CM Chandrababu: పూర్వోదయ నిధులతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:27 AM
కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో భాగంగా.. బిహార్, జార్ఘండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన...
రూ.4,100 కోట్లతో అంచనాలు సిద్ధం
వివిధ డెల్టా కాలువల అభివృద్ధి కూడా
వీటికి 9,100 కోట్లతో సమగ్ర ప్రణాళికలు
కేంద్ర నిధుల సద్వినియోగానికి జల వనరుల శాఖ నిర్ణయం
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో భాగంగా.. బిహార్, జార్ఘండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దరిమిలా ఆయా జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టులతో పాటు గోదావరి, కృష్ణా.. బుడమేరు, ఉప్పుటేరు, సోమశిల కాలువల అభివృద్ధి పనులకు కూడా పూర్వోదయ కింద చేపట్టాలని జల వనరుల శాఖ వరుసగా రూ.4,200 కోట్లు, 9,100 కోట్లతో అంచనాలు రూపొందించింది. మొత్తంగా 13,300 కోట్లతో వీటిని చేపట్టి కొత్తగా 3,97,339 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని.. 25,96,690 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిశ్చయించింది.