TTD EO Anil Kumar: 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:17 AM
తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబరు 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజులపాటు ఉంటాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
వారంలో టోకెన్ల జారీ విధివిధానాలు ఖరారు
17 నుంచి తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
27 నుంచి అమరావతి శ్రీవారి ఆలయ విస్తరణ పనులు
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబరు 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజులపాటు ఉంటాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నందున లోటుపాట్లు లేకుండా జారీ చేయడానికి విధివిధానాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని వేశామని తెలిపారు. వారం రోజుల్లో ఈ కమిటీ బోర్డుకు నివేదిక సమర్పిస్తుందని.. దానికనుగుణంగా బోర్డు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. కాగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఆళ్వార్‌ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యాం వరకు శాశ్వత క్యూలైన్ నిర్మాణం కోసం రూ.25 కోట్లు కేటాయించామని వెల్లడించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో 17 మంది భక్తులు ఫిర్యాదులు, సందేహాలు, సమస్యలపై ఈవోతో మాట్లాడారు.
శ్రీవాణి నిధులతో నిర్మించేది ఆలయాలే
శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.750 కోట్ల నిధులతో ఐదు వేల ఆలయాలు మాత్రమే నిర్మిస్తామని ఈవో స్పష్టం చేశారు. ఇవి భజన మందిరాలనే అనుమానానికి తావులేదన్నారు. శ్రీవాణికి వచ్చిన రూ.2,300 కోట్లలో ఇప్పటికే రూ.600 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.1,700 కోట్లు నిధులు ఉన్నాయని వివరించారు. కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, పరిశీలన చేసి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. అమరావతి వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయంలో ప్రాకారం, కల్యాణోత్సవ మండపం అభివృద్ధి పనులు ఈ నెల 27వ తేదీ నుంచి మొదలవుతాయని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.