Vaikunta Dwarams Opened: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:18 AM
వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి...
నేటి నుంచి పది రోజులు కొనసాగనున్న దర్శనాలు
తిరుమల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి(ముక్కోటి) సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. సోమవారం రాత్రి 11.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహించి తలుపులు మూసివేశారు. తిరిగి అర్ధరాత్రి 12.05 గంటల సమయంలో తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారువాకిలి తలుపులు తెరిచారు. అనంతరం 12.30 గంటల సమయంలో వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేశారు. తర్వాత ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 1.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. ఉదయం 5.30-6 గంటల మధ్య స్లాటెడ్ సర్వ దర్శనాలు మొదలుకానున్నాయి. ఇక, మంగళవారం ఉదయం ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై దర్శనమివ్వనున్నారు. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్, పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి.
మోస్తరుగానే రద్దీ
సాధారణంగా వైకుంఠ ఏకాదశి ముందు రోజు మధ్యాహ్నం నుంచే తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. అయితే ఈసారి తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. గతేడాది చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టోకెన్లు ఆన్‌లైన్‌లో జారీ చేయడం, టోకెన్లు ఉన్నవారికే తొలి మూడురోజుల దర్శనం ఉంటుందని విస్తృత ప్రచారం కల్పించిన నేపథ్యంలో తిరుమల కొండ సోమవారం సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించింది. సాయంత్రం తర్వాత మంగళవారం ఏకాదశి టోకెన్లు పొందిన భక్తులు చేరుకోవడంతో మోస్తరు రద్దీ నెలకొంది. ఇక, సోమవారం మధ్యాహ్నానికే క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీ కావడంతో గంటలోనే భక్తులకు దర్శనం పూర్తయింది.