యూపీఎస్సీ ‘శిక్ష’ణ!
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:25 AM
ఉన్నత విద్య కోసం అభ్యర్థులకు ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణ విషయంలో బీసీ సంక్షేమ శాఖ వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. సాంఘిక సంక్షేమశాఖ నిబంధనలకు పూర్తి భిన్నంగా నిబంధనలు ప్రవేశపెట్టి అభ్యర్థులను అసంతృప్తికి గురి చేస్తోంది. సరైనా ప్రచారం నిర్వహించకుండా, దరఖాస్తుల స్వీకరణ గడువు తక్కువగా విధించి ఉచిత శిక్షణకు ఔత్సాహికులను దూరం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- బీసీ సంక్షేమశాఖ తీరుపై విమర్శల
- యూపీఎస్సీ ప్రిలిమనరీ ఎగ్జామినేషన్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
- అర్హులైన ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం
- అభ్యర్థులకు అనుకూలంగా సోషల్ వెల్ఫేర్.. ప్రతిబంధకంగా బీసీ వెల్ఫేర్ నిబంధనలు
- ఆదాయ పరిమితులు, కుల రిజర్వేషన్లు, గడువు తేదీలపై అభ్యర్థుల అసంతృప్తి
- ప్రచారం నిర్వహించని బీసీ వెల్ఫేర్.. అభ్యర్థుల నుంచి స్పందన కరవు
ఉన్నత విద్య కోసం అభ్యర్థులకు ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణ విషయంలో బీసీ సంక్షేమ శాఖ వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. సాంఘిక సంక్షేమశాఖ నిబంధనలకు పూర్తి భిన్నంగా నిబంధనలు ప్రవేశపెట్టి అభ్యర్థులను అసంతృప్తికి గురి చేస్తోంది. సరైనా ప్రచారం నిర్వహించకుండా, దరఖాస్తుల స్వీకరణ గడువు తక్కువగా విధించి ఉచిత శిక్షణకు ఔత్సాహికులను దూరం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉన్నత విద్య కోసం ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణ విషయంలో సంక్షేమ శాఖలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానం కాగా.. అందుకు విరుద్ధంగా ఆయా శాఖలు ప్రవర్తిస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ) ప్రిలిమనరీ ఎగ్జామినేషన్స్ - 2026కు ఉచిత శిక్షణ ఇవ్వటం కోసం ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం విషయంలో బీసీ వెల్ఫేర్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అనుసరిస్తున్న విధానానికి, బీసీ వెల్ఫేర్ అనుసరిస్తున్న విఽధానాలకు తేడా ఉండటంతో ఔత్సాహిక దరఖాస్తుదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు ప్రకటించగా.. బీసీ వెల్ఫేర్ మాత్రం తన దారి వేరన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఆదాయ పరిమితుల విషయంలో కూడా బీసీ వెల్ఫేర్ విధానాలు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అటు సోషల్ వెల్ఫేర్ నిర్దేశించిన నిబంధనలకు, ఇటు బీసీ వెల్ఫేర్ నిర్దేశించిన నిబంధనలకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది.
సోషల్ వెల్ఫేర్ మార్గదర్శకాలు భేష్
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు - 2026కు ఉచిత శిక్షణ అందించేందుకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మార్గదర్శకాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని దరఖాస్తుదారులు అంటున్నారు. జనరల్ స్టడీస్ (పేపర్ - 1), సీఎస్‌ఏటీ (పేపర్ - 2), ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ వంటివి ఉచితంగా అభ్యర్థులకు అందిస్తుంది. దీంతో పాటు ఒక్క విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ భవన్ స్టడీ సెంటర్‌లో 120 మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులకు నిర్దేశించిన సీట్ల రిజర్వేషన్ విషయానికి వస్తే.. ఎస్సీలకు 80 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 10 శాతం, ఓసీలకు 4 శాతం, పీడబ్ల్యూడీ - 3 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించారు. పైవాటిలో మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. రెగ్యులర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని నిబంధన విధించారు. దరఖాస్తు చేసుకోవటానికి అభ్యర్థులకు రూ. 8 లక్ష ల సంవత్సర ఆదాయాన్ని నిర్ణయించారు.
వివాదాస్పదంగా బీసీ వెల్ఫేర్ మార్గదర్శకాలు
బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మార్గదర్శకాలు వివాదాస్పదంగా ఉన్నాయి. గొల్లపూడిలోని బీసీ స్టడీ సర్కిల్ కేంద్రంగా శిక్షణ ఇవ్వటానికి అభ్యర్థులకు సంవత్సర ఆదాయాన్ని రూ.లక్షగా నిర్ణయించారు. రేషన్ కార్డు తీసుకోవటానికి రూ.2 లక్షల ఆదాయాన్ని ఇస్తున్నపుడు, దాని కంటే తక్కువుగా రూ. లక్ష ఆదాయ పరిమితి పెట్టడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున ఇచ్చారు. ఓసీ, పీబ్ల్యూడీలకు ఇవ్వలేదు. ఓసీలో కూడా దారిద్య్ర రేఖకు దిగువున ఉండే వారు ఉంటారు. ఎకనమికల్ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) ఉంటారు. వీరు కూడా ఉచిత శిక్షణ తీసుకోవటానికి అర్హులే. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినపుడు బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఎందుకు అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటం లేదన్న దానిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డీఎస్సీ సందర్భంలో అన్నివర్గాలకు రిజర్వేషన్లు కల్పించినపుడు.. యూపీఎస్సీ ఉచిత శిక్షణకు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
హడావిడిగా ముగిసిన దరఖాస్తుల గడువు
ఉచిత శిక్షణ కోసం నిర్వహించే పరీక్షలకు సోషల్ వెల్ఫేర్ కంటే కూడా బీసీ వెల్ఫేర్ అభ్యర్థులకు ఎక్కువ సమయం ఉంది. బీసీ వెల్ఫేర్ తరఫున దరఖాస్తులు చేసుకునే వారికి డిసెంబరు 5వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు. కానీ మంగళవారం నాటికి దరఖాస్తులు ఆఖరు తేదీగా ప్రకటించారు. అదే సోషల్ వెల్ఫేర్ అభ్యర్థులకైతే ఈ నెల 30వ తేదీన పరీక్షలను నిర్వహిస్తున్నారు. కానీ ఈ నెల 26 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కూడా నెలాఖరు వరకు గడువు ఇవ్వటానికి అవకాశం ఉన్నా ఇవ్వకపోవటం గమనార్హం.
సరైన ప్రచారం లేదు..
సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అభ్యర్థుల కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటంతో స్పందన వచ్చింది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. కానీ బీసీ వెల్ఫేర్ తరఫున ఉచిత శిక్షణకు స్పందన కొరవడింది. చాలా తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సరైన ప్రచారాన్ని నిర్వహించలేదు. ప్రచారం నిర్వహించటానికి కూడా ఆసక్తి చూపలేదని విమర్శలు ఉన్నాయి.