Chief Minister Chandrababu Naidu: లే-అవుట్లలో ఖాళీ స్థలాలు పరిశ్రమలకు కేటాయించండి
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:41 AM
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం వేసిన లే-అవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల..
లబ్ధిదారులకు ఆసక్తి లేనివాటిని ఇవ్వండి
వారికి ప్రత్యామ్నాయ స్థలాలు: చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం వేసిన లే-అవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో చాలా వరకు ఇప్పటికీ గ్రౌండింగ్ కాకుండా ఖాళీగానే ఉన్నాయి. లబ్ధిదారుల పేర్ల మీద సెంటు, సెంటున్నర చొప్పున రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపని వారి రిజిస్ర్టేషన్లు రద్దు చేసి వాటిని పరిశ్రమలు నెలకొల్పడానికి ఉపయోగించుకోవచ్చు’ అని కాకినాడ కలెక్టర్ షన్మోహన్ చేసిన సూచనతో సీఎం ఏకీభవించారు. ఇదే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘పేదల ఇళ్ల నిర్మాణం కోసం భారీ ఎత్తున భూములు సేకరించారు. 300 నుంచి 600 ఎకరాల్లో లే-అవుట్లు వేశారు. అవన్నీ చాలా వరకు ఖాళీగాఉన్నాయి. వాటిని ఎంఎ్‌సఎంఈ పార్కులుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది’ అని సూచించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ‘గతంలో ఇళ్ల పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు. ఆ స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే సరే.. ఇష్టం లేదని చెబితే అలాంటి లే-అవుట్లను గుర్తించి ఎంఎ్‌సఎంఈలకు కన్వర్ట్ చేయండి. లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సమకూరుస్తుంది’ అని సీఎం తెలిపారు.
పేదల గృహాలపై ప్రజెంటేషన్
పేదల ఇళ్ల నిర్మాణానికి పొజిషన్ సర్టిఫికెట్లు చాలా అవసరమని, ఇవి లేకపోవడంతో కేంద్రం అర్బన్ హౌసింగ్ కింద మంజూరు చేసిన ఇళ్లను వినియోగించుకోలేకపోతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చంద్రబాబు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పేదల గృహ నిర్మాణంపై ఆ శాఖ ప్రధానకార్యదర్శి అజయ్ జైన్ ప్రజెంటేషన్ ఇచ్చారు.