Share News

CM Chandrababu: సమృద్ధిగా యూరియా

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:13 AM

రాష్ట్రంలో యూరియా లభ్యత సమృద్ధిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. దానిని సమర్ధంగా, సక్రమంగా రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు.

CM Chandrababu: సమృద్ధిగా యూరియా

  • కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలి: సీఎం

  • అధికారులు, కలెక్టర్లతో సుదీర్ఘ సమీక్ష

  • అక్కడికక్కడే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్‌

  • అదనపు యూరియా కేటాయింపులకు వినతి

  • కాకినాడ చేరుకున్న నౌకలోని 7 ర్యాకుల ఎరువులు ఇవ్వడానికి నడ్డా అంగీకారం

  • దీంతో 50 వేల టన్నులు అదనంగా రాక

  • బ్లాక్‌మార్కెట్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు

  • కర్నూలు ఉల్లి క్వింటా 1,200 కన్నా తగ్గితే ఆ మేరకు ప్రభుత్వం చెల్లింపు: చంద్రబాబు

  • ఆర్టీజీఎస్‌ నుంచి, టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష

కొందరు రాజకీయ ముసుగులో క్రిమినల్స్‌ తరహాలో ఆలోచిస్తూ.. ఎరువుల లభ్యత ఉండదన్న అభద్రతాభావం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు జరుగుతున్న యత్నాలకు అడ్డుకట్ట వేయాలి.ఎరువులు దొరకవనే ఆందోళనతో రైతులు, కౌలు రైతులు ఒకేసారి వాటిని కొనుగోలు చేయకుండా.. నిల్వ చేసి పెట్టుకోకుండా చూడాలి. అనవసరపు కొనుగోళ్లపైనా దృష్టి పెట్టాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా లభ్యత సమృద్ధిగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. దానిని సమర్ధంగా, సక్రమంగా రైతులకు అందేలా చూడాలని ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు, తురకపాలెంలో ఆరోగ్య పరిస్థితిపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 టన్నుల యూరియా అందుబాటులో ఉందని.. మరో 10 రోజుల్లో 23,592 టన్నులు రాష్ట్రానికి వస్తుందని అధికారులు ఆయనకు వివరించారు. వెంటనే సీఎం అక్కడికక్కడే కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడారు. కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని యూరియాలో 7 రేక్‌లను తమకు కేటాయించాలని కోరగా.. నడ్డా సానుకూలంగా స్పందించారు. దీంతో రాష్ట్రానికి అదనంగా 50 వేల టన్నులు కేటాయించినట్లయిందని అధికారులు చెప్పారు. యూరియా పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి, ఎరువులపై రైతులకు భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ‘నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొందరు కావాలని రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలి. ఇదే సమయంలో... అధిక మోతాదులో ఎరువుల వాడకంతో కలిగే నష్టాన్ని రైతులకు వివరించాలి. ఎరువుల వినియోగాన్ని తగ్గించిన రైతులకు ప్రోత్సాహకంగా సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేసే విధానంపై చర్యలు తీసుకోవాలి. వచ్చే రబీ సీజన్‌కు ఇప్పటికే యూరియా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అని నిర్దేశించారు. యూరియా సరఫరాపై మరోమారు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీజన్‌లో ముందుగానే సాగునీరు ఇవ్వడం వల్ల పంటల సాగు ఎక్కువ చేశారని, వాణిజ్య పంటలైన ఉల్లి, మామిడి, టమోటా, చీనీ ఉత్పత్తి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పారు.


డ్రామా ఆడిన వారిపై చర్యలు..

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు, రైతులకు మద్దతు ధరపైనా సీఎం సమీక్షించారు. ఉల్లి ధర క్వింటాకు రూ.1,200కు తగ్గకుండా చూడాలని మార్కెటింగ్‌ శాఖ, మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. రైతులెవరైనా క్వింటా రూ.1,200 కన్నా తక్కువ ధరకు అమ్ముకుంటే.. ఆ మిగులు ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఉల్లి పంట ఉత్పత్తి అంచనా మేరకు నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలను కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ఉల్లిని రైతుబజార్లతో పాటు బహిరంగ మార్కెట్లకు తరలించాలని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగు మందుల డబ్బాతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం ఆరా తీశారు. పంటను కనీసం మార్కెట్‌కు తీసుకురాకుండా పురుగు మందు తాగినట్లు డ్రామా ఆడినవారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అరకు కాఫీకి సోకిన కాయతొలుచు పురుగుపై సీఎం ఆరా తీశారు. ఇప్పటికి 80 ఎకరాల్లో తెగులు సోకితే 60 ఎకరాల్లో పంట తొలగించామని ఉద్యానశాఖ అధికారులు చెప్పారు. ఈ తెగులు ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.


‘తురకపాలెం’ వ్యాధి మూలం గుర్తించండి..

గుంటూరు జిల్లా తురకపాలెంలో తలెత్తిన అనారోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని వైద్య ఆరోగ్యశాఖను సీఎం ఆదేశించారు. వ్యాధికి మూలం ఎక్కడుందో గుర్తించాలని, దీనినో కేస్‌ స్టడీగా తీసుకుని, ఇతర ప్రాంతాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా సహా విష జ్వరాలు సోకకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ఐదు గంటల పాటు సీఎం వివిధ అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎస్‌ విజయానంద్‌, వ్యవసాయం, వైద్యారోగ్యం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


పౌర సేవలు మరింత మెరుగుపడాలి

పెన్షన్లు, ఉచిత గ్యాస్‌, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పంచాయతీరాజ్‌.. ఇలా వేర్వేరు శాఖల్లో అందిస్తున్న సేవలపై ఇంకా సంతృప్త స్థాయి పెరగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ఇక నుంచి ప్రతి వారమూ సమీక్షిస్తానన్నారు. కొన్ని చోట్ల రాజకీయ కారణాలు కూడా ప్రజల సంతృప్త స్థాయిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ఆర్టీజీఎస్‌ నుంచి సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ప్రతి ప్రభుత్వ శాఖ పౌరసేవలను మెరుగుపరచుకోవాలి. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను డేటా అనలటిక్స్‌ ద్వారా విశ్లేషించి, తగిన నిర్ణయం తీసుకుంటాం. అలాగే కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లు ఏ మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఉపకరిస్తున్నాయన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం’ అని తెలిపారు.


యూరియా కోసం ఉదయగిరిలో బారులు

ఉదయగిరి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ఉదయగిరిరైతు సేవా కేంద్రం-2లో సోమవారం యూరియా పంపిణీ సందర్భంగా రైతులు బారులు తీరారు. అధికారులు ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయలేదని, అందరికీ యూరియా దక్కలేదని పలువురు ఆరోపించారు. ఉదయగిరికి 400 బస్తాల యూరియా కేటాయించగా.. తొలుత ఒక్కో రైతుకు రెండు బస్తాలు, తర్వాత ఒక్కో బస్తా పంపిణీ చేశారు. క్యూలోని రైతులందరికీ యూరియా దక్కకపోవడంతో వాగ్వాదాలు జరిగాయి. ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రారంభించగా, మధ్యాహ్నం 3 గంటలకే 400 బస్తాల యూరియా అయిపోయింది. బస్తా రూ.266.50లకు విక్రయించాల్సి ఉండగా.. అధికారులు రూ.280 వసూలు చేశారని రైతులు చెబుతున్నారు. కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బస్తాలు కొనుగోలు చేసి, అనంతరం బస్తా రూ.500 చొప్పున విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Untitled-2 copy.jpg

Updated Date - Sep 09 , 2025 | 04:18 AM