Share News

Project mismanagement: పది గజాల దారి లేక..

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:35 AM

రాష్ట్రంలో ట్రాన్స్‌కో అధికారులు సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని కాసుల పంటగా మార్చుకుంటున్నారు. కమీషన్ల కోసం దారీతెన్ను లేని సబ్‌ స్టేషన్లను నిర్మించడం..

Project mismanagement: పది గజాల దారి లేక..

  • రెండేళ్లుగా నిరుపయోగంగా ‘నూజివీడు’ సబ్‌స్టేషన్‌

  • కాసుల కక్కుర్తితో ట్రాన్స్‌కో నిర్వాకం

  • సబ్‌స్టేషన్ల నిర్మాణంలో దోపిడీపర్వం

  • దారిలేని ఆరు ఎకరాలు 2 కోట్లకు కొనుగోలు

  • రూ. 34 కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తి

  • ఇన్ని రూ.కోట్లు పోసినా ఆపరేషన్‌లోకి తేలేని స్థితి

  • నెల్లూరులో లెస్‌ టెండరు తిరస్కరణ

  • మళ్లీ టెండరు పిలిచి రూ.6కోట్లకు ఎసరు

  • రాజధానిలో తాళ్లాయపాలెం అప్‌గ్రేడేషన్‌కు వీలు

  • కానీ, 300 కోట్లతో దానికి దగ్గర్లోనే మరో సబ్‌స్టేషన్‌

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ట్రాన్స్‌కో అధికారులు సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని కాసుల పంటగా మార్చుకుంటున్నారు. కమీషన్ల కోసం దారీతెన్ను లేని సబ్‌ స్టేషన్లను నిర్మించడం.. తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టును రద్దు చేసి, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌ అధిక ధరకు కోట్‌ చేసినా టెండరు కట్టబెట్టడం వంటివి చేస్తున్నారు. వీరి నిర్వాకం వల్ల రూ.కోట్ల ప్రజాధనం నిరుపయోగంగా మారి, విద్యుత్తు ధరల రూ పంలో తిరిగి ప్రజలకే భారంగా మారుతోంది. ఏలూ రు జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని నూజివీడు మండలం దిగవల్లి గ్రామ సమీపంలోని రమణక్కపేటలో 132/33కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి 2020లో సుమారు ఆరు ఎకరాలను రూ.రెండు కోట్లు వెచ్చించి సేకరించారు. ఇక్కడ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.37.94 కోట్లు కేటాయించారు. 2023 చివరికి సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. అయితే సబ్‌స్టేషన్‌కు వెళ్లేందుకు 10 గజాల స్థలాన్ని సేకరించడంలో అధికారుల ఉదాసీనత కారణంగా రెండేళ్లుగా అది నిరుపయోగంగా ఉండిపోయింది. సబ్‌స్టేషన్‌కు స్థలాన్ని సేకరించే సమయంలోనే దారి ఉందా లేదా అని చూసుకోవాల్సిన అధికారులు కమీషన్ల కక్కుర్తిలో పడి ఆ విషయమే వదిలేశారు. అప్పట్లో అధికార వైసీపీ నాయకుడు ఒత్తిడి వల్లే తక్కువ ధర పలికే పొలాన్ని అధిక ధర వెచ్చించి కొనుగోలు చేశారని, ఇప్పుడు దారి లేకపోవడంతో, ఆ పది గజాల కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.


రూ.6 కోట్లకు ‘టెండరు’

నెల్లూరు టౌన్‌లో రాజేంద్రనగర్‌ వద్ద 132/33కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ట్రాన్స్‌కో అధికారులు రూ.34.27 కోట్లతో 2023-24లో టెండరు పిలిచారు. ఈ టెండరును 4.7 శాతం తక్కువకు అంటే రూ.32.66 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వివిధ కారణాలతో టెండరు రద్దు చేశారు. కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌తో టెండరు అంచనా ధరలను ఆరు శాతం పెంచి, తిరిగి ఈ ఏడాది ప్రారంభంలో టెండరు పిలిచారు. అంటే, టెండరు ధర రూ.36.32 కోట్లకు పెరిగింది. దీన్ని మరో కాంట్రాక్టర్‌ 6.7 శాతం అధికానికి కోట్‌ చేశారు. దీంతో టెండరు ధర రూ.38.75 కోట్లకు చేరుతుంది. లెస్‌కు ఇచ్చిన దానికన్నా అధికంగా సుమారు రూ.ఆరు కోట్లకు టెండరు ధర పెరిగింది. అయితే చిత్రంగా ఈ టెండరును రూ.32.98 కోట్లకే అగ్రిమెంట్‌ చేసుకున్నారు. కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రకారం ధరలు పెరిగినా.. కాంట్రాక్టరు 6.7 శాతం అధికానికి కోట్‌ చేసినా ధర ఎందుకు తగ్గిందనేది ప్రశ్న..? ఇక్కడే ట్రాన్స్‌కో అధికారులు తమ తెలివితేటలు చూపారు. కొత్త ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రకారం అంచనాలను పెంచినా, మెటీరియల్‌ క్వాంటిటీ్‌సను తగ్గించి చూపారు. పని జరుగుతూ ఉండగా, డీవియేషన్‌ స్టేట్‌మెంట్‌ పేరుతో మళ్లీ క్వాంటిటీస్‌ పెంచి యథాతథంగా పెంచిన ధరల ప్రకారం కాంట్రాక్టరుకు లబ్ధి చేకూరుస్తారు.

అప్‌గ్రేడ్‌ చేస్తే సరిపోయేదానికి రూ.300 కోట్లు వృథా

రాజధాని అమరావతిలోని తాళ్లాయపాలెం వద్ద 400/ 220కేవీ జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ను సుమారు 20 ఎకరాల్లో నిర్మించారు. ఈ సబ్‌స్టేషన్‌ను 33 కేవీకి అప్‌గ్రేడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ అలా చేయకుండా లింగాయపాలెం వద్ద సుమారు రూ.300 కోట్లతో స్థల సేకరణ, సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపడుతున్నారు. చిత్రమేమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో రాయదుర్గం 400కేవీ జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌ కేవలం ఐదు ఎకరాల్లో ఉంది. ఇక్కడే 33 కేవీ అప్‌గ్రేడేషన్‌ చేశారు. అలాగే లింగాయపాలేనికి సమీపంలోనే ఉన్న తాడేపల్లి, ఉండవల్లి సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేసేందుకు టెండర్లు పిలిచారు. తాళ్లాయపాలేన్ని మాత్రం అప్‌గ్రేడ్‌ చేసుకునే వెసులుబాటు ఉ న్నా, దాని చెంతనే ఉన్న లింగాయపాలెంలో కోట్లాది రూపాయలతో మరో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపడుతున్నారు.

Updated Date - Dec 26 , 2025 | 04:35 AM