌లు పంపనున్నారు.


రూ.300 టికెట్లు కోటా 21 నిమిషాల్లోనే పూర్తి

1.10 గంటల్లో ముగిసిన శ్రీవాణి టికెట్ల బుకింగ్‌

జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు పోటీపడ్డారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేసింది. రోజుకు 15 వేల చొప్పున ఏడు రోజులకు 1,05,000 టికెట్లను విడుదల చేయగా కేవలం 21 నిమిషాల్లోనే బుక్‌ అయిపోయాయి. ఇక, రోజుకు 1,500 చొప్పున ఉదయం 10 గంటలకు విడుదల చేసిన శ్రీవాణి టికెట్లు గంటా పది నిమిషాల్లోనే పూర్తయ్యాయి.

అందుబాటులోకి శ్రీవారి బంగారు డాలర్లు

కొంత కాలంగా కొరత ఉన్న శ్రీవారు, అమ్మవార్ల బంగారు డాలర్లను టీటీడీ భక్తులకు తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. వారం రోజులకు పైగా విక్రయకేంద్రం వద్ద నోస్టాక్‌ బోర్డు పెట్టారు. భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఆగమేఘాలపై బంగారు డాలర్లను కౌంటర్‌లో అందుబాటులో ఉంచి విక్రయాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం శ్రీవారు, అమ్మవారి బొమ్మలున్న బంగారు డాలర్లను 2, 5, 10 గ్రాముల్లో విక్రయిస్తున్నారు. గతంలో వీటిని చిన్నపాటి డబ్బా లేదా పేపర్‌లో ఇచ్చేవారు. తాజాగా ఏటీఎం కార్డు సైజులో ఉన్న ఓ కార్డులో టీటీడీ లోగో, స్వామి, ఆనంద నిలయం చిత్రాలతో పాటు ‘వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ అని ప్రింట్‌ చేసి విక్రయిస్తున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 04:34 AM