Kurnool Bus Accident: వి.కావేరి ట్రావెల్స్ యజమాని పరారీ..
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:09 AM
కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన వి.కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను మంగళవారం అరెస్టుచేసి...
గాలిస్తున్న పోలీసులు.. ఇప్పటికే డ్రైవర్ అరెస్టు
పోలీసులకు అందిన ఎఫ్‌ఎస్ఎల్ రిపోర్టు
రవాణా, అగ్నిమాపక శాఖలకు పోలీసుల లేఖలు
కర్నూలు బస్సు దుర్ఘటన కేసులో ముమ్మరంగా దర్యాప్తు
కర్నూలు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన వి.కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను మంగళవారం అరెస్టుచేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. బస్సు యజమాని వి.వినోదకుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. బస్సు ప్రమాదం జరిగిన తీరుపై సాంకేతికంగా రోడ్డు రవాణా శాఖ, అగ్నిమాపక అధికారులు ఇచ్చే నివేదికలు ఎంతో కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఆ శాఖల ఉన్నతాధికారులకు పోలీస్ అధికారులు లేఖ రాశారు. వారి నుంచి రిపోర్టులు రాగానే చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే విజయవాడకు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎ్‌సఎల్) నివేదిక దర్యాప్తు అధికారులకు అందింది. పరారీలో ఉన్న బస్సు యజమానిని త్వరలోనే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా చిన్న టేకూరులో ఈనెల 24 అర్ధరాత్రి దాటాక జరిగిన వి.కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రమాణికులు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘోర ఘటనపై కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదైంది. ఈ కేసును పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడు, ఉల్లిందకొండ ఎస్‌ఐ ధనుంజయ దర్యాప్తు చేస్తున్నారు.