Share News

CM Chandrababu Naidu: కేంద్ర నిధులన్నీ ఖర్చు చేయాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:21 AM

కేంద్ర ప్రభుత్వ నిధులను కొన్ని శాఖలు కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu: కేంద్ర నిధులన్నీ ఖర్చు చేయాలి

  • జనవరి 15వ తేదీ నాటికి మిగిలిపోయిన వాటిని వినియోగించాలి

  • నిధుల్లేక ఇబ్బందులు పడుతుంటే అలసత్వమేల?: సీఎం

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిధులను కొన్ని శాఖలు కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15వ తేదీ నాటికి ఖర్చు చేయాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం సమీక్షించారు. సమగ్ర శిక్ష పథకం కింద రూ.1,363 కోట్లకు గాను రూ.1,259 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి రూ.1,200 కోట్లు అడిగామని సీఎంకు వివరించారు. పీఎంఏవై-అర్బన్‌ నిధులు ఖర్చు పెట్టే అంశాన్ని పర్యవేక్షించాలని మంత్రి కొలుసు పార్థసారఽథిని సీఎం ఆదేశించారు. గతంలో విజిలెన్స్‌ విచారణ కారణంగా పనులు నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తద్వారా పీఎంఏవై-అర్బన్‌ ఇళ్లకు మరింతగా ఖర్చు పెట్టే అవకాశముందన్నారు. వివిధ సీఎ్‌సఎస్‌ పథకాల ద్వారా రూ.24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా రూ.6,252 కోట్ల నిధులు ఖర్చు పెట్టలేదని అన్నారు. ప్రభుత్వ శాఖలు కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకోవడంలో ఎందుకు వెనకబడుతున్నాయని ప్రశ్నించారు. ఏడాది చివరిలో కేంద్రంలోని వివిధ శాఖల వద్ద నిధులు ఉండిపోతున్నాయని.. వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.


పీఎంఏవై-అర్బన్‌లో కేవలం 38 శాతం ఖర్చు చేయడమేంటన్నారు. జనవరి నాటికి పీఎంఏవై-అర్బన్‌లో 75 శాతం నిధులు ఖర్చు చేస్తే అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఈ నిధులను త్వరితగతిన ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులు, రాష్ట్ర కృషీ వికాస్‌ యోజన కింద కూడా త్వరితగతిన నిధులు వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మిగతా నిధులను కూడా కేంద్రం నుంచి సాధించే అవకాశం ఉంటుందన్నారు. నిధుల్లేక ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర పథకాల నిధులను ఖర్చు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం కేటాయించిన రూ.24,513 కోట్ల నిధులను ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఖర్చు చేస్తే మరో రూ.5-6 వేల కోట్లు అదనంగా తెచ్చుకుందామన్నారు.


కేంద్రంతో సంప్రదించాలి

ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రులతో టచ్‌లోకి వెళ్లాలన్నారు. బడ్జెట్‌ తయారీ సమయంలోనే కలిస్తే ఏపీకి అదనంగా నిధులు సాధించుకునే అవకాశముంటుందన్నారు. 63 వేల ప్రభుత్వ ఖాతాలు ఇన్‌ యాక్టివ్‌గా ఉన్నాయని, వాటిలో రూ.155 కోట్ల మేర నిధులు బ్యాంకుల్లో ఉండిపోయాయని చెప్పారు. ఆ నిధులను విత్‌డ్రా చేయించాలని, బ్యాంకుల్లో ఉండిపోయిన నిధులకు వడ్డీ వచ్చేలా చూడాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఆడిట్లు త్వరలోనే పూర్తి కావాలన్నారు. నిర్మాణ సంస్థలను, ఏజెన్సీలను ప్రతి పది రోజులకు ఒకసారి పిలిచి సివిల్‌ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వారాల తరబడి స్పందించకపోతే వాళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచించారు.


రోజూ పిటిషన్లు తీసుకోండి: అనగాని

ప్రభుత్వం అంటే కలెక్టర్లేనని ప్రజలు భావిస్తున్నారని, వారి నమ్మకం నిలబెట్టేలా జాగ్రత్తగా పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కలెక్టర్లకు సూచించారు. వారంలో ఒక రోజు కాకుండా, ప్రతీరోజు ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవాలన్నారు. జిల్లాల పాలన పారదర్శకంగా, అంతిమంగా ప్రజా సంతృప్తి స్థాయిని పెంచే దిశగా ఉండాలని కోరారు. పరిశ్రమలకు ఇస్తున్న భూములకు, ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు సంబంధించి.. వివాదాలు లేకుండా చూడాలని అనగాని సూచించారు. రెవెన్యూ సంస్కరణలు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లను కోరారు.


  • రెవెన్యూపై స్పందనలో కోనసీమ, కాకినాడ బెస్ట్‌

  • అధమస్థానంలో అనంత, పశ్చిమగోదావరి.. అర్జీల పరిష్కారంలో సగటు సంతృప్తి 53.39 శాతం

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల పరిష్కారం, తిరస్కారంలో కొన్ని జిల్లాలు ముందుంటే, మరికొన్ని అధమస్థానంలో నిలిచాయి. ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబరు వరకు ప్రజల నుంచి 32,866 దరఖాస్తులు సీసీఎల్‌ఏకు వచ్చాయి. పరిష్కారం కోసం వీటిని ఆయా జిల్లాలకు పంపించారు. దరఖాస్తుల పరిష్కారంలో 74.24 శాతంతో కోనసీమ అగ్రస్థానంలో నిలిచింది. 73.40 శాతంతో కాకినాడ జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. ఇక, అతి తక్కువ స్థాయిలో 69.86 శాతంతో అనంతపురం చివరి స్థానంలో ఉంటే, అత్యంత తక్కువస్థాయిలో 63.7 శాతంతో పశ్చిమగోదావరి నిలిచింది. దీనిని బట్టి, అర్జీల పరిష్కారంలో సగటున 53.39 శాతమే సంతృప్తి వ్యక్తమైంది. గత 15 నెలల కాలంలో మ్యుటేషన్‌ల కోసం 15,23,656 విన్నపాలు వస్తే, వీటిలో 3,45,612(23.65 శాతం) తిరస్కరించారు. ఇలా తిరస్కరించిన వాటిలో తొలిస్థానంలో విజయనగరం, తర్వాత నెల్లూరు, విశాఖ జిల్లాలు ఉన్నాయి. ‘మీ భూమి’ రికార్డుల్లో భూమి స్వభావం మార్చాలని 1.01 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పార్వతీపురంమన్యం, కర్నూలు, శ్రీకాకుళం నుంచి ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల భూ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. జేసీలకు ఉన్న కొన్ని అధికారాలను ఆర్‌డీవో, తహసీల్దార్‌లకు బదిలీ చేయాలని, సర్వే అనంతరం వచ్చే విస్తీర్ణంలో తేడాలను రైతులకు అనుకూలంగా సెటిల్‌ చేయాలని నిర్ణయించింది.

Updated Date - Dec 18 , 2025 | 05:24 AM