Urea Supply: యూరియా వదిలేయండి
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:43 AM
రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. అధికార పగ్గాలు చేపట్టాక అన్ని శాఖల్లోనూ అనుసరించాల్సిన విధానపరమైన మార్పులపై స్పష్టత ఇచ్చానని.. కానీ యూరియా విషయంలో అధికారులు...
బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తాం
అధికారుల పంథా మారనందునే సమస్య
యూరియా నియంత్రణపై రైతుల్లో అవగాహన పెంచాలి
అవసరమైతే డోర్ డెలివరీ చేస్తాం
త్వరలో విధివిధానాలు ఖరారు
తురకపాలెం లాంటి ఘటనలు జరక్కూడదు
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నిర్దేశం
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. అధికార పగ్గాలు చేపట్టాక అన్ని శాఖల్లోనూ అనుసరించాల్సిన విధానపరమైన మార్పులపై స్పష్టత ఇచ్చానని.. కానీ యూరియా విషయంలో అధికారులు తమ పంథా మార్చుకోలేదని అసహనం వ్యక్తంచేశారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో ఆయనీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని శాఖలూ గాడిలో పడ్డాయని.. యూరియా సరఫరాపై మాత్రం ముందస్తు ప్రణాళికలు, చర్యలు అమలు చేయకపోవడం వల్ల సమస్యలొచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని.. రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ‘యూరియా వాడని రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తాం. పీఎం ప్రణామ్ కింద రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీని రైతులకు ఇచ్చేద్దాం. విధివిధానాలను త్వరలో ప్రకటిస్తాం. రబీ నుంచి ఈ-క్రాప్ విధానం తప్పకుండా అమలు కావాలి. ఈ విధానం ద్వారా ఇప్పటి నుంచే ఎవరెవరు.. ఎంతెంత పంట వేస్తున్నారో గుర్తించి.. అవసరమైన యూరియాను సరఫరా చేద్దాం’ అని చెప్పారు. ప్రజలు తినే రకాలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని.. డిమాండ్-సరఫరాకు తగిన పంటలు పండించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.
మెడికల్ కాలేజీలపై రాజకీయం
పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయని సీఎం స్పష్టంచేశారు. 10 మెడికల్ కళాశాలలకు రూ.4,950 కోట్లు వ్యయమవుతుందని, గత పాలకులు కేవలం 5 శాతం నిధులే ఖర్చు పెట్టారని.. ఇప్పుడు వాటి నిర్మాణం పూర్తికి రూ.4 వేల కోట్ల వరకూ అవసరమవుతాయని వివరించారు. దీనిపై కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజా ప్రయోజనం కోసం పీపీపీలే ఉత్తమ విధానమని స్పష్టంచేశారు. గతంలో 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని, తాను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగామని చెప్పారు. రాష్ట్రంలో తురకపాలెంలాంటి ఘటనలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఈ ఘటన కచ్చితంగా మానవ తప్పిదమేనని.. ఎక్కడా నీటి కాలుష్యం జరగడానికి వీల్లేదని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో పాటు సంజీవని ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. మొదట చిత్తూరు జిల్లాలో, తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. యూనివర్సల్ హెల్త్ కార్డు గేమ్ చేంజర్‌గా మారుతుందని చెప్పారు.
ఆక్వా రైతుల రిజిస్ర్టేషన్ తప్పనిసరి..
ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. అమెరికా సుంకాల నేపథ్యంలో ఈ రంగం సంక్షోభంలో పడకుండా చూడాలని కేంద్రానికి లేఖలు రాశానని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు ఉండగా, రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాయితీ విద్యుత్ కోసం జోన్, నాన్‌జోన్‌గా విభజించారని, ఆక్వా రైతుల రిజిస్ర్టేషన్ నెలరోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పౌల్ర్టీ వ్యర్థాలను ఇష్టానుసారం పడేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థూల ఉత్పత్తిలో కీలకమైన పాలు, గుడ్లు, మాంసానికి మూలమైన పశుసంవర్ధకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్బన్ ప్రాంతాలను మినహాయించి, 157 నియోజకవర్గాల్లో ఒక్కో యూనిమల్ హాస్టల్ నిర్మించాలని సూచించారు. గోశాలల నిర్మాణంతో పశుసంపద రాష్ట్రానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తోందని చెప్పారు. పశుదాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే మంచి ఆదాయం వస్తుందని.. ఈ దిశగా ఆలోచన చేయాలని కలెక్టర్లకు సూచించారు. చర్చలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు.
రైతు సేవా కేంద్రం స్థాయి నుంచే డ్యాష్ బోర్డులు
వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రధాన ముడి సరుకని.. ఈ ప్రాథమిక రంగానికి కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. ఇందుకోసం రైతుసేవా కేంద్రం స్థాయి నుంచే డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో చెప్పారు. ఉద్యానవనాలు ప్రస్తుతం 30 శాతం ఉన్నాయని.. 50 శాతానికి తీసుకెళ్తే రాష్ట్రానికి, రైతులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. పాడి పరిశ్రమ గణనీయమైన వృద్ధి నమోదు చేస్తోందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో పాల ఉత్పత్తి 36.34 లక్షల టన్నుల నుంచి 37.26 టన్నులకు పెరిగిందన్నారు. రొయ్యల ఎగుమతిపై అమెరికా సుంకాలు 60 శాతం వరకు ఉన్నాయని.. ప్రస్తుత సవాళ్లను అధిగమించేలా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. రబీకి యూరియా కొరత అనే మాటే ఉండకుండా చేస్తామని.. యూరియా సరఫరాపై కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని చెప్పారు.